మూసీ రివర్ ఫ్రంట్ కు 4 వేల కోట్లు కావాలి.. కేంద్ర జల్ శక్తి మంత్రి పాటిల్ కు సీఎం రేవంత్ వినతి

మూసీ రివర్ ఫ్రంట్ కు 4 వేల కోట్లు కావాలి.. కేంద్ర జల్ శక్తి మంత్రి పాటిల్ కు సీఎం రేవంత్ వినతి
  • జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక ద్వారా ఇవ్వండి
  • జంటజలాశయాలను గోదావరి నీళ్లతో నింపుతం
  • రూ. 6 వేల కోట్ల నిధులు కేటాయించండి
  • కేంద్ర జల్ శక్తి మంత్రి పాటిల్ కు సీఎం రేవంత్ వినతి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్  ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు స‌హ‌క‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  హైద‌రాబాద్ న‌గ‌రంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోంద‌ని, దానిని శుద్ది చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సంక‌ల్పించింద‌ని తెలిపారు. జాతీయ న‌ది ప‌రిర‌క్ష‌ణ ప్ర‌ణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి ప‌నులకు రూ.4 వేల కోట్లు కేటాయించాలని కోరారు.

హైదరాబాద్ కు తాగునీరందించే జంట జలాశయాలను (ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌) గోదావ‌రి న‌ది జ‌లాల‌తో నింపే ప‌నుల‌కు రూ.6 వేల  కోట్లు కేటాయించాల‌ని విజ్ఞప్తి చేశారు.  ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌ను గోదావ‌రి నీటితో నింపితే హైద‌రాబాద్ నీటి ఇబ్బందులు ఉండ‌వ‌ని కేంద్ర మంత్రికి వివరించారు. 2019లో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప్రారంభ‌మైనా ఈ ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌కు నిధులు ఇవ్వ‌లేదని సీఎం కేంద్ర మంత్రికి గుర్తు చేశారు.

తెలంగాణ‌లో 7.85 ల‌క్ష‌ల ఇళ్ల‌కు న‌ల్లా క‌నెక్ష‌న్ లేద‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నల్లా కనెక్షన్లు లేని ఇండ్లతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టే ఇండ్లకూ నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని తెలిపారు.  ఈ ఏడాది నుంచి జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ నిధులు తెలంగాణ‌కు కేటాయించాల‌ని సీఎం విజ్ఞప్తి చేశారు.