కులగణనపై చర్చ సందర్బంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కులగణన లెక్కలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని కేటీఆర్ అన్నారు. 2014లో సమగ్ర సర్వే వివరాలు వెబ్ సైట్లో పెట్టామని చెప్పారు . వెబ్ సైట్లో ఉన్న రిపోర్ట్.. ఆరోజు చేసిన సమగ్ర కుటుంబ సర్వేనే అని అన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 51 శాతం. ముస్లీం బీసీలు 10 శాతం కలిపితే ఆనాటి మొత్తం బీసీలు 61 శాతం. 5 శాతం బీసీలను తగ్గించారు. మీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ప్రత్యేక మైన బిల్లు తీసుకొస్తారని మేము ఆశించాం. కుటుంబ సర్వేచేసినప్పుడు రేవంత్ పాల్గొన్నారా?. 56 శాత ఉన్న బీసీలకు సబ్ ప్లాన్ తెస్తారని ఆశించాం అని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కోసం చేశారని ఫైర్ అయ్యారు. ఆనాడు సర్వేను ఊరు పేరు తెలియన వాళ్లతో చేయించారు. సర్వే రిపోర్ట్ పై ఎందుకు ఆనాడు కేబినెట్ లో చర్చించలేదు..అసెంబ్లీలో పెట్టలేదు. అర్థం పర్థం లేని మాటలతో ప్రయోజనం లేదు. కులగణన సర్వేలో పాల్గొనలేని కేటీఆర్ కు మాట్లాడే హక్కు లేదు. వాళ్లకు మైక్ ఇవ్వొద్దు..సభలో మాట్లాడే అర్హత లేదు. వీళ్లు చూపిస్తున్న రిపోర్ట్ ప్రభుత్వ వెబ్ సైట్ లో లేదు. ఆనాడు సర్వే చేసిన ఎనామ్యలేటర్లు ఎవరు?. ఒక్కరోజులోనే రాష్ట్ర మొత్తాన్ని లెక్కించారా?. సమగ్ర సర్వేను వాళ్ల రాజకీయం కోసం వాడుకుంటున్నారు. లేని పోని విమర్శలతో ఉపయోగం లేదు.
Also Read : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
ప్రజల వ్యక్తిగత వివరాలు ఉన్నాయి కాబట్టే కులగణన రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. బీసీలకు న్యాయం చేయాలని చూస్తే ఇన్ని విమర్శలా. మా సర్వేతో బీసీల జనాభా పెరిగింది. ప్రతి ఏటా జనాభా ఒక శాతం పెరుగుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సర్వే చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.