మ్యాన్ మేడ్ వండర్ ఎలా కూలింది..? సీఎం రేవంత్ సెటైర్

మ్యాన్ మేడ్ వండర్ ఎలా కూలింది..? సీఎం రేవంత్ సెటైర్

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు కీలకమైన అంశమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నీళ్లు మన జీవన విధానంలో ఓ భాగమని.. వ్యవసాయం, నీళ్లు తెలంగాణ ప్రజల భావోద్వేగమని అన్నారు. హైదరాబాద్ జలసౌధలో కొత్తగా నియమాకమైన 700 మంది ఏఈఈలకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబర్ 26) నియామక పత్రాలు అందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏఈఈలకు ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగమని వ్యాఖ్యానించారు. అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగితే మంచి అవగాహన వస్తోందని.. క్షేత్ర స్థాయిలో తిరిగి నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని సూచించారు. నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని.. నాణ్యత లేకుంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నేళ్లు ఉండేవి కావన్నారు. 

ALSO READ : కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పొన్నం

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఈ రోజు వరకు నిలబడ్డాయ్.. ఐదేళ్ల ముందు మన కండ్లముందే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రం కూలిపోయిందని బీఆర్ఎస్‎పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పిన మ్యాన్ మేడ్ వండర్ ప్రాజెక్ట్ కూలిపోయిందని ఎద్దేవా చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. తప్పులు చేయకుండా ఉండేందుకు కొత్తగా ఎన్నికైన వాళ్లకు కాళేశ్వరం ఓ ప్రయోగశాలగా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో చర్యలు తీసుకుంటే అసలు ఇరిగేషన్ డిపార్ట్ మెంటే ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు సాగునీటిపై ఖర్చు చేసి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.