ఢిల్లీకి సీఎం రేవంత్.. అట్నుంచి అటు కుంభమేళాకు వెళ్లే అవకాశం

ఢిల్లీకి సీఎం రేవంత్.. అట్నుంచి అటు కుంభమేళాకు వెళ్లే అవకాశం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళతారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై ప్రధానితో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ఇక.. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కుంభమేళాకు కూడా వెళ్లే అవకాశం ఉందని తెలిసింది.

వాస్తవానికి యూపీలో జరుగుతున్న కుంభమేళాకు హాజరుకావాలని సీఎం రేవంత్‌ రెడ్డిని యూపీ సర్కార్ ఇప్పటికే ఆహ్వానించింది. ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య యూపీ నుంచి హైదరాబాద్ వచ్చి మరీ స్వయంగా రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసి కుంభమేళా ఆహ్వానాన్ని అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఉన్న ప్రయాగ వద్ద కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నమొన్నటి దాకా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే.

Also Read:-SLBC టన్నెల్ రెస్క్యూపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు..

మహా కుంభమేళాను పొడిగించబోమని ప్రయాగ్ రాజ్ జిల్లా కలెక్టర్ రవీంద్ర కుమార్ మంధాడ్  ఇప్పటికే ప్రకటించిన క్రమంలో వీవీఐపీలంతా కుంభమేళాలో పుణ్య స్నానాలకు వీలు చూసుకుని వెళుతున్నారు. ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే కుంభమేళాలో పుణ్య స్నానాలను ఆచరించిన సంగతి తెలిసిందే.

కుంభమేళాను పొడిగిస్తారని సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ ఒట్టి పుకార్లని, వాటిని నమ్మకూడదని ప్రయాగ్ రాజ్ కలెక్టర్ సూచించారు. మేళాను పొడిగిస్తామని యోగి సర్కారు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదని, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే దాకా మేళాను పొడిగించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం నాడు కుంభమేళా ముగియనున్నది.