ఫాంహౌసుల్లో డ్రగ్స్ తీసుకునే వారు మనకు ఆదర్శమా ? :సీఎం రేవంత్ సూటి ప్రశ్న

ఫాంహౌసుల్లో డ్రగ్స్ తీసుకునే వారు మనకు ఆదర్శమా ? :సీఎం రేవంత్ సూటి ప్రశ్న

హైదరాబాద్: ‘ఫాంహౌసుల్లో డ్రగ్స్ తీసుకునే వారు మనకు ఆదర్శమా’ అని సీఎం రేవంత్ బీఆర్ఎస్కు పరోక్షంగా చురకలంటించారు.  రవాణా శాఖలో ఏఎంవీఐలుగా ఉద్యోగం పొందినవారికి సోమవారం నాడు సీఎం రేవంత్, మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ బీఆర్ఎస్పై మండిపడ్డారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాట పట్టారని గుర్తుచేశారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదని సీఎం ఆరోపించారు. కేవలం కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులను కేసీఆర్ నమ్మించి గొంతుకోశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందే ఉద్యోగ భర్తీలు చేస్తామని చెప్పామని, ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నామని సీఎం రేవంత్ వివరించారు. గ్రూప్ 1 సహా అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని ఉద్యోగ నియామకాలను సీఎం గుర్తుచేశారు.

గత సర్కార్ పెద్దలు నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం తెలిపారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ త్వరగా చేపట్టేలా పర్యవేక్షించానని చెప్పారు. నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం తనకు సంతృప్తిని ఇస్తుందని సీఎం చెప్పారు. నిరుద్యోగుల ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలబడిందని గుర్తుచేశారు.

ALSO READ | కాంగ్రెస్ పవర్ లోకి రావడంలో మైనార్టీలు కీలకం: సీఎం రేవంత్

డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరిస్తామని, సరిహద్దుల్లో కఠినంగా వ్యవహరించాల్సింది వెహికల్ ఇన్స్పెక్టర్లేనని సీఎం రేవంత్ చెప్పారు. డ్రగ్స్ సప్లై చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలని సీఎం హెచ్చరించారు. విద్యనే తెలంగాణ సమాజాన్ని మార్చేస్తుందని, 10 ఏండ్లలో ఒక్క రెసిడెన్సియల్ స్కూల్ కట్టలేదని బీఆర్ఎస్ పాలనపై సీఎం నిప్పులు చెరిగారు. 

కొందరు దివాళీని చిచ్చుబుడ్లకు బదులు సారా బుడ్లతో చేసుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన ఆగదని, కాలుష్యం నుంచి ప్రజలను రక్షించుకోవాని చెప్పారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని ఏఎంవీఐలుగా ఉద్యోగం పొందినవారికి సీఎం సూచించారు.