తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఎవరూ ఉండరని.. అందరూ కాంగ్రెస్ లోకి క్యూ కడతారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అనవసరంగా మాతో గోక్కోవద్దని హెచ్చరించారు. మాకూ లోతు తెలుసు... పెడ్తే ఎక్కడికి వెళ్తుందో అంతకంటే బాగా తెలుసునని ధ్వజమెత్తారు. మణుగూరు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సభా వేదిక నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్ సభ ఎన్నికల శంఖరావాన్ని సీఎం పూరించారు.
బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి అని విమర్శించారు. ప్రజా పాలనలో ప్రజలకు మంచి జరుగుతుంటే కేసీఆర్ ఫ్యామిలీ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని.. అవగాహనతోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయని సీఎం ఆరోపించారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.