అదానీ అవినీతిపై జేపీసీ వెయ్యాల్సిందే..లేదంటే రాష్ట్రపతి భవన్​ను ముట్టడిస్తం : సీఎం రేవంత్​రెడ్డి 

అదానీ అవినీతిపై జేపీసీ వెయ్యాల్సిందే..లేదంటే రాష్ట్రపతి భవన్​ను ముట్టడిస్తం : సీఎం రేవంత్​రెడ్డి 
  • అదానీ ఇష్యూపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్
  • మోదీకి భయపడే అదానీపై కేసీఆర్ మాట్లాడట్లేదని ఫైర్
  • పీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్​భవన్.. అడ్డుకున్న పోలీసులు 
  • రోడ్డుపై బైఠాయించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు  

హైదరాబాద్, వెలుగు : అదానీ అవినీతిపై జేపీసీ (జాయింట్​పార్లమెంటరీ కమిటీ) వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్​రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రపతి భవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అదానీ అవినీతి, మణిపూర్ హింసకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ‘చలో రాజ్‌భవన్’ చేపట్టారు. హైదరాబాద్​ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌‌‌‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ స్టేట్ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

‘మోదీ–అదానీ భాయ్ భాయ్’ అంటూ నినాదాలు చేశారు. అయితే, ర్యాలీ రాజ్ భవన్ సమీపంలోకి రాగానే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా సీఎం సహా నేతలంతా రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అక్కడే పార్టీ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్య నేతలు మాట్లాడారు. తర్వా త గవర్నర్​కు వినతి పత్రం ఇవ్వకుండానే తిరిగి వెళ్లిపోయారు. 

ప్రజాధనం కాపాడేందుకు రోడ్డెక్కాను..  

ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, ప్రజాధనం కాపాడేందుకు రోడ్డెక్కానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘మేం చేసే నిరసనల వల్ల కొంతమంది కడుపులో నొప్పి రావచ్చు. ప్రభుత్వంలో ఉండి ధర్నా చేయడం ఏమిటి అని కొంతమంది అనొచ్చు. సీఎం, మంత్రులు రోడ్డుపై ఆందోళన చేయడంపై విమర్శలు రావచ్చు. కానీ దేశ సంపదను, ప్రజాధనాన్ని కాపాడడం కోసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే రోడ్డెక్కుతా” అని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ సన్నాసులను నేను ఒక్కటే అడుగుతున్నా.. అదానీ అవినీతిపై చర్చ జరగాలా? వద్దా? మోదీ, అదానీని నిలదీయాలా? వద్దా? అదానీపై తమ వైఖరి ఏంటో బీఆర్ఎస్ తెలియజేయాలి” అని డిమాండ్ చేశారు.  వాళ్లు తమ వైఖరి చెప్పకుండా కాంగ్రెస్ ను అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ కు  చిత్తశుద్ధి ఉంటే అదానీ ఇష్యూపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్ నేతలు మోదీ, అదానీ వైపా? లేక ప్రజల వైపా? చెప్పాలి. బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే అదానీ ఇష్యూపై ఆ పార్టీ నేతలు స్పందించడం లేదు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు మోదీ, బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయింది. అదానీపై మాట్లాడితే వీళ్లను జైల్లో పెడతారనే మాట్లాడటం లేదు” అని ఫైర్ అయ్యారు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని.. ఇద్దరూ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటి వారని విమర్శించారు.

అదానీతో మోదీ లాలూచీ? 

అదానీ మన దేశ పరువు తీశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘అమెరికా కంపెనీలకు అదానీ లంచాలు ఇచ్చారని ఆ దేశ సంస్థలు నివేదిక ఇచ్చాయి. దేశ పరువు, ప్రతిష్టను మంటగలిపిన అదానీపై విచారణ చేపట్టాలని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. కానీ ప్రధాని మోదీ స్పందించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అదానీ అవినీతిపై జేపీసీ వేయడానికి ప్రధాని మోదీ ఎందుకు సిద్ధంగా లేరు?

ALSO READ : పరిపాలనా సౌలభ్యం కోసమే మూడు భాషల ఫార్ములా: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

అదానితో ఆయనకు ఉన్న లాలూచీ ఏంటి?” అని ప్రశ్నించారు. ‘‘మోదీకి అదానీ చిన్న నాటి మిత్రుడు. అందుకే ఆయన అవినీతి గురించి మోదీ మాట్లాడడం లేదు. ఒకవేళ అదానీ అవినీతి గురించి మోదీ మాట్లాడితే ఆయన తిహార్ జైలుకు వెళ్లడం ఖాయం. అదానీని మోదీ ఇండియాలో రక్షించినప్పటికీ, అమెరికా నుంచి మాత్రం కాపాడలేరు. ఇప్పుడు మోదీ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. తన తమ్ముడిని (అదానీ) అమెరికా జైల్లో ఉంచాలా? లేక ఇండియాలోని తిహార్ జైల్లో ఉంచాలా? నిర్ణయించుకోవాలి” అని అన్నారు. 

దేశ సంపదను దోచుకుంటున్నరు: భట్టి  

దేశ సంపదను కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులకు ప్రధాని మోదీ దోచిపెడ్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. అదానీ దోపిడీని ప్రజలకు వివరించేందుకే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ ‘‘నమో అదానీ’’గా మార్చారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​గౌడ్ అన్నారు. అదానీ కుంభకోణాలపై జేపీసీ వేయడానికి కేంద్రం ఎందుకు జంకుతున్నదని ప్రశ్నించారు.

అవినీతి రహిత పాలన అంటూ సొంత డబ్బా కొట్టుకునే మోదీ.. అదానీ అవినీతిపై చర్చకు ఎందుకు భయపడుతున్నారన్నారు. మణిపూర్ లో హింస చెలరేగినా తనకు సంబంధం లేదన్నట్టుగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షి మండిపడ్డారు. దేశంలో మోదీ తానాషాహీ (నియంతృత్వం) నడుస్తోందని విమర్శించారు.