ముంబైని దోచుకోవడానికే మోడీ వస్తుండు.. ఇక్కడ బీజేపీకి చోటు లేదు: CM రేవంత్

ముంబైని దోచుకోవడానికే మోడీ వస్తుండు.. ఇక్కడ బీజేపీకి చోటు లేదు: CM రేవంత్

ముంబై: బీజేపీ, ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (నవంబర్ 16) రాజురాలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంబైని దోచుకోవడానికే ప్రధాని మోడీ వస్తున్నాడని.. మహారాష్ట్రలో బీజేపీకి చోటు లేదని హాట్ కామెంట్స్ చేశారు. ఎంవీఏ కూటమికి వెన్నుపోటు పొడిచిన ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లాంటి వెన్నుపోటుదారులకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వంపై మహారాష్ట్రలో ప్రధాని మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మేం అధికారంలోకి రాగానే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. మరీ గుజరాత్‎లో బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రధాని మోడీకి సవాల్ విసురుతున్నానని అన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. ఇందుకోసమే మేం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తెలంగాణలో రైతు ప్రభుత్వముందని నిరూపించామన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం  కల్పిస్తున్నాం.. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్రలో జరుగుతున్నవి ఎన్నికలు కావని.. బీజేపీపై పోరాటమని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కాషాయ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. మహా వికాస్ అఘాడీ కూటమిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త వీరుడిగా మారాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) కూటమి విజయం సాధిస్తే ఐదు గ్యారెంటీలు అమలవుతాయని హామీ ఇచ్చారు.