- రెండు నెలల్లో మరో 35 వేల ఉద్యోగాలు: సీఎం రేవంత్
- జాబ్స్ లేకనే కొందరు యువత డ్రగ్స్‌కు బానిసైతున్నరు
- స్టూడెంట్లకు స్కిల్ ట్రైనింగ్ సర్కారు బాధ్యత
- సరైన ఫ్యాకల్టీ లేకుంటే ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు
- త్వరలో పాలిటెక్నిక్ కాలేజీలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడి
- బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తయారుచేయడంతో పాటు స్కిల్ హబ్ కు చిరునామాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకనే కొందరు యువత డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిసవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్లకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, వారికి ఉపాధి అవకాశాలు చూపిస్తామని తెలిపారు.బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్) స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద 38 ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో ఈ శిక్షణను ఇవ్వనున్నట్టు చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న యువతను తయారు చేసి.. ఉపాధికి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులతో చర్చలు జరిపామని, వారు ఇచ్చిన ప్రతిపాదనలతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు.
ఈ ఏడాది పది వేల మంది డిగ్రీ విద్యార్థులు తమ పట్టా పొందే నాటికి నైపుణ్యాన్ని నేర్చుకునేలా ఈ ప్రోగ్రాం రూపకల్పన చేసినట్లు వివరించారు. బీఎఫ్ఎస్ఐ ట్రైనింగ్ ఉచితంగా ఉంటుందని, ఈ విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలకు ఢోకా ఉండదని ఆయన అన్నారు. ఈ కోర్సు చదివే విద్యార్థులకు ఫీజును చెల్లించేందుకు వచ్చిన ఎక్విప్ సంస్థను, ఈ కోర్సు సిలబస్ తయారుచేసిన ప్రతినిధులను అభినందించారు.
బీఎఫ్ఎస్ఐ స్టూడెంట్లకు ఇంటర్న్ షిప్
బీఎఫ్ఎస్ఐ శిక్షణ పొందే డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్లకు వచ్చే ఏడాది నుంచి ఇంటర్న్ షిప్ ప్రవేశపెడుతున్నామని, దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జి కూడా సమకూరుతుందని సీఎం రేవంత్ అన్నారు. నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, చదివిన డిగ్రీకి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు గ్యాప్ ఉంటోందని సీఎం అన్నారు. బీఎఫ్ఎస్ఐకు అవసరమైన స్కిల్స్ నేర్పేందుకు బీఎస్ఎఫ్ఐ స్కిల్ కోర్సును ప్రారంభిస్తున్నామని చెప్పారు.
ప్రతిభ ఉన్నా, నైపుణ్యం లేకపోతే యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కవని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఏటా మూడు లక్షల మంది స్టూడెంట్లు డిగ్రీ పట్టాలు పొంది కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని, కానీ ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించిన నైపుణ్యం లేకపోవడంతో వారిలో చాలామందికి ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. ఇండస్ట్రీలు కూడా స్కిల్ ఉన్న ఉద్యోగుల కొరత ఉందని చెప్తున్నాయని, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నదని, దాంట్లో భాగంగానే యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నదని వివరించారు.
ఫ్యాకల్టీ, ఫెసిలిటీ లేకుంటే గుర్తింపు రద్దు
ఇంజినీరింగ్ విద్యార్థులకు జాబ్ స్కిల్స్ అందడం లేదని.. కొన్ని కాలేజీల్లో లెక్చరర్లతో పాటు కనీస ప్రమాణాలు ఉండటం లేదని సీఎం రేవంత్ అన్నారు. ఆ కాలేజీలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. గత పదేండ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కొంతమంది యువత గంజాయి, డ్రగ్స్ లాంటి వాటికి బానిసయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పట్టుబడిన డ్రగ్ పెడ్లర్స్‌లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళన కలిగించిందన్నారు. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన సూచించారు. వ్యసనాల నుంచి యువత బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు.
త్వరలోనే పాలిటెక్నిక్ కాలేజీల అప్‌గ్రేడ్
టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏసీటీ)గా మారుస్తున్నామని, ఇప్పటికే మల్లేపల్లి ఐటీఐలో పైలెట్ ప్రాజెక్టు అమలు చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. రాబోయే రెండేండ్లలో రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామని, దీంట్లో చదివిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వస్తుందన్నారు. ఇటీవల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పి, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను బోర్డు చైర్మన్ గా, శ్రీనిరాజును వైస్ చైర్మన్‌గా నియమించినట్టు చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి.. తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు.
డిసెంబర్ లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పర్యటన
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో పాటు సత్య నాదేండ్ల, శాంతను నారాయణ, ప్రేమ్ జీ కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన వారేనని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వీళ్లు ప్రపంచంలోనే నాలుగు పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారని, అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వారందరినీ డిసెంబర్ లో హైదరాబాద్ పర్యటనకు ఆహ్వానిస్తున్నామన్నారు.
రెండు, మూడు నెలల్లో మరో 35వేల ఉద్యోగాలు
రాష్ట్రంలో గత పదేండ్లలో నిరుద్యోగం పెరిగిందని.. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లోనే 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజా ప్రభుత్వం గుర్తించిందని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు.
డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో 35 వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నదని చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రకటించారు.
బ్యాకింగ్, ఫైనాన్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు: శ్రీధర్ బాబు
రానున్న కొన్ని ఏండ్లలోనే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ రంగాల్లో ఐదు లక్షల మంది ఉద్యోగుల అవసరం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ ఖాళీల భర్తీకి నైపుణ్యం కలిగిన వారిని తయారు చేయగలిగితే రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. బీఎఫ్ఎస్ఐ శిక్షణ తర్వాత కనీసం రూ.25వేల వేతనంతో ఉద్యోగులు లభిస్తాయన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఏనాడు నిరుద్యోగ యువత ఆకాంక్షలను గుర్తించలేకపోయిందని చెప్పారు. కానీ ప్రస్తుతం విద్యార్థులు, యువతకు ఉపాధి కల్పించడంపైనే తమ సర్కారు దృష్టి సారించిందని తెలిపారు.
డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల ఫైనల్ ఇయర్ లో ఆరునెలల పాటు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించడానికి పలు బ్యాంకింగ్, ఫైనాన్స్ , ఇన్సురెన్సు సంస్థలు సంసిద్ధత తెలిపాయని వెల్లడించారు. కాగా, ఎక్విప్ సంస్థ రూ.2.5 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. విద్యార్థుల డేటాతో రూపొందించిన ఎక్విప్ స్కిల్ పోర్టల్ ను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన పాల్గొన్నారు.