ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉదయం ప్రధాని మోడీని కలిశారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కలిశారు. ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఇచ్చిన భద్రాచలం దగ్గరి 5గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. చంద్రబాబుతో భేటీలో కూడా ఈ 5గ్రామాల గురించి చర్చిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
జూలై 6న ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రాష్ట్ర విభజన కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ సమస్యల గురించి చర్చించేందుకు భేటీ అవుదామని చంద్రబాబు రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రతిపాదనకు అంగీకరించిన రేవంత్ ఈ నెల 6న ప్రజాభవన్ లో భేటీకి చంద్రబాబును ఆహ్వానించారు. మరి, ఈ భేటీలో 5గ్రామాల సమస్యకు పరిష్కారం లభిస్తుందా లేదా చూడాలి.