![కేసీఆర్ ఫ్యామిలీకి తెలంగాణలో జీవించే హక్కే లేదు: సీఎం రేవంత్](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddy-fire-on-kcr-family_B4yvbzAKoJ.jpg)
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణపై శుక్రవారం (ఫిబ్రవరి 14) గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
మొత్తం 5 కేటగిరీల కింద కుల గణన వివరాలు సేకరించామని.. కుల గణన తుది నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని బీసీ జనాభా 56.33 శాతం ఉందని వెల్లడించారు. గతంలో సర్వే చేసి వివరాలు వెల్లడించకుండా దాచిన వారు ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఇప్పటిదాకా ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు.
ALSO READ | మోడీ కన్వర్టెడ్ బీసీ.. దమ్ముంటే కేంద్రం కుల గణన చేయాలి: సీఎం రేవంత్ సవాల్
ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టంగా, శాస్త్రీయంగా కుల గణన సర్వే చేయించామని తెలిపారు. కుల గణనలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీకి తెలంగాణ సమాజంలో నివసించే హక్కు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా సర్వేలో పాల్గొనేలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంటి ముందుకు మేలుకొలుపు డప్పు కొట్టండని అన్నారు.
కులగణనపై ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. మైనార్టీల లెక్క ఎలా తీశామని కొందరు ప్రశ్నిస్తున్నారు.. బీసీ-ఈ గ్రూప్ కింద 4 శాతం రిజర్వేషన్ ఉంది కాబట్టే మైనార్టీల లెక్క తీశామని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఒక్కరోజే సర్వే చేసి కాకి లెక్కలు చూపించారని.. కాకి లెక్కలతో సర్వే చేసి.. మా సర్వే తప్పంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ అయితే.. ఎందుకు వివరాలు ఇన్నాళ్లు వెల్లడించలేదని నిలదీశారు. కులగణనపై విపక్షాలది దుష్ప్రచారం మాత్రమేనన్నారు.
సీనియర్ మంత్రులను కుల గణన సర్వేలో సభ్యులుగా చేర్చామని.. కుల గణనపై నిర్ధిష్టమైన ప్రణాళిక రచించి ప్లానింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించామని తెలిపారు. మొత్తం లక్షా 4 వేల ప్రభుత్వ అధికారులు సర్వేలో పాల్గొన్నారని.. 3 రోజుల్లో 150 ఇండ్లను సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. 95 వేల యూనిట్లుగా విభజించి 95 వేల మంది ఎన్ రోలర్స్ని నియమించామని తెలిపారు.
మొత్తం 45 రోజుల పాటు సర్వే చేసి రిపోర్టు తయారు చేయించామని చెప్పారు. అధికారులు ఒకటికి 4 సార్లు ప్రతీ ఇంటికి తిరిగి వివరాలు సేకరించారన్నారు. సర్వే వివరాలను కేటీఆర్ లాంటి వాళ్లు తప్పుబడతారని యాజమానుల సంతకాలు తీసుకున్నామన్నారు. అలాగే.. 36 వేల మంది డేటా ఆపరేటర్లతో సర్వేను ఆన్ లైన్ చేయించామని పేర్కొన్నారు.