రుణమాఫీ చేసినం.. ఇదిగో ప్రూఫ్ : సీఎం రేవంత్ రెడ్డి

రుణమాఫీ చేసినం.. ఇదిగో ప్రూఫ్ :  సీఎం రేవంత్ రెడ్డి
  • మోదీ వ్యాఖ్యలను ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ గ్యారంటీ గోల్డెన్ గ్యారంటీ అని రైతులు నమ్ముతున్నరు
  • ఇచ్చిన మాట ప్రకారం రూ.17,869 కోట్లు మాఫీ చేసినం
  • రూ.2లక్షల పైన ఉన్న క్రాప్ లోన్లు కూడా మాఫీ చేస్తం : ప్రధాని మోదీకి  లేఖ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని ప్రధాని మోదీ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రుణమాఫీపై ఆధారాలతో సహా మోదీకి ఆదివారం లేఖ రాశారు. రైతు రుణమాఫీపై ప్రధాని వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. జరుగుతున్న వాస్తవానికి, మోదీ చెప్పిన మాటలకు పొంతన లేకపోవడం తనను బాధించిందని చెప్పారు. తమ ప్రభుత్వంలో వాగ్దానం చేసిన విధంగా రూ.2 లక్షల లోపు ప్రతి పంట రుణాన్ని పూర్తిగా మాఫీ చేసామన్నారు.

22,22,067 మంది రైతులకు రూ. 17,869.22 కోట్లతో రుణమాఫీ చేశామన్నారు. ఈ ఏడాది జులై 18న లక్ష రూపాయల్లోపు రుణాలు ఉన్న 11,34,412 మంది రైతుల అకౌంట్లకు రూ.6,034.97 కోట్లు, అదే నెల 30వ తేదీన లక్షన్నర లోపు రుణాలు ఉన్న 6,40,823 మంది రైతుల అకౌంట్లకు రూ.6,190.01 కోట్లు, ఆగస్టు 15వ తేదీన రెండు లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న 4,46,832 మంది రైతుల అకౌంట్లకు 5,644.24 కోట్లను బదిలీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రం వచ్చిన తరువాత ఒకేసారి ఇన్ని వేల కోట్ల రూపాయల మేర రుణాలను మాఫీ చేయడం ఇదే తొలిసారి అని మోదీకి గుర్తు చేశారు.

రెండు లక్షల రూపాయలకు పైగా రుణం ఉన్న రైతులకు కూడా త్వరలోనే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ రైతులు రూ.2లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని ముందుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ గోల్డెన్ గ్యారంటీ అని దేశవ్యాప్తంగా రైతులు నమ్ముతున్నారని అన్నారు. వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలో రుణమాఫీ ద్వారా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ పూర్తి సహకారం, మార్గదర్శకత్వం కావాలని కోరుతున్నట్లు తెలిపారు.

మోదీ ఏమన్నారంటే

మహారాష్ట్రలోని వాషింలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ తెలంగాణలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ప్రతీ ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలివ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆరోపించారు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని..  రైతులకు మాత్రం రుణమాఫీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ రైతులు రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని
వ్యాఖ్యానించారు.