కులగణనతో సామాజిక న్యాయం : నీలం మధు ముదిరాజ్

కులగణనతో సామాజిక న్యాయం : నీలం మధు ముదిరాజ్
  • బీసీ, ముదిరాజుల అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు
  • నీలం మధు ముదిరాజ్ 

నర్సాపూర్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన కులగణన బీసీలకు సామాజికంగా, రాజకీయంగా న్యాయం జరుగుతుందని మెదక్​ పార్లమెంట్​ నియోజకవర్గ నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలో సాయి కృష్ణ గార్డెన్ లో ముదిరాజ్ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ సంకల్ప భేరి సభకు ఆయన రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్‌‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కులగణనతో బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి చేకూరుతుందన్నారు. 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ముఖ్యంగా ముదిరాజులకు భారీగా అవకాశాలు దక్కుతాయని, ఈ అవకాశాన్ని ముదిరాజ్ సోదరులు వినియోగించుకుని రాజకీయంగా ఎదగాలని సూచించారు. కులగణనలో బీసీల జనాభాలో ముదిరాజ్‌ల శాతం రాష్ట్రంలోనే ఎక్కువగా ఉందని తేలిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. చాలా ఏళ్లుగా ముదిరాజ్‌లు కోరుతున్నట్లుగా బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చే డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

అనంతరం దేశంలో ఎక్కడలేని విధంగా బీసీ కులగణన నిర్వహించినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సమితి సభ్యులు బానిస నారాయణ, బాలుగారి నర్సింలు, సురేశ్‌, రమేశ్‌, సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్లు శ్రీనివాస్, సుంకర బోయిన మహేశ్‌, లీడర్లు సంతోష్, ఆంజనేయులు, కరే కృష్ణ, సందీప్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.