ప్రజాపాలనకు నిదర్శనం .. ఇదీ పనిమంతుని లక్షణం!

ప్రజాపాలనకు  నిదర్శనం ..  ఇదీ పనిమంతుని లక్షణం!

సుంకన్నా ఓ బొంకు బొంకరా అంటే..  మా ఊరి మిరియాలు మామిడికాయలంత ఉంటాయన్నాడట ఒకడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను వరదలా రప్పించిన విషయం కూడా అట్లాగే ఉంది. కేటీఆర్ సూటు, బూటు వేసుకుని నాలుగు ఇంగ్లీష్​ ముక్కలు అదరగొట్టగానే  ఆహా ఓహో అని బీఆర్​ఎస్​ నాయకులు జబ్బలు చరుచుకున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను జనం ముందుకు తేలేదు. తెచ్చే అవకాశం లేదు. ఏమీలేని దగ్గర ఎంపలి చెట్టే మహావృక్షం అన్నట్లుగా బాగా ఇంగ్లీష్​ మాట్లాడే మంత్రి కేటీఆర్ హల్​చల్​ చేశారు. పైగా  ముఖ్యమంత్రి పుత్రుడు. కాబట్టి ఆయన చెప్పే మాటల గురించి, ఆయన పనితీరు గురించి చుట్టు పక్కలవారు చెప్పే మాటలు, చేసే భజనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.  

ఐటీ రంగం అంతెత్తు ఎగిరి పడిందని, పెట్టుబడులు  వరదలా వచ్చి పడుతున్నాయని చెప్పుకున్నారు. చెప్పించుకున్నారు. అయితే కావొచ్చనే ధోరణిలో తెలంగాణ సమాజమూ భావించింది. అంటే వాస్తవాలు  తెలుసుకునే  ద్వారాలు అప్పటికే సంపూర్ణంగా మూసుకుపోయాయి. తెలిసినవారు జనాలకు చెప్పడానికి సాహసించలేదు. వెరసి అసలు నిజాలు బయటకు రాలేదు. తెలంగాణలో  రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రారంభం అయిన ప్రజాపాలనలో చాలా విషయాలు ప్రజలకు అర్థం అవుతున్నాయి. మన పలుకుబడి ఎంత? మన ఖజానా లోటు ఎంత?. కరెంట్ కహానీలు ఏమిటనే విషయాలు జన సమూహానికి తెలిశాయి. ఇప్పుడు బొంకడానికి, బుకాయించడానికి వీలు లేదు.  అన్ని లెక్కలు బయట పడుతున్నాయి. దీంతో తాజా విపక్ష మిత్రులు కిమ్మనకుండా ఉండిపోతున్నారు.   

సీఎంగా తొలి విదేశీ పర్యటన

హైటెక్కు హంగులు లేని, కరువు జిల్లా పాలమూరు నుంచి వచ్చిన రైతు బిడ్డ  రేవంత్  సీఎంగా తొలిసారి విదేశీ పర్యటన చేశారు. తన రాష్ట్ర అవసరాలు ఏమిటో ఆయనకు బాగా తెలుసు. రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడుల గురించి వివరమూ తెలుసు. అందుకే తొలి పర్యటనలోనే రూ. 40 వేల కోట్ల  పైగా పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రానికి రప్పించారు. అదీ ఒక్క రోజు మీటింగ్ లోనే. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు. తెలంగాణ నుంచి వెలువడుతున్న అన్ని భాషల దినపత్రికలు వెల్లడించిన విషయాలు. అయితే సీఎం రేవంత్ ఇంగ్లీష్ పై అంగీలు చించుకుంటున్నవారికి ఈ భారీ పెట్టుబడులే చెంపపెట్టు. 

సీఎం రేవంత్​ దావోస్​కు  వెళ్లింది పెట్టుబడులకు తప్ప భాషా ప్రావీణ్యత పోటీలకు కాదన్న విషయం గమనిస్తే సరిపోతుంది. భాషాభివేశాలు గురించి ముచ్చటెందుకుగానీ, ప్రజల జీవన స్థితిగతులు మార్చాలనే తపన ఉంటే ఎవ్వరైనా ఇట్లాగే పెట్టుబడులు తెస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం నెలన్నర రోజులు మాత్రమే అయింది.  ఇంత తక్కువ వ్యవధిలోనే  ఏడాది కాలంలో చేసే పనులను  రేవంత్​ ప్రభుత్వం చేసి చూపించింది. 

ప్రజాపాలనకు  నిదర్శనం

పెట్టుబడుదారులు ఎవరైనా, తెలంగాణ అస్తులు కొట్టెయ్యాలని అనుకొంటే వారిని వ్యతిరేకించాల్సిందే. ప్రభుత్వం కేవలం వసతులు కల్పించడమే కర్తవ్యంగా ఉండాలి తప్ప అంతకు మించి  ఏమి చేసినా దాన్ని నిలదీయాల్సిందే. అదానీ, ఇంకా ఎవరైనా, ఏరూపంలో వస్తున్నారనేది ముఖ్యం. రాజకీయ విమర్శ చేయడం వల్ల ప్రయోజనం లేదు.  కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఒకే ఒక్క విదేశీ పర్యటనలోనే 40వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. దావోస్ లో ఒకే రోజు రికార్డు స్థాయిలో ఒప్పందాలు చేసుకున్నది. అదానీ గ్రూపు పెట్టుబడి 12,400 కోట్ల రూపాయలు. జిందాల్  ప్రాజెక్టు కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలు.  8 వేల కోట్లతో  గోధీ లిథియం గిగా ప్రాజెక్టు ఫ్యాక్టరీ కోసం, వెబ్  డేటా సెంటర్ కోసం రూ. 5,200 కోట్లు పెట్టుబడులు తెచ్చింది. ఇంతే కాదు  ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణ. గోద్రెజ్ కెమికల్ ప్లాంట్,  ఖమ్మంలో పామాయిల్  సీడ్ గార్డెన్  తదితర పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు తెస్తున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. ఇదంతా మనందరి కళ్లముందు జరిగిందే. దీన్నిబట్టి చూస్తే రేవంత్​ ప్రభుత్వం ముమ్మాటికీ చేతల ప్రభుత్వమని, ఇది ప్రజా పాలనకు నిండు నిదర్శమని చెప్పక తప్పదు.  

దావోస్​లో తెలంగాణ కల్చర్​

గత బీఆర్​ఎస్​ పాలనలో మంత్రులు, నాయకులు తెలంగాణ  సంస్కృతిని  ఎల్లలోకాలకు  ఎత్తి చూపెట్టామని చెప్పుకున్నారు.  ఎక్కడా దానికి సంబంధించిన  వాస్తవాలు బయటకు రాలేదు. కానీ, రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా  తెలంగాణ కల్చర్ ప్రతిబింబించే విధంగా అక్కడ వేదికలు ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వాహకులే ఆశ్చర్యపోయేలా మన సాంస్కృతిక, వారసత్వపు కీర్తిని చాటిచెప్పింది మన ప్రభుత్వ యంత్రాంగం. అక్కడ ప్రత్యేక ఆకర్షణగా, పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించేలా మన విధానాలన్నీ  ప్రత్యేకంగా నిలిచాయి. ఒక్క రోజులోనే 60 సమావేశాలు. రూ. 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు సీఎం రేవంత్​ రెడ్డి, సహచర మంత్రి శ్రీధర్ బాబు మన రాష్ట్రానికి వచ్చేలా చేశారు. అది కూడా నెలన్నర రోజుల పాలనలో,  తొలి పర్యటనలోనే కావడం గమనార్హం.  గత ప్రభుత్వ హయాంలో విదేశీ  పెట్టుబడులను ఆకర్షించే ఒక సమావేశం గురించిన వివరాలు ఇక్కడ ప్రస్తావిస్తాను.  2021–-22లో  మన రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు  సుమారు 12 వేల కోట్ల రూపాయలు మాత్రమే.  ఇదే సమయంలో మన పక్క రాష్ట్రం కర్నాటకకు రూ. లక్షా 63వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి.  మనకంటే మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వచ్చినట్లు మీడియా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.  

కేటీఆర్​ విమర్శలు గర్హనీయం

అప్పుడెప్పుడో అదానీ డేటా సెంటర్  గురించి ప్రకటించారు. దాని గురించి అతీగతీ లేదు. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు. హైదరాబాద్ లో కట్టిన వైర్ల వంతెన, స్టీల్ బ్రిడ్జిలు, ఫైనాన్షియల్ జిల్లాలో వచ్చిన ఐటీ కంపెనీల  కాలనుగత, క్రమానుగత అభివృద్ధిని తామే చేసినట్లు చెప్పుకున్నారు. అయితే తాజాగా కేటీఆర్.. పెట్టుబడుల విషయంలో అదానీని విమర్శించినవారే, ఆయనతో స్నేహం చేస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి అదానీకి కేంద్ర ప్రభుత్వం అప్పనంగా బొనంజాలు ప్రకటిస్తుందన్న విమర్శ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాహుల్ గాంధీ పదే పదే విమర్శలు చేస్తున్నారు.  దీన్ని ఎవరూ కాదనలేరు.  కానీ, అదానీయే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం లేదు. అంతేకానీ అదానీకి అప్పనంగా ప్రభుత్వరంగ సంస్థలు అప్పచెప్పడం, లేకుంటే  అదాయం ఇస్తున్న ఔటర్ రింగ్ రోడ్డును  అప్పచెబితే తప్పు అవుతోంది. వారే పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధికి భాగస్వాములు అవుతామన్నప్పుడు స్వాగతించాల్సిన అంశంగా చూడాలి. 

-  బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,అధ్యక్షుడు,తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక