దేశానికి కంప్యూటర్లు పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని చెప్పారు సీఎం రేవంత్. సాంకేతిక విప్లవంతోనే ఈ రోజు ప్రపంచంతో పోటీ పడుతున్నామన్నారు. రాజీవ్ లేకుంటే కేటీఆర్ ఐటీ మంత్రి అయ్యేవాడా? అని ప్రశ్నించారు. కంప్యూటర్లు రాకుంటే సిద్దిపేటలో ఇడ్లీ వడ అమ్ముకునే వాళ్లు.. ఎక్స్ లో ట్వీట్లు చేసే వాళ్లు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని ధ్వజమెత్తారు రేవంత్. కేటీఆర్ బలుపు మాటలు కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలన్నారు. వాళ్ల గడీలల్లో గడ్డిమొలిచేలా చేశా.. ఫామ్ హౌస్ లల్లో జిల్లేళ్లు మొలిచేలా చేస్తానని సవాల్ విసిరారు. రాజకీయంగా దివాళ తీసిన వాళ్లు కొందరు చిల్లరగాళ్లతో మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మిడతల దండును పొలిమెర వరకు తరిమి కొడ్తామన్నారు.
పదేండ్లలో ఫామ్ హౌస్ లు ,అవినీతి కాళేశ్వరం కట్టుకోలేదా? రాష్రాన్ని దోచుకుని పదవులు పంచుకున్నారు. తెలుగు బిడ్డ పీవీని ప్రధానిని చేసింది సోనియా కాదా? తెలంగాణను కాపాడేది మేమే..తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది మేమే. తెలగాన తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న పెడ్తాం. త్యాగం అంటే సోనియా గాంధీది..వీళ్లు చేసిన త్యాగం ఏంటి. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపు కోసం వెళ్లని నీచులు . రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తాం. త్యాగం అంటే ఏంటో భావి తరాలకు గుర్తు చేయాల్సిన బాద్యత మనపై ఉంది. గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత అవినీతి పరులకు లేదు. వేల కోట్లు దోచుకున్నోళ్లు ఇపుడు మాట్లాడుతున్నారు. వేల కోట్ల ఆస్తులే కాదు.. ప్రాణ త్యాగాలు చేసిన ఫ్యామిలీ రాజీవ్ కుటుంబానిది. చిల్లర మాటలు మాట్లాడే వాళ్లు గాంధీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని హితవు పలికారు సీఎం రేవంత్.