హైదరాబాద్: అనారోగ్యంతో మృతి చెందిన నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. మంద జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. జగన్నాథం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్ సభలో తనతో పాటు మంద జగన్నాథం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారని, ఉద్యమ సమయంలో కూడా తనతో కలిసి పని చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన విషయం తెలుసుకొని నిమ్స్ హాస్పిటల్లో మంద జగన్నాథం తో మాట్లాడిన మాటలను మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. మందా జగన్నాథం మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ALSO READ | మాజీ MP మంద జగన్నాథం మృతికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంతాపం
కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతోన్న మంద జగన్నాథం.. ఆరోగ్యం విషమించడంతో 2025, జనవరి 12న తుదిశ్వాస విడిచారు. మంద జగన్నాథం మృతి పట్ల ఆయన సహచరులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రేపు (జనవరి 13) ఆయన స్వస్థలంలో జగన్నాథం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో చికిత్స పొందుతోన్న మంద జగన్నాథంకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజ నర్సింహా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న జగన్నాథంను పరామర్శించి మెరుగైన వైద్య సహయం అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.