‘సెలవులు రద్దు చేసుకోండి’.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ ఇండ్ల నుండి బయటకు రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (ఆదివారం) అత్యవసర సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులతో ఫోన్ లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. సీఎస్, డీజీపీ, రెవిన్యూ, ఇరిగేషన్, విద్యుత్, హైడ్రా అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రెవిన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు క్షేతస్థాయిలో పర్యటించాలన్నారు.  రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో అధికారులు సెలవులు రద్దు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహయక చర్యలు ప్రారంభించాలని సూచించారు.

Also Read :హైదరాబాద్ లో అతిభారీ వర్షం పడే ఛాన్స్

 వరదలు, సహయక చర్యల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు పంపాలని అధికారులకు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉంటూ సహయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.