కొంత మంది కవులు బానిసత్వంలో బతుకుతున్నరు: సీఎం

కొంత మంది కవులు బానిసత్వంలో బతుకుతున్నరు: సీఎం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొంతమంది కవులు బానిసత్వంలో బతుకుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవస్థనే కుప్పకూల్చిన కేసీఆర్ లాంటి వ్యక్తి పంచన కవులు చేరడమంటే అది వారి భావదారిద్ర్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పదవులనే చూసుకున్నారు తప్ప ఇతర కవులను పట్టించుకోలేదని మండిపడ్డారు. శనివారం సీఎం రేవంత్ శాసనమండలిలో మాట్లాడుతూ.. ఈ కవులు ఏనాడైనా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, అందెశ్రీ, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి, జయరాజ్ తదితరుల గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. 

జయ జయహే తెలంగాణ పాటను పదేండ్ల కాలంలో రాష్ట్ర గీతం చేయకుంటే వీళ్లు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.  రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం, ఉద్యమకారుల మీద కేసులు పెట్టడం ఒక్కటి కాదని పేర్కొన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన గద్దర్, విమలక్క మీద పీడీ యాక్ట్ పెట్టించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని, బీఆర్ఎస్ హయాంలో పెట్టిన అక్రమ కేసులు తెలంగాణ ప్రజలు అప్పుడే మర్చిపోరని అన్నారు.