ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను నియమించండి : సీఎం రేవంత్ రెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను నియమించండి : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులను నియంత్రించడానికి ట్రాన్స్ జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు. సిటీలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 

తద్వారా తాగి వాహనాలు నడిపే  వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు. వారికి హోమ్ గార్డ్ తరహాలో  జీత భత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, ప్రత్యేక డ్రెస్ కోడ్ ను రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా  ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం అదేశించారు.