- రెవెన్యూపై ఉన్నతస్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్
- వాస్తవ అమ్మకాలు, కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ వ్యాల్యూకు సవరణలుండాలి
- ఎక్కడెక్కడ, ఏయే భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి
- స్టాంప్ డ్యూటీ పెంచాలా? తగ్గించాలా? అనే దానిపైనా స్టడీ చేయండి
- జీఎస్టీ ఎగవేతలు, అక్రమ మద్యం అరికట్టండి
- వార్షిక లక్ష్యానికి అనుగుణంగా రాబడి వచ్చేలా మంత్లీ టార్గెట్స్ ఉండాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్ల వాస్తవ ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ మార్కెట్ వ్యాల్యూ పెంచేలా సవరణలు ఉండాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ తెలంగాణలో ఎంత మేరకు ఉంది ? తగ్గించాలా? పెంచాలా? అనేదానిపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఎక్కడెక్కడ ఏయే ప్రాంతంలో భూముల విలువలు సవరించాలి? వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు.. వేటికి ఎంత సవరించాలి? అనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలని సీఎం చెప్పారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సెక్రటేరియెట్‌లో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా చర్చ జరిగింది. చాలా చోట్ల భూముల ప్రభుత్వ మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవటం ప్రధాన కారణమని చర్చలో తేలింది.
‘‘గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచింది. ఇప్పటికీ చాలాచోట్ల భూముల ప్రభుత్వ విలువకు, మార్కెట్వాల్యూలో క్రయ, విక్రయ ధరలకు భారీ తేడా ఉంది. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టాలి” అని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతోపాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని సూచించారు. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని ఆదేశించారు,
గత ఆర్థిక సంవత్సరం ఆశించిన రాబడి రాలే
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అన్నారు. గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మంత్లీ టార్గెట్ ను నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
జీఎస్టీ ఎగవేతలు, అక్రమ మద్యంపై కఠిన చర్యలు
ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరం ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికిగల కారణాలపై రేవంత్ఆరా తీశారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని సూచించారు. పబ్లిక్ యుటిలిటీకి సేకరించిన స్థలాలను గుర్తించి కొన్నిచోట్ల అధునాతనంగా మోడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించాలని, అందుకు సన్నాహాలు చేయాలని సీఎం ఆదేశించారు.
సోషల్ మీడియా టీంతో రేవంత్ ఫొటో
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సోషల్‌మీడియా వారియర్స్‌కు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకున్నారు. ‘‘లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడండి.. ఎన్నికల తర్వాత సోషల్ మీడియా టీంలో ఉన్న ప్రతి ఒక్కరితో విడివిడిగా ఫొటో దిగుతా” అని ఆ టీంతో సమావేశమైన సందర్భంగా సీఎం రేవంత్ వారికి ఎన్నికల ముందు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే గురువారం జూబ్లీహిల్స్ లోని దస్ పల్లా హోటల్ లో సోషల్ మీడియాకు చెందిన సుమారు 500 మందితో భేటీ అయ్యారు. వీరందరితో విడివిడిగా ఫొటో దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సుమారు గంట సమయం కేటాయించి ఒక్కొక్కరితో రేవంత్ స్వయంగా ఫొటో దిగడంతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ మీడియా ఇన్చార్జి సామ రాంమోహన్ రెడ్డి, సోషల్ మీడియా టీం ఇన్చార్జి మన్నె సతీశ్ పాల్గొన్నారు.