- కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్న
- 2 వేల కిలోమీటర్ల భూ భాగాన్ని ఆక్రమించుకున్నా స్పందించరా?
- భారత బలగాలు మణిపూర్‌లో శాంతిని నెలకొల్పలేవా?
- ముల్కీ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పుస్తకం రావాలె
- రవీంద్ర భారతిలో ‘నట్స్, బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పుస్తకావిష్కరణ
బషీర్ బాగ్/ హైదరాబాద్, వెలుగు: పొరుగు దేశం చైనా 2 వేల నుంచి 4 వేల కిలో మీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మాట్లాడేందుకు ఎవరికీ ధైర్యం లేదని కేంద్రంలోని బీజేపీ సర్కారుపై పరోక్ష విమర్శలు చేశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక భారత భూభాగాన్ని కోల్పోయామన్నారు. మణిపూర్‌లో అంతర్యుద్ధం జరుగుతున్నదని, రెండు దళిత జాతులు ఊచకోతలు కోసుకుంటున్నాయని తెలిపారు.
చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలని, వాటిని నియంత్రించాలని, అప్పుడే దేశంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. యుద్ధం వద్దు -– శాంతి ముద్దు అంటూ అఖిల భారత శాంతి, సంఘీభావ సంఘం (ఐప్సో) జాతీయ సలహా కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కొంపెల్లి యాదవరెడ్డి రచించిన ‘నట్స్, బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పుస్తకాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.
ఐప్సో ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఓబేదుల్లా కొత్వాల్.. అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో ఖనిజ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ సంస్థలు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. ‘‘భారత బలగాలు మణిపూర్‌లో శాంతిని నెలకొల్పలేవా..? తలచుకుంటే అక్కడి ఆయుధాలను సీజ్ చేయలేరా?’’ అని ప్రశ్నించారు. ప్రపంచ శాంతి మాత్రమే కాకుండా భారతదేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై, నెలకొన్న భయానక వాతావరణంపై కూడా చర్చ జరగాలని అన్నారు.
తెలంగాణ ఉద్యమంపై సమగ్ర పుస్తకం రావాలి
ముల్కీ రూల్స్ పోరాటం నుంచి నేటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ప్రత్యేక పరిణామ ఘట్టాలపై ఓ సమగ్ర తెలంగాణ పుస్తకం తీసుకురావాలని సీఎం రేవంత్ కోరారు. భవిష్యత్తు తరాలకు తెలంగాణ ఉద్యమ పరిణామ క్రమాలను వివరించేలా పుస్తకం ఉండాలన్నారు. ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారి గురించి వివరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. యాదవరెడ్డి తాను నమ్మిన సిద్ధాంతాన్ని పక్కాగా పాటించే మనిషని కొనియాడారు.
తెలంగాణ కోసం తెర వెనుక కృషి చేసిన వారిలో ఆయన ఒకరని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను సోనియా గాంధీకి యాదవరెడ్డి వివరించారని, తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో జైపాల్ రెడ్డితోపాటు యాదవరెడ్డి తన బాధ్యత నిర్వహించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ శాంతి మండలి అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ మల్లు రవి, తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందని చెప్పారు.
వచ్చే నెలలో దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెలలో దావోస్‌లో పర్యటించనున్నారు. జనవరి 20 నుంచి 24 వరకు స్విట్లర్జాండ్‌లోని దావోస్ జరిగే 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొననుంది. వరుసగా రెండోసారి దావోస్ పర్యటన చేస్తున్న సీఎం.. ఈసారి కూడా భారీగా పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారించారు.
ఈ సదస్సులో ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో రేవంత్ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు. సీఎం దావోస్ పర్యటన కోసం ప్రభుత్వం రూ.12.30 కోట్లు నిధులు రిలీజ్ చేసింది. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.