- కేసీఆర్ ఓ రాజకీయ జూదగాడు: సీఎం రేవంత్
- ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించిండు
- రాష్ట్ర సర్కార్‌ను కూల్చేందుకు ఇప్పటికీ కుట్రలు చేస్తున్నడు
- అందుకే ప్రజలు బీఆర్ఎస్కు గుండు సున్నా ఇచ్చారు
- ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మసాక్షిగా నడుచుకోవాలి
- బూడిదైన బీఆర్ఎస్ మళ్లీ పుట్టేది లేదు
- మోదీని దేశ ప్రజలు తిరస్కరించారు.. ఆయన ప్రధాని పదవి చేపట్టొద్దు
- పీసీసీ చీఫ్‌గా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపోటములకు నేనే బాధ్యుడ్ని
- చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పిలిస్తే వెళ్తానని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ , కేటీఆర్, హరీశ్‌రావు బీజేపీకి తాకట్టు పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవదానం చేశారు. బీఆర్ఎస్ ఓట్లను పూర్తిగా బీజేపీకి బదలాయించి కేసీఆర్ రాజకీయ అరాచకానికి పాల్పడ్డడు.
రాష్ట్రంలో తనంతట తానే అంతర్థానమై బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలబడ్డడు” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఇప్పటికీ కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు. ఆయన ఉన్నంత కాలం కుట్రలు, కుతంత్రాలు నడిపిస్తనే ఉంటడు. బీజేపీతో కేసీఆర్ బేరసారాలు చేస్తున్నడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించాలి. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడన్న బీజేపీ... బీఆర్ఎస్ తో ఎలా జతకడుతుందో చూడాలి” అని ఆయన అన్నారు.
రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేసిందని, అందుకే ఆ పార్టీని రామయ్య కూడా క్షమించలేదని వ్యాఖ్యానించారు. అయోధ్య ఆలయం కొలువై ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలతో చూస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓట్ల శాతం పెరిగిందన్నారు. ‘‘మహబూబ్‌నగర్‌లోనూ గెలిచి ఉండాల్సింది. నేను జిల్లాకు ముఖ్యమంత్రిని కాదు. రాష్ట్రానికి సీఎంను. నా బాధ్యత రాష్ట్రానికి పరిమితం. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ గెలుపు ఓటములకు నేనే బాధ్యుడిని. నా జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో పార్టీ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్న” అని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివని అన్నారు.
ఏపీలో ఎవరొచ్చినా సమస్యలు పరిష్కరించుకుంటం
ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే సమస్యలు పరిష్కరించుకుంటామని, ఈ విషయాన్ని గతంలోనే చెప్పానని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ‘‘ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశం చట్టపరంగా ముగిసింది. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు సంపూర్ణ రాజధాని” అని అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీపై తమ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టత ఇచ్చారని, విభజన చట్టంలో హోదా పెట్టిందే ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్అని, దానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.
బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిండు
పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘తన పార్టీ నుంచి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేసిండు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల నుంచి 22 శాతం ఓట్లను ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి బదిలీ చేసిండు. 2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో బీఆర్ఎస్కు మెజార్టీ వచ్చింది.
కానీ ఇప్పుడు సిద్దిపేటలోనూ బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి హరీశ్‌రావు బదిలీ చేయించిండు. రఘునందన్ రావుకు ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీనవర్గాల బిడ్డ, కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని నమ్మించి మోసం చేసి కేసీఆర్ బీజేపీని గెలిపించారని ఆయన విమర్శించారు. అందుకే ఓవరాల్‌గా బీఆర్ఎస్ ఓటింగ్ 16.5 శాతానికి పడిపోయిందన్నారు. అచేతనావస్థలో బీఆర్ఎస్ ఉందని, ఆ పార్టీకి మిగిలింది బూడిదే అని ఎద్దేవా చేశారు.
అందుకే బీఆర్ఎస్కు గుండు సున్నా
వందరోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఇష్టమున్నట్లు ఆరోపణలు చేశారని, అందుకే రాష్ట్ర ప్రజలు ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సన్నా ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వందరోజులు పూర్తి కాక ముందే బీఆర్ఎస్ నేతలు కోట్లాది శాపనార్థాలు పెట్టి, ఈ ప్రభుత్వాన్ని పడగట్టాలని కుట్రలు చేశారు. అందుకే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ను తిరస్కరించారు” అని ఆయన పేర్కొన్నారు.
బూడిదైన బీఆర్ఎస్ మళ్లీ పుట్టేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న బీఆర్ఎస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలి. వాళ్లు బీఆర్ఎస్ పార్టీ మనుగడకు, కుటుంబ స్వార్థం కోసం చేసే పనులను ప్రజలు గమనిస్తున్నరు. హరీశ్‌రావు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ ను దెబ్బతీయాలనుకుంటే చివరికి కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతరు” అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజలు హ్యాపీ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలోని ప్రజాస్వామికవాదులను ఏకం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లతో ప్రజాపాలనకు ప్రజలు ఆమోదం తెలిపారు. వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాం. ఈ ఎన్నికలు వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పాం.
17పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 41శాతం ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. గత ఎన్నికలతో పోలిస్తే మా పార్టీ ఓట్ల శాతం పెరిగింది. మూడు ఎంపీ సీట్ల నుంచి 8 సీట్లకు ఎదిగాం. దీనిని బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని అర్థమవుతున్నది” అని సీఎం రేవంత్చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించి ప్రజలు తమకు మరో సీటు అదనంగా ఇచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
మోదీ ప్రధాని పదవి చేపట్టొద్దు
మోదీ గ్యారంటీ పేరుతో బీజేపీ నేతలు ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారని, కానీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ సీట్లు 303 నుంచి 243కు పడిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మోదీ గ్యారంటీకి వారంటీ చెల్లిపోయిందనేలా ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. దేశ ప్రజలు మోదీని తిరస్కరించారన్నారు. ‘‘తక్షణమే మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు. విలువలు కలిగిన నాయకుడిగా హుందాగా తప్పుకుంటే మోదీకి గౌరవం ఉంటుంది.
ఇప్పటికైనా బీజేపీ అప్రజాస్వామిక తీరును మార్చుకోవాలి” అని ఆయన సూచించారు. ఇప్పటివరకు 18 గంటల పాటు పనిచేశామని, ఇక నుంచి మరో రెండు గంటల ఎక్కువే పనిచేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత తనదేనని సీఎం చెప్పారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.