KCR అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవనివ్వ: సీఎం రేవంత్

KCR అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవనివ్వ: సీఎం రేవంత్

వరంగల్: బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత కేసీఆర్‎పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవనివ్వనని శపథం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ తెచ్చిన బెల్ట్ షాపులు ఇప్పటికి ఊరురా ఉన్నాయన్న సీఎం రేవంత్.. రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకైక అధ్యక్షుడు కేసీఆర్ అని.. ఫుల్ బాటిల్‎కు బ్రాండ్ అంబాసిడరని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కేసీఆర్ జనాన్ని మత్తులో ముంచెత్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా మంగళవారం (నవంబర్ 19) వరంగల్‎లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ఆదాయం నెలకు  రూ.18500  కోట్లలో రూ.6500 కోట్లు జీతాల రూపంలో.. మరో రూ.6000 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ రూపంలో పోతున్నాయని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడదాం రావాలని కేసీఆర్‎, హరీష్ రావు, కేటీఆర్‎కు సవాల్ విసిరారు.

నువ్వు అసెంబ్లీకి రావు.. ఇద్దరు చిల్లరగాళ్ళను వదిలావని కేటీఆర్, హరీష్ రావుపై ఘాటు విమర్శలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే జైల్‎లో పెట్టీ ఊచలు లెక్క పెట్టిస్తామని హెచ్చరించారు. 11 నెలల్లోనే ప్రజలు ఏం కోల్పోయారో వాళ్లకు తెలిసొంచ్చిదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సైతం కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మీరు ఫామ్ హౌజ్‎లోనే ఉండండి.. ప్రజలు ఏం కోల్పోలే.. మీ ఇంట్లో నలుగురి పదవులు మాత్రం పోయాయని రివర్స్ కౌంటర్ ఇచ్చారు.