
- పరేడ్ గ్రౌండ్లో ఘనంగా ‘ఇందిరా మహిళా శక్తి’ సభ
- అప్పుడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం
- త్వరలో మహిళా సంఘాలకురైస్ మిల్లులు, గోదాములు.. వారి ఉత్పత్తులకు పన్ను మినహాయింపు
- -మహిళలను అభివృద్ధి చేసేందుకు సోలార్ ప్లాంట్లు, బస్సులు
- అంబానీ, అదానీకి దీటుగామన ఆడబిడ్డలు ఎదగాలి
- ఎన్నికల్లో పోటీ చేయండి..గెలిపించుకుంటం
- పదేండ్ల చంద్రగ్రహణం తొలగిందిటన్నెల్ కూలితే, పంటలు ఎండితే
- బీఆర్ఎస్ నేతలకు పైశాచికానందం
- అలాంటి వాళ్లు బాగుపడిన చరిత్ర ఎక్కడా లేదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు బలం మహిళలేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని, అప్పుడే తాము అనుకున్న ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ రాష్ట్రం రూపొందుతుందని తెలిపారు. ‘‘మీ అన్నగా మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా.. మీరు వ్యాపారం చేస్తామంటే కావాల్సిన పెట్టుబడులు, భూములు మేమిప్పిస్తాం.. కార్పొరేట్ కంపెనీలకు దీటుగా, అంబానీ, అదానీకి పోటీగా ఎదగాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. మహిళలను వ్యాపారవేత్తలను చేసేందుకు సోలార్ ప్లాంట్లు పెట్టిస్తున్నామని, ఆర్టీసీ బస్సులకు యజమానులను చేస్తున్నామని, ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.
ఐకేపీ కేంద్రాల్లో మహిళా సంఘాలు కొనుగోలు చేసే వడ్లను ఆ గోదాముల్లో నిల్వ చేయడంతో పాటు వాటిని మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో మా ఆడబిడ్డలు రాణీరుద్రమ, చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో మహిళా శక్తిని చాటారు. రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డలు తమ ఆత్మగౌరాన్ని చాటుతున్నారు. రాష్ట్రానికి పదేండ్లు పట్టిన చంద్ర గ్రహణం తొలగిపోయింది. మా ఆడబిడ్డలు ఇవాళ వెలుగులు చూస్తున్నారు.. మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తుంది.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’ అని పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోదాములు
ఐకేపీ కేంద్రాల నుంచి వడ్లు తీసుకుంటున్న కొందరు మిల్లర్లు పందికొక్కుల్లా కాజేస్తున్నారని, వాటిని తిరిగి ఇవ్వడం లేదని, లెక్కలు చెప్పడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇక ఈ పరిస్థితిని మార్చాలన్నారు. ప్రతి మండలంలో మహిళా సంఘాలతో రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని, ప్రభుత్వమే స్థలం ఇవ్వడంతో పాటు రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణాలకు అవసరమైన రుణాలు ఇప్పిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాల కాలేజీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం మహిళా సంఘాల నుంచి సరఫరా చేయా లని నిర్ణయించామన్నారు. ఇందుకు సంబం ధించి విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సెర్ప్ సీఈవోను ఆయన ఆదేశించారు.
పదేండ్ల చంద్రగ్రహణం పోయింది
తెలంగాణలో మహిళా సంఘాలకు, ఆడబిడ్డలకు పదేండ్ల చంద్ర గ్రహణం తొలగిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో పదేండ్లు స్వయం సహాయక సంఘాల మహిళలు మండల కేంద్రాలకు వెళ్లే అవకాశం ఉండేది కాదని చెప్పారు. ‘‘ఆడబిడ్డలు నిర్ణయం తీసుకొని ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆశీర్వదించడంతో 15 నెలల కింద ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఆడబిడ్డలు తలెత్తుకొని వెలుగు, స్వేచ్ఛను చూస్తున్నరు. పదేండ్ల నాటి పాలనను ఏడాది మా పాలనను మహిళలు స్వయంగా చూస్తున్నరు. మంత్రులు, అధికారులను సమన్వయం చేసి మహిళా సంఘాలను బలోపేతం చేయాలని మేం నిర్ణయించాం. సంఘాలు బలోపేతమైనప్పుడే తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. మా సర్కారు వెనుక మహిళా సంఘాలు ఉన్నాయన్న ధీమాతోనే రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్తున్నం” అని ఆయన వివరించారు.
మహిళా సంఘాల ఉత్పత్తులకు పన్నుల మినహాయింపు
గతంలో ఐకేపీ సెంటర్లను నిర్వహించే మహిళలకు కమీషన్డబ్బులు ఎన్నేండ్లకు ఇస్తారో తెలిసేది కాదని, తాము వెంటనే చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్మాణాన్ని, నిర్వహణను మహిళా సంఘాలకే అప్పగించామని, గతంలో జత బట్టలు కుడితే రూ.25 ఇస్తే తాము దానిని రూ.75కు పెంచామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంఘం భవనం కోసం రూ.25 కోట్లు కేటాయించామని సీఎం తెలిపారు. అదానీ, అంబానీలు మాత్రమే నిర్వహించే సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాల చెంతకు చేర్చామన్నారు.
మహిళా సంఘాలు 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు నిర్వహించి విద్యుత్ శాఖకు అమ్మేలా చేశామని తెలిపారు. సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామంటే, అందుకు తమకు ఆడబిడ్డలపై ఉన్న నమ్మకమే కారణమన్నారు. ‘‘కేసీఆర్ బంధువులు, పెట్టుబడిదారులకే పరిమితమైన ఆర్టీసీ బస్సుల లీజులను మా బంధువులుగా భావించే మహిళా సంఘాల్లోని మహిళలకు అప్పగించాం. మహిళా దినోత్సవం రోజు 150 బస్సులు ప్రారంభించుకున్నాం.
రాబోయే రోజుల్లో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి మహిళా సంఘాలకు అందిస్తాం. మహిళా సంఘాలు ఆర్టీసీకి ఈ బస్సులను లీజుకు ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌తో మహిళా సంఘాలు పోటీపడేలా హైటెక్ సిటీ పక్కన ఇన్ఫోసిస్, విప్రో వంటి ప్రముఖ సంస్థల పక్కన మహిళా సంఘాలకు 150 షాపులు కేటాయించాం. అక్కడ సంఘాలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ కార్పొరేట్ సంస్థలతో పోటీపడాలి. మేం అన్ని విధాలా అండగా ఉంటాం. రానున్న రోజుల్లో మహిళా సంఘాలు ఉత్పత్తులకు పన్నుల మినహాయింపుతో పాటు ముడి సరుకు కొనుగోలుకు అవసరమైన రుణాలు ఇప్పిస్తాం” అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
ఇది పేగుబంధానికి అతీతమైంది
మహిళలు పరిపాలనలో భాగస్వాముల కావాలన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రాజీవ్ గాంధీ రిజర్వేషన్లు తీసుకువచ్చారని, మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎదగాలని సోనియాగాంధీ మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంఘాల్లోని మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటే వారికి సీట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల సంక్షేమమే ఎజెండాగా మొదటి సంవత్సరంలోనే రూ.21 వేల కోట్ల జీరో వడ్డీ రుణాలు ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం మహిళా సంఘాల్లో 65 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, వారి సంఖ్యను కోటికి పెంచేందుకు వీలుగా సంఘాల్లో చేరే మహిళల వయస్సును 18 నుంచి 15 ఏండ్లకు తగ్గించడంతో పాటు 60 ఏండ్లపైన ఉన్నవారిని తీసుకుంటామని తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ‘‘మొదటి తరం ఇందిరమ్మను అమ్మా అని పిలిచారు. రెండో తరం ఎన్టీఆర్‌ను అన్నా అనేవారు. ఇప్పుడు రేవంతన్నగా మీరంతా నన్ను పిలుస్తున్నారు. నన్ను కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. అన్న అంటే ఆ కుటుంబాల బాధ్యతను తీసుకోవడమే” అని సీఎం భావోద్వేగంతో మాట్లాడారు. ఇది పేగు బంధానికి అతీతమైందని, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను ఇప్పుడు మీ ముందు నిలబడగలిగానని చెప్పారు. తాను తెలంగాణ రాష్ట్ర సీఎంగా నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు ఆడబిడ్డల ఆశీర్వాదమే కారణమన్నారు. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తిని స్ఫూర్తిగా తీసుకొని కోటి మంది మహిళలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని చెప్పారు.
టన్నెల్ కూలితే బీఆర్ఎస్కు పైశాచికానందం
ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలినా, రోడ్డుపై ప్రమాదం జరిగి మనుషులు చనిపోయినా.. ఎండలతో పంటలు ఎండినా బీఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని, సంబురాలు చేసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్న వారికి పది నెలల పాలనపై ఏడుపు ఎందుకు? పదేండ్లు పాలనలో ఉన్న వారు తమ అనుభవాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలి.. సూచనలు చేయాలి. పైశాచికానందం ఉన్నోళ్లు బాగుపడిన చరిత్ర ఎక్కడ లేదు. ఏడుపులు ఆపి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
మహిళా శక్తి పాలసీ ఆవిష్కరణ
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి ‘మహిళా శక్తి మిషన్ 2025’ పాలసీని ఆవిష్కరిం చారు. ఇందులో భాగంగా రూ.22,793 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కుతో పాటు బీమా, ప్రమాద బీమా పథకాలకు సంబంధించిన రూ.44.80 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు అందజే శారు. పాలసీని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులు సీతక్క , సురేఖ, పొన్నం, పొంగులేటి చేతుల మీదుగా ఆవిష్క రించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్స్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. సభకు ముందు సీఎం రేవంత్ వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలోని స్టాల్స్‌ను పరిశీలించారు.
ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఉత్పత్తి చేస్తున్న వస్తువులు, వాటి మార్కెటింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించా రు. మహిళా పెట్రోల్ బంకుల నమూనా పరిశీలించారు. తెలంగాణ ఉద్యమకారిణి, మహిళా జర్నలిస్టు జలజ, తెలంగాణ సాంస్కృ తిక సారథి చైర్పర్సన్ వెన్నెల రచించిన పాటల ను సీఎం ఆవిష్కరించారు. పాటల రచయిత చరణ్ అర్జున్, గాయని మధుప్రియ తదితరులను సన్మానించారు. కాగా, సభకు మహిళలు భారీగా తరలివచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మహిళా సమాఖ్య సభ్యులు చాలామంది సభకు సకాలంలో చేరుకోలేకపోయారు. వారిని సకాలంలో తీసుకురాలేకపోవడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టసభల్లో 33% మహిళలు
కేసీఆర్ తొలి ఐదేండ్ల పాలనలో మంత్రివర్గంలో మహిళలను తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్న కొండా సురేఖ, సీతక్క మహిళల తరఫున నిలబడి కొట్లాడుతున్నారని, మహిళల పక్షాన మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో మంత్రులుగా సురేఖ, సీతక్క ఉన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, సర్పంచ్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా ఆడబిడ్డలు ఉన్నారు. నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్ చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం ఇస్తాం. రాబోయే ఎన్నికల్లో 33 శాతం మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాబోతున్నారు. వారిని గెలిపించే బాధ్యత నాది.. నాయకత్వ లక్షణాలు పెంచుకోండి” అని పిలుపునిచ్చారు.