= తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీని ఫాలో అవుతోంది
= ఆ పార్టీ మాకు నేర్పించాల్సిన అవసరమేం లేదు
= చట్ట ప్రకారమే మా ప్రభుత్వం ముందుకెళ్తోంది
= బీజేపీ జూటా మాటలు చెబుతున్న పార్టీ
= స్వాతంత్ర్యం విషయంలో మోదీ మోహన్ భగవత్ వెంట ఉంటారా..? స్వాతంత్ర్య సమరయోధుల పక్షానా ఉంటారో చెప్పాలె
= ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఢిల్లీ: బీఆర్ఎస్ కాదని, అది బీఆర్ఎస్ఎస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ ప్రారంభోత్సవానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ అదే ఫాలో అవుతోందని విమర్శించారు. ఆ పార్టీ తమకు నేర్పించాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రబుత్వం చట్ట ప్రకారం ముందుకెళుతోందని చెప్పారు. తెలంగాణలో ఎక్కడ శాంతిభద్రతల సమస్య ఎదురైనా అక్కడ పోలీసులు ఉంటారని చెప్పారు.
తమకు పక్షపాత ధోరణి లేదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపైనా దాడులు జరిగాయని అన్నారు. బీజేపీ జూటా మాటలు చెప్పే పార్టీ అని విమర్శించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ స్వాతంత్ర్య విషయంలో మోహన్ భగవత్ వెంట ఉంటారా..? లేక దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమర యోధుల పక్షాన నిలుస్తారా..? అన్నది తేల్చాలని సీఎం డిమాండ్ చేశారు.
140 ఏండ్ల చరిత్ర ఉన్న పార్టీకి ఇప్పుడు సొంత భవనం
140 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంత భవనం కల సాకారమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ స్వార్థం లేకుండా దళితులు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పనిచేస్తోందని అన్నారు. నిన్న గాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలతో పాటు బీజేపీ సైతం సొంత కార్యాలయ భవనాలను సమకూర్చుకున్నాయని చెప్పారు. ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏవిధంగా ఉన్నాయో చూడాలని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికా రచన ఈ ఆఫీసు నుంచే జరగబోతోందని చెప్పారు.
ALSO READ | ఫార్ములా-ఈ కారు రేసు.. కేటీఆర్ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు