స్కిల్​ వర్సిటీకి సింగపూర్ ఐటీఈ సహకారం!

స్కిల్​ వర్సిటీకి సింగపూర్ ఐటీఈ సహకారం!
  • విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డి బృందం 

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి బృందం గురువారం రాత్రి విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు సీఎం వెంట ఈ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో సింగపూర్ లో మూడు రోజులు పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐటీఈ)ని సీఎం టీమ్ సందర్శించనుంది. 

నైపుణ్య అభివృద్ధికి సింగపూర్ ఐటీఈ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనుంది. రాష్ట్రంలో  కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు. 

అలాగే..సింగపూర్ లో రివర్ ఫ్రంట్ ను సందర్శిస్తారు. ప్రపంచ స్థాయిలో మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నందునా అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియా అభివృద్ధి చేసిన తీరుతెన్నులను పరిశీలిస్తారు.  సింగపూర్ పర్యటన అనంతరం.. సీఎం బృందం 20వ తేదీ ఉదయం దావోస్ కు చేరుకుంటుంది. 22వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.