
- సీఎల్పీ మీటింగ్‌లో పార్టీ నేతలకు సీఎం రేవంత్ సూచనలు
- నేటి నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో తిరగండి
- వచ్చే నెల 1 నుంచి నేనూ జనంలోకి వస్తా
- సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
- బీజేపీ, బీఆర్ఎస్కు దీటుగా బదులివ్వండి
- కులగణన మోదీ సర్కారుకు మరణశాసనం
- అందుకే తెలంగాణ సర్కారుపై ప్రధాని విమర్శలు
- పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించం
- మంత్రివర్గ విస్తరణపై ఎవరూ మాట్లాడొద్దని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు కొలువుదీరిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో మంచి పనులు చేశామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ చేపట్టాలని అన్నారు. మౌనంగా ఉండొద్దని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలకు దీటుగా బదులివ్వాలని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్ లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం జరిగింది. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ‘‘ఏడాదిన్నర కాలంలోనే మనం ఆరు గ్యారెంటీలతోపాటు సన్న బియ్యం లాంటి సంక్షేమ పథకాలు అమలుచేశాం. వందేండ్ల తర్వాత కులగణన చేపట్టాం. ఎన్నో ఏండ్ల డిమాండ్‌గా ఉన్న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాం. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకున్నాం. రైతుల భూ సమస్యలకు కారణమైన ధరణి స్థానంలో భూ భారతి లాంటి కొత్త పోర్టల్ అందుబాటులోకి తెచ్చాం. కానీ వాటిని అనుకున్న స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతున్నాం.
ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి గొప్ప నిర్ణయాలను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన మనం.. మౌనంగా ఉంటున్నందువల్లే ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. ఫేక్ న్యూస్‌తో మన ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా నిత్యం బురద జల్లుతున్నాయి.. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాలను ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా అదే సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టాలి” అని సూచించారు. రాష్ట్రసర్కారుపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మారని సీఎం రేవంత్ అన్నారు.
‘‘ప్రభుత్వానికి చెందిన కంచ గచ్చిబౌలి భూములపై ప్రతిపక్షం ఏఐ సాయంతో ఫేక్‌వీడియోలు, ఫొటోలు సృష్టించి, తప్పుడు ప్రచారం చేసింది. ఆ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి.. తెలంగాణలో అడవులను బుల్డోజర్లతో కూలుస్తున్నారని మాట్లాడారు. దీన్ని బట్టి మన ప్రభుత్వంపై ఏ స్థాయిలో దుష్ప్రచారం జరిగిందో అర్థం చేసుకోవచ్చు’’ అని అన్నారు.
నిన్న, మొన్నటి వరకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారని, ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు స్పష్టమవుతున్నదని అన్నారు. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతున్నదని, ముఖ్యంగా కులగణన.. మోదీకి రాజకీయంగా మరణ శాసనం రాయబోతున్నదని తెలిపారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని, వారి కుట్రలను తిప్పికొట్టాలని సీఎం సూచించారు.
జనాల్లోకి వెళ్లండి..
ప్రజా ప్రతినిధులందరూ కచ్చితంగా జనాల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘సన్న బియ్యం, భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ..అనే నాలుగు ఆయుధాలను నేను మీకు అందిస్తున్నా.. వీటిని పట్టుకొని జనాల్లో తిరగండి’’ అని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, తెలంగాణ జనం కూడా కాంగ్రెస్‌వైపే ఉన్నారని చెప్పారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ నిత్యం సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అందువల్ల వాస్తవాలేంటో జనాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
ఇందుకోసం బుధవారం నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోని ఊరూరా పర్యటించాలని సూచించారు. తాను కూడా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జూన్ 2 వరకు ప్రజలతో కలిసేందుకు సమయం కేటాయిస్తానని చెప్పారు. ‘పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ట పెరిగితేనే ఏ నాయకుడికైనా భవిష్యత్ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.
మీ నియోజకవర్గాల్లో ఏం పనులు కావాలో, ఎన్ని నిధులు అవసరమో ఒక నివేదిక తయారు చేసుకోండి. నేను ఒక్కో ఎమ్మెల్యేను కలిసేందుకు సమయం కేటాయిస్తా. మీ నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది’’ అని సీఎం స్పష్టంచేశారు.
విజయవంతం గా సీఎల్పీ మీటింగ్: మహేశ్‌కుమార్‌గౌడ్
సీఎల్పీ మీటింగ్ విజయవంతంగా ముగిసిందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు భూ భారతి పై మంత్రి పొంగులేటి, బీసీ కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారని చెప్పారు. సమావేశం అనంతరం మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు అందరూ జనంలోకి వెళ్లి.. ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని చెప్పారు. మంత్రి పదవుల భర్తీపై జాప్యం జరుగుతుండడంతో పలువురు పడుతున్న బాధలను అర్థం చేసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశానికి కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాలేదని, వారు ముందుగా తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు.
కులగణనపై అవగాహన కల్పించండి: పొన్నం
దేశంలోనే కుల గణన, ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ సర్కారును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాయని, దీనిపై 2 నెలల్లో ఏదో ఒక విషయాన్ని తేల్చాలని ఇటీవలే సుప్రీం కోర్టు చెప్పిందని, దీంతో తప్పకుండా సానుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నామని అన్నారు .
కుల గణన, బీసీ రిజర్వేషన్ల బిల్లులపై తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోని బీసీ, కుల, ఉద్యోగ సంఘాల నాయకులు , బీసీ మేధావులను పిలిచి చర్చ పెట్టాలని సూచించారు. ఇలాంటి చరిత్రాత్మక ప్రక్రియ 1931 తర్వాత మళ్లీ ఇప్పుడు మాత్రమే జరిగిందని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్‌వైపే చూసేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రధాని వ్యాఖ్యలు సరికాదు: మంత్రి శ్రీధర్‌బాబు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై ప్రధాని స్థాయి నేత మాట్లాడడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇది తీర్పును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు మోదీకి తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. మోదీ లాంటి నేత ఆలోచించి మాట్లాడాల్సిఉంటుందన్నారు. అప్పుడే తాము కూడా ఆయన్ను గౌరవంగా చూస్తామని చెప్పారు. ప్రధాని ఇప్పటికైనా సరైన సమాచారం తెలుసుకొని మాట్లాడుతారని తాము భావిస్తున్నట్టు చెప్పారు.
అద్దంకి దయాకర్ పై సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సీఎల్పీ మీటింగ్‌లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలోని నేతలంతా పదవుల విషయంలో అద్దంకి దయాకర్ లా ఓపికతో వేచి చూసే ధోరణిని అలవర్చుకోవాలని అన్నారు. అద్దంకికి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని అనుకున్నామని, కానీ కుదరలేదని.. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇద్దామనుకున్నామని, అప్పుడు కూడా వీలుకాలేదని చెప్పారు.
అయినా ఆయన ఓపికతో ఉన్నారని, ఆ ఓపికనే ఇప్పుడు ఆయన మనతో కూర్చునేలా చేసిందని అన్నారు. .ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశాన్ని ఆ ఓపికనే అద్దంకికి ఇచ్చిందన్నారు. అద్దంకి తన జీతం నుంచి 10 శాతం ఏఐసీసీకి, మరో 15 శాతం పీసీసీకి ఇస్తున్నారని, ఎమ్మెల్యేలు కూడా ప్రతి నెలా తమ జీతం నుంచి పార్టీకి రూ.20 వేలు ఇవ్వాలని పీసీసీ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు.
ఎంపీ చామలకు వార్నింగ్
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం రేవంత్ హెచ్చరించారు. మంత్రిపదవుల భర్తీపై మీడియాకు లీకులు ఇవ్వడం ద్వారా పార్టీ పలచన అవుతుందని, దీంతో జనంలో మనం కూడా చులకనైపోతామని అన్నారు. మంత్రిపదవులు ఎవరికి ఇవ్వాలనేది ఏఐసీసీ చేతిలో ఉందని, ఇప్పటికే పీసీసీ నాయకత్వంతో, ప్రభుత్వంతో దీనిపై హైకమాండ్ చర్చించిందని తెలిపారు.
లిఫ్ట్ లో ఇబ్బందిపడ్డ సీఎం
నోవాటెల్ హోటల్‍లో రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఓవర్ వెయిట్‌తో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు అయోమయానికి గురయ్యారు. అనంతరం పెద్ద ప్రమాదం ఏమీ లేదని తెలుసుకుని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మరో లిఫ్ట్‌లో సీఎంను అధికారులు పంపించారు.
ముగ్గురు ఎమ్మెల్సీలకు సన్మానం
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ సీఎల్పీ సమావేశానికి వచ్చారు. వారిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సన్మానించారు.
సన్నబియ్యం మన బ్రాండ్
‘‘సన్న బియ్యం మన బ్రాండ్.. అది మన పథకం.. మన పేటెంట్’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ ఈ స్కీమ్‌కు నిధులన్నీ కేంద్రమే ఇస్తున్నట్టు బీజేపీ నేతలు అబద్ధాలు చెప్తున్నారని, ఇందులో నిజానిజాలేంటో ప్రజలకు వివరించాలని సూచించారు. ఆనాడు ఎన్టీఆర్ తెచ్చిన రూ.2 కిలో బియ్యం స్కీమ్ మాదిరే తాము తెచ్చిన సన్నబియ్యం పథకం శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పారు. సన్న బియ్యం తామే ఇస్తున్నామంటున్న బీజేపీ నేతలను.. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో ప్రజల ముందు నిలదీయాలని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకమని, గత ప్రభుత్వాలు చేయలేకపోయిన ఈ చట్టాన్ని తాము చేసి చూపామని తెలిపారు. ఈ చట్టం కోసమే జాబ్నోటిఫికేషన్లు వాయిదా వేశామని చెప్పారు. కులగణన ద్వారా వందేండ్ల సమస్యకు పరిష్కారం చూపామని, బీసీలకు విద్య, ఉద్యోగాల్లో, లోకల్బాడీల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు తీసుకొచ్చామని, బలహీనవర్గాల పట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని తెలిపారు. వీటితోపాటు ధరణి స్థానంలో తెచ్చిన కొత్త భూ భారతి చట్టం గురించి ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు తెలియజేయాలని సూచించారు.
ధరణి వల్ల రైతులు ఇన్నేండ్లుగా ఎన్ని ఇబ్బందులు పడ్తున్నారో అందరికీ తెలుసని, భూ భారతి చట్టంతో ఆ కష్టాలన్నీ దూరమైనట్లేనని సీఎం వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు క్షేత్రస్థాయిలో అర్హులకు మాత్రమే అందాలని, దీనిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తెలిపారు.
ప్రజలను చైతన్యం చేయండి: డిప్యూటీ సీఎం భట్టి
పార్టీ శ్రేణులు ప్రజల్లో తిరుగుతూ.. సర్కారు సంక్షేమ పథకాలను వివరిస్తూ.. వారిని చైతన్యం చేయాలని పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘‘రూ.21 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసినం, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, 56 వేలకు పైబడి ప్రభుత్వ ఉద్యోగాలు, సన్న ధాన్యానికి 500 బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..ఇలా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.
సంక్షేమం ఒకెత్తయితే ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన పకడ్బందీగా పూర్తి చేశాం. ఈ రెండింటినీ గత కొన్ని దశాబ్దాలుగా గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయారు. కానీ మన ప్రభుత్వం ధైర్యంగా అడుగులు వేసి .. అందరికీ చెప్పి చేసింది. దీంతో ఈ రెండింటినీ అన్ని రాష్ట్రాల్లో చేయాలనే డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు చేసిన ఈ రెండు పనులు తమ అస్తిత్వానికే ప్రమాదం అని భావించి బీజేపీ, బీఆర్ఎస్ చేతులు కలిపాయని, ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కల్పించి ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించి కంచ గచ్చిబౌలిలో ఏనుగులు, పులులు తిరుగుతున్నట్టు ఈ రెండు పార్టీలు కలిసి ఏఐని ఉపయోగించి కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘బీసీ కుల గణన సర్వే మీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఏకంకండి, మాతో కలిసి రండి అని చెప్పి బహుజన వర్గాలను చైతన్యం చేయండి” అని భట్టి సూచించారు.
సన్న బియ్యం మన బ్రాండ్.. అది మన పథకం.. మన పేటెంట్. సన్న బియ్యం, భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ..అనే నాలుగు ఆయుధాలను నేను మీకు అందిస్తున్నా.. వీటిని పట్టుకొని జనాల్లో తిరగండి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ట పెరిగితేనే ఏ నాయకుడికైనా భవిష్యత్ఉంటుంది.
మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి. మీ నియోజకవర్గాల్లో ఏం పనులు కావాలో, ఎన్ని నిధులు అవసరమో ఒక నివేదిక తయారు చేసుకోండి. నేను ఒక్కో ఎమ్మెల్యేను కలిసేందుకు సమయం కేటాయిస్తా. మీ నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.
- సీఎం రేవంత్ రెడ్డి