మళ్లా సెంటిమెంట్ రాజకీయం

 మళ్లా సెంటిమెంట్ రాజకీయం
  • ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్​ను రాజేస్తున్న బీఆర్ఎస్ 
  • సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఆంధ్రా వ్యక్తిగా ముద్ర 
  • స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర 
  • అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా లీడర్లను అందలమెక్కించిన కేసీఆర్​
  • కాళేశ్వరం సహా కాంట్రాక్టులన్నీ వాళ్లకే కట్టబెట్టిన గత ప్రభుత్వం 
  • నాడు సెటిలర్ల అరికాలికి ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానన్న గులాబీ​ బాస్​
  • నేడు ఆంధ్రోళ్లకు తెలంగాణ తడాఖా చూపెడ్తామన్న కౌశిక్​రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం సైలెన్స్​
  • ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ భావోద్వేగాలను రెచ్చగొడ్తున్న బీఆర్ఎస్ నేతలు 

హైదరాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా లీడర్లను, ఆంధ్రా కాంట్రాక్టర్లను నెత్తిన పెట్టుకున్న బీఆర్‌‌ఎస్ నేతలు..అధికారం కోల్పోవడంతో మరోసారి ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నారు. 

హైదరాబాద్​లో ఆంధ్రా లీడర్లకు టికెట్లు ఇచ్చి, సెటిలర్ల అరికాలికి ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పి నాడు ఓట్లు వేయించుకున్న కేసీఆర్ అండ్​ టీమ్​ తాజాగా రూట్​ మార్చింది. బతకడానికి ఆంధ్రా నుంచి హైదరాబాద్‌ వచ్చినోళ్లకు తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి హెచ్చరిస్తుంటే..ఆ పార్టీ పెద్ద లీడర్లు సైలెంట్​గా మద్దతు ఇస్తున్నారు.

 ‘‘బీఆర్ఎస్​కు ఆంధ్రా వాళ్ల ఓట్లు కావాలి గానీ ఆంధ్రా లీడర్లు అవసరం లేదా? ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డితో  కేసీఆర్, కేటీఆరే అలా​మాట్లాడించారా? లేదంటే కౌశిక్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్ గురువారం ఢిల్లీలో సవాల్​ చేసినా బీఆర్ఎస్ హైకమాండ్​ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. దీన్ని బట్టి కౌశిక్​రెడ్డి ఎపిసోడ్​ అంతా బీఆర్ఎస్​ హైకమాండ్​కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు అర్థమవుతున్నదని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది. 

బీఆర్ఎస్ టికెట్‌పైనే గెలిచిన అరికెపూడి గాంధీపై ఆంధ్రా వ్యక్తిగా ముద్ర వేయడం..  కౌశిక్‌ రెడ్డి, గాంధీకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని ఆంధ్ర, తెలంగాణ వాళ్లకు మధ్య జరుగుతున్న వార్​గా చూపించేందుకు ప్రయత్నించడం.. బీఆర్ఎస్ ప్లాన్​లో భాగమేననే వాదన వినిపిస్తున్నది. 2014 ఎన్నికల్లో ఆంధ్రా మూలాలు ఉన్న నాయకులంతా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 

అప్పట్లో వాళ్లందరికీ రెడ్‌‌‌‌కార్పెట్ వేసి మరీ కేసీఆర్ తన పార్టీలోకి ఆహ్వానించారు. వీరి కోసం తెలంగాణ ఉద్యమంలో పని చేసిన నాయకులను, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్లను కూడా పక్కనబెట్టారు. హైదరాబాద్​లో సెటిలర్ల ప్రభావం ఎక్కువ కావడంతో 2018 ఎన్నికల్లోనూ ఆంధ్రా మూలాలు ఉన్న నాయకులకే టికెట్లు ఇచ్చారు. 

ఇప్పుడు ఆంధ్రా వ్యక్తిగా పేర్కొంటున్న అరికెపూడి గాంధీకి మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది కూడా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీనే. మరి అప్పుడు గుర్తుకురాని ఆయన ఆంధ్రా మూలాలు.. ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయని వలస నేతలు ప్రశ్నిస్తున్నారు. సెటిలర్లు లేకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు పది సీట్లు కూడా రాకపోయేవని ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారు. గతంలో సెటిలర్ల ఓట్లతోనే జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అవమానకర ఓటమి నుంచి బయటపడిందని గుర్తు చేస్తున్నారు. 

ఆంధ్రా వాళ్లకే కాంట్రాక్టులు.. 

తెలంగాణ వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీని వెయ్యి నాగళ్లతో దున్నిస్తానని, అన్ని రంగాల్లోనూ తెలంగాణ వ్యక్తులకే అవకాశం ఇస్తానని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలేవీ నిలబెట్టుకోలేకపోయారు. పైగా లక్ష కోట్ల కాళేశ్వరం సహా అనేక పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. మేఘా కృష్ణారెడ్డి వంటి వారిని అక్కున చేర్చుకుని వేల కోట్లకు అధిపతులను చేశారు. 

సెటిలర్ల అరికాలికి ముల్లు గుచ్చితే, తన పంటితో తీస్తానని కేసీఆర్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఏపీకి వెళ్లి రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని మాటిచ్చారు. ఇందుకోసం అవసరమైతే గోదావరి జలాలను కూడా ఇస్తామని చెప్పారు. ఏపీ సీఎం జగన్‌‌‌‌తో దోస్తానా చేయడంతో పాటు ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌‌‌‌ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగే ప్రమాదమున్నా..దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఇలా అధికారంలో ఉన్నన్ని రోజులూ సెటిలర్ల ఓట్ల కోసం, ఆంధ్రా లీడర్ల కోసం పాకులాడిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్.. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాడే ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్‌‌‌‌ను రగిల్చే ప్రయత్నం చేసింది. పోలింగ్ నాడే ఏపీ పోలీసులు నాగార్జునసాగర్ వద్దకు వచ్చి బలవంతంగా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో, ఇక్కడి పోలీసులతో ఘర్షణకు దిగారు. 

సెంటిమెంట్​ను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టేందుకే నాటి బీఆర్ఎస్ పెద్దలు ఈ కుట్ర చేశారని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. తాజాగా​స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్​ నేతలు మరోసారి ఆంధ్రా, తెలంగాణ అంటూ సెంటిమెంట్‌‌‌‌ను రెచ్చగొట్టడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన బీఆర్ఎస్​ఇప్పటికే గ్రామాల్లో క్యాడర్​ను కోల్పోయింది. 

త్వరలో జరగనున్న లోకల్​బాడీ ఎన్నికల్లోనూ కొన్ని సీట్లయినా గెలుచుకోకపోతే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే మళ్లీ  ఆ పార్టీ నేతలు సెంటిమెంట్ ను​ రెచ్చగొడ్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బతకడానికి వచ్చిండు.. ఉరికిస్త

నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. అరికెపూడి గాంధీ లెక్క కృష్ణా జిల్లాలో పుట్టి హైదరాబాద్‌కు బతకడానికి రాలేదు. హైదరాబాద్‌ గడ్డ మీద పుట్టిన. అరికెపూడి గాంధీ ఆంధ్రాలో పుట్టి, మా దగ్గరికి బతకడానికి వచ్చిండు. ఆయనకే అంత ఉంటే, నాకెంత ఉంటదో చూపిస్తా. చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటది. హైదరాబాద్‌లో గాంధీని ఉరికిస్త.

- కౌశిక్‌ రెడ్డి, బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే 

మమ్మల్నే రెచ్చగొడ్తున్నరు..

రాష్ట్రంలో ఇంకా ఆంధ్రా పాలకుల తొత్తులు ఉన్నరు. వాళ్లే మమ్మల్ని రెచ్చగొడ్తున్నరు. మా కేడర్ సహనం కోల్పోతే మా చేతుల్లో ఏమీ ఉండదు. 
ఏపీ సీఎంగా చంద్రబాబు గెలిచినంక బీఆర్ఎస్​వాళ్లను, తెలంగాణవాదులను రెచ్చగొడుతున్నరు. 

- వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే