
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. మార్చి 4న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రహ్లాద్ జోషితో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. తెలంగాణలో ఇస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, ధాన్యం సేకరణపై కేంద్రమంత్రితో చర్చించారు. ప్రహ్లాద్ జోషి ఇతర కార్యక్రమాలపై బయటకు వెళ్లడంతో రేవంత్ సమావేశాన్ని త్వరగా ముగించారు. ఇవాళ(మార్చి 4) మధ్యాహ్నం మరోసారి భేటీ కానున్నారు.
మార్చి 3న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిలో భేటీ అయ్యారు రేవంత్ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది పరివాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే.. కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. గోదావరికి సంబంధించి నికర జలాల్లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పారు.
పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రాజెక్ట్
ఏపీ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కారు గోదావరి – -బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిందని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ కంప్లయింట్ చేశారు. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘం, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీల నుంచి ఎలాంటి అనుమతి పొందలేదని చెప్పారు. గోదావరిపై తాము చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని రేవంత్ కోరారు.