హైదరాబాద్, వెలుగు: ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన వికలాంగురాలు డి.భాగ్యను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సోమవారం భాగ్యను సీఎం రేవంత్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా భాగ్య క్రీడాస్ఫూర్తిని సీఎం ప్రశంసించారు. సీఎం మాట్లాడుతూ.. అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన భాగ్యకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.
వికలాంగురాలైన భాగ్యకు ఉద్యోగంతో పాటు ఇతర ప్రభుత్వ సదుపాయాలను కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కురుమవాడకు చెందిన గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన భాగ్య పుట్టుకతోనే వికలాంగురాలు. ఆటలతో పాటు చదువులోనూ ఆమె చురుగ్గా ఉంది. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఫోక్ ఆర్ట్స్‌లో పీజీ పూర్తి చేసింది. త్రోబాల్ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తోంది.