
హైదరాబాద్, వెలుగు: రంజాన్ (ఈద్–ఉల్– ఫితర్) పండుగను ముస్లిం సోదర, సోదరీమణలు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ పండుగ లౌకిక వాదం, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
రంజాన్ నెలలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన, ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసి మెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా దువా ఉండాలని సీఎం ఆకాంక్షించారు.