- అప్రూవల్ లేకుండా రూ.1,100 కోట్లను 1,726 కోట్లు ఎట్ల చేసిన్రు?
- వరంగల్ హాస్పిటల్ నిర్మాణ అంచనా వ్యయంపై సీఎం రేవంత్ ఫైర్
- నిర్మాణ వ్యయంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి
- గడువులోగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి కావాలి
- గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన్రు
- రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డ్, ఫ్రీ ట్రీట్‍మెంట్
- వరంగల్‌కు త్వరలోనే ఎయిర్‍పోర్ట్, మాస్టర్ ప్లాన్
- రూ. 6,115 కోట్ల అంచనాలతో గ్రేటర్ వరంగల్ అభివృద్ధి
- హెల్త్, ఎకో టూరిజం డెవలప్ చేస్తామని ప్రకటన
వరంగల్/హనుమకొండ, వెలుగు : వరంగల్ సెంట్రల్ జైల్ ఆవరణలోని 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ వ్యయం నోటిమాటగా ఏక్ దమ్ రూ.626 కోట్లు ఎట్ల పెరిగిందని అధికారులను సీఎం రేవంత్‍రెడ్డి ప్రశ్నించారు. ఎలాంటి అప్రూవల్ లేకుండా రూ.1,100 కోట్ల అంచనా వ్యయాన్ని ఇష్టారీతిన రూ.1,726 కోట్లకు ఎందుకు పెంచారని అడిగారు. రూల్స్‌కు విరుద్ధంగా నిర్మాణ ఖర్చు పెంచినందున మొత్తం నిర్మాణ వ్యయంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థతో గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ పనులను పూర్తయ్యేలా చూడాలని తేల్చిచెప్పారు. సీఎం రేవంత్‍రెడ్డి శనివారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించారు.
వన మహోత్సవంలో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఆయన మొక్కలు నాటారు. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి, భూ బాధితులకు పరిహారం అందించే చర్యలను వేగవంతం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆపై వరంగల్ సిటీలోని 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై హనుమకొండ కలెక్టరేట్‍లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‍రెడ్డితో కలిసి అధికారులతో సుదీర్ఘంగా రివ్యూ చేపట్టారు.
స్వశక్తి మహిళలకు రూ.518 కోట్ల 71 లక్షల 20 వేల చెక్కును అందించారు. స్కూల్ పిల్లల యూనిఫామ్స్‌తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది యూనిఫాంలను కుట్టించే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించేలా చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. ఆఫీసర్ల రివ్యూ అనంతరం సీఎం రేవంత్‍రెడ్డి హంటర్‍రోడ్‍లోని మెడికవర్ హస్పిటల్‍ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.
గత బీఆర్‍ఎస్ సర్కార్ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.1,100 కోట్ల నుంచి 1,726 కోట్లకు పెంచడంపై అధికారులను సీఎం రేవంత్‍రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోట్లు కొల్లగొట్టిన్రు
గత బీఆర్‍ఎస్ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు తమకు ఫిర్యాదులు అందాయని సీఎం రేవంత్‍రెడ్డి తెలిపారు. వాటిపై ఎంక్వైరీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరునికి హెల్త్ కార్డ్ , దానితో ఫ్రీ ట్రీట్‍మెంట్ అందిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరి హెల్త్ కార్డులో వారి బ్లడ్ గ్రూప్, ఆరోగ్య సమస్యలు, జరిగిన ట్రీట్‍మెంట్ ఈజీగా తెలుసుకునేలా కార్డుతో యూనిక్ కోడ్ డిజిటలైజేషన్ చేస్తామన్నారు.
ఫార్మా, ఐటీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి వైపు నడుస్తున్నదని.. రాజీవ్‍గాంధీ చొరవతోనే తెలంగాణ ప్రాంతంలో ఐటీ రంగం రాణించిందని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని మెడికల్ టూరిజం హబ్‍గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కూతవేటు దూరంలో 1,000 ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
టెక్స్టైల్ పార్కు.. మరో గ్రామ పంచాయతీ
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి.. ఈ ప్రాంతాన్ని కొత్త గ్రామ పంచాయతీ చేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. భూ బాధితులకు సంబంధించి దాదాపు 1,200 ఇండ్లతో పాటు పార్కులో పనిచేసే ఉద్యోగులు కూడా ఇదే ఏరియాలో ఉండే అవకాశం ఉన్నందున కొత్త గ్రామ పంచాయతీ ప్రకటన చేస్తామన్నారు. ఒక గ్రామానికి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ పార్క్ దగ్గర్లో ఇచ్చే కాలనీలో ఉండేలా ప్రపోజల్స్ పంపాలని ఆఫీసర్లను ఆయన ఆదేశించారు.
ఇక పార్కులో నీటి అవసరాల కోసం టెక్స్టైల్ పార్క్ డౌన్‌స్ట్రీమ్ ఏరియాలో 15 నుంచి 20 ఎకరాలు సేకరించి చెరువు తవ్వించాలన్నారు. దీనిని స్థానికంగా ఉండే చెరువుకు అనుసంధానం చేయాలని సూచించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
‘వరంగల్ మాస్టర్ ప్లాన్ 2050’ డిజైన్ చేయాలి
హైదరాబాద్‍తో పోటీ పడేలా వరంగల్‍ను అభివృద్ధి చేస్తామని, వరంగల్ మాస్టర్ ప్లాన్ గతంలో మాదిరి కాకుండా 2050ని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‍రెడ్డి ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి రూ.6,115 కోట్లు అవసరమని అంచనాకు వచ్చినట్లు తెలిపారు. దాదాపు 3 గంటల పాటు నిర్వహించిన రివ్యూలో ప్రధానంగా మాట్లాడుతూ.. వరంగల్‍ను కూడా హెల్త్, ఎడ్యుకేషన్, ఎకో టెంపుల్ టూరిజంలో అభివృద్ధి చేస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై డీటెయిల్ రిపోర్ట్ తయారు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. నాలాలపై అక్రమ నిర్మాణాలుంటే తొలగించి రాబోయే వానాకాలంలో వరద, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నారు.
కొత్త మాస్టర్ ప్లాన్, మామునూర్ ఎయిర్‍పోర్ట్, కాళోజీ కళాక్షేత్రం పనులపై ఆయన సమీక్షించారు. వరంగల్ మీదుగా వెళ్లే నేషనల్ హైవేల నుంచి మరో నేషనల్ హైవేకు చేరుకునేలా ఔటర్ రింగ్ రోడ్లు ఉండాలని సూచించారు. వరంగల్ ఎంజీఎంను హైదరాబాద్‍లోని నిలోఫర్ హస్పిటల్ మాదిరి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం తొందర్లోనే వరంగల్ నగరానికి మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను పునరుద్ధరించి..
కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు సీఎం వివరించారు. వరంగల్ అభివృద్ధిపై ప్రస్తుతం చేస్తున్నది ప్రాథమిక సమీక్ష అని.. 45 రోజుల తర్వాత మరోసారి రివ్యూ చేపడుతామన్నారు. ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై ప్రతి 20 రోజులకోసారి రెగ్యులర్ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.