పెద్దపల్లి: మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఊర్లమీద పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. అచ్చొచ్చిన ఆంబోతుల్లా మాట్లాడటం కాదు.. పదేళ్ల పాలనలో మీరేం చేశారు.. 10 నెలలలో మేమేం చేశామో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొందని.. తన ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టుల లెక్కలు తీయడానికి కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. కుక్క తోక తగిలి పందిరి కూలినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి మారిందని ఎద్దేవా చేశారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం (డిసెంబర్ 4) పెద్దపల్లిలో యువ వికాసం పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల 143 ఉద్యోగాలు కల్పించి రికార్డ్ సృష్టించాం.. మరీ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఏ ఏడాదైనా 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా..? కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ వరి వేస్తే ఉరి అంటే.. వరి వేస్తే బోనస్ ఇస్తామని మేం అంటున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ధర్నా చేసే పరిస్థితి ఉండేదా..? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ధర్నాలు చేసిన ధర్నా చౌక్‌ను ఎత్తేసి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్భంధం విధించిందని దుయ్యబట్టారు.
కానీ కాంగ్రెస్ పాలనలో స్వేచ్ఛగా ధర్నాలు చేస్తున్నారని.. ధర్నాలు చేసే వారిని గాంధీ భవన్‌కు పిలిచి మాట్లాడుతున్నామని తెలిపారు. ఆనాడు దొరలు ఉండే ప్రగతి భవన్‌ను.. మేం అధికారంలోకి వచ్చాక ప్రజా భవన్‌గా మార్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. కేసీఆర్ కూతురు కవిత ఎంపీగా ఓడిపోతే మూడు నెలల్లో ఎమ్మెల్సీ చేశారు.. ఎంపీగా ఓడిన వినోద్‌కు కేబినెట్ పదవి ఇచ్చారు.. మీ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి. కేవలం మీ కుటుంబ సభ్యుల కోసమా నిరుద్యోగులు ప్రాణ త్యాగాలు చేసిందని ప్రశ్నించారు. ఒక్క కుటుంబాన్ని అందలం ఎక్కించడం కోసమా స్వరాష్ట్రం సాధించుకుందని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు.
మేం అధికారంలోకి రాగానే 56 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు విముక్తి కల్పించామని తెలిపారు. యూనివర్శిటీలను కూడా కేసీఆర్ నిర్వీర్యం చేశారని.. సిబ్బంది లేక వర్శిటీలు దివాళా తీస్తే.. మేం అధికారంలోకి రాగానే నియామకాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని కోటీ మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే ప్రభుత్వాన్ని విమర్శించుడే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఐదేండ్లు అధికారంలో ఉండేందుకు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఐదేండ్ల తర్వాత మా పాలన రిపోర్టును ప్రజలకు వివరిస్తామని తెలిపారు.