సుందరీకరణ కాదు పునరుజ్జీవం .. వరదల నుంచి నగరాన్ని కాపాడటమే మా లక్ష్యం: సీఎం రేవంత్​

సుందరీకరణ కాదు పునరుజ్జీవం .. వరదల నుంచి నగరాన్ని కాపాడటమే మా లక్ష్యం: సీఎం రేవంత్​
  • బందిపోటు దొంగల్లా పదేండ్లు తెలంగాణను దోచుకున్నోళ్లే అడ్డుపడ్తున్నరని ఫైర్​
  • కేటీఆర్, హరీశ్, ఈటలకు దమ్ముంటే మూడు నెలలు మూసీ ఒడ్డున ఉండాలి
  • వాళ్లు అన్నిరోజులు ఉండగలిగితే నేను ఈ ప్రాజెక్టును విరమించుకుంటా 
  • మూసీ ప్రజలను ఎలా ఆదుకోవాలో ప్రతిపక్షాలు సూచనలిస్తే స్వీకరిస్తం 
  • రేపటిలోగా బీఆర్​ఎస్​, బీజేపీ, ఎంఐఎం యాక్షన్ ప్లాన్ ఇవ్వాలి  
  • అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చిద్దామని సూచన
  • ఇప్పటి వరకు మూసీపై చేసుకున్న ఒప్పందాల విలువ రూ.141 కోట్లేనని వెల్లడి 
  • ప్రతిపక్షాలు చెప్తున్న లక్షా 50 వేల కోట్లు వట్టి మాటలేనని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: తాము చేపట్టేది మూసీ సుందరీకరణ కాదని, మూసీ నది పునరుజ్జీవమని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఇది తెలంగాణ భవిష్యత్​ను నిర్ణయించే ప్రాజెక్టు. మూసీ నది పునరుజ్జీవాన్ని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నరు. దానికి బ్యూటిఫికేషన్ అనే కాస్మోటిక్​ డైలాగ్ యాడ్​ చేసిన్రు. మేం అందాల కోసం పనిచేస్తలేం. మూసీ మురికిలో, కంపులో కాలం వెళ్లదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలని.. వరదల నుంచి హైదరాబాద్​నగరాన్ని కాపాడాలని ముందుకు వెళ్తున్నాం” అని ఆయన చెప్పారు. పగటిపూట బందిపోటు దొంగల్లా పదేండ్లు అధికార ముసుగులో తెలంగాణను దోచుకున్నవాళ్లే మూసీ ప్రాజెక్టుకు అడ్డుపడ్తున్నారని బీఆర్​ఎస్​ నేతలపై ఫైర్​ అయ్యారు. 

మూసీ ప్రజలు ఎన్నాళ్లు మురికి కూపంలో బతకాలని, వాళ్లు మంచిగా బతకొద్దా అని ఆయన ప్రశ్నించారు. ‘‘హరీశ్​రావు, కేటీఆర్, ఈటల రాజేందర్​ ముగ్గురూ మూసీ ఒడ్డున ఒక మూడు నెలలన్నా నివసించగలరా? అప్పుడైనా వాళ్లకు అక్కడి జనం తిప్పలు తెలిసొస్తయి. అట్ల నివసించడానికి ఆ ముగ్గురు ముందుకు వస్తే నేనే ఇంటి కిరాయి కడ్త. మూడు నెలలు నివసించి చూపించండి. అప్పుడు మూసీ ప్రాజెక్టును ఆపేస్తా” అని సవాల్​ చేశారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై గురువారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయిన వాళ్లు అసహనంతో ప్రతీది అడ్డుకోవాలని చూస్తున్నారని, మూసీలో ఉన్న మురికి కంటే వారి మెదళ్లలో ఉన్న విషం ఎక్కువ అని బీఆర్​ఎస్​ నేతలపై ఫైర్​ అయ్యారు.

 మూసీ నదీ గర్భం నుంచి ఖాళీ చేసి.. డబుల్​ బెడ్రూం ఇండ్లకు వెళ్లిన వాళ్ల ఇండ్లలో ఒక్క పెల్ల కూడా ప్రభుత్వం కూల్చలేదని స్పష్టం చేశారు. ఎవరైతే ఖాళీ చేశారో వాళ్లే ఆ సామాన్లు ఇప్పుకుని పోయారని తెలిపారు. ‘‘ఇప్పటి వరకు ఎవరైతే డబుల్​ బెడ్రూం ఇండ్లలోకి వెళ్లారో.. వాళ్లే సామాన్లు తీసుకుని వాళ్ల ఇండ్లను కూల్చుకున్నారు. ప్రభుత్వం ఒక ఇల్లు కూడా కూల్చలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి మూసీలో ఇటుక పెల్ల కూడా కూల్చలేదు. లబ్ధిదారులు ఎవరైతే డబుల్​ బెడ్రూం ఇండ్లు తీసుకున్నారో.. వాళ్ల సామాను తీసుకుని వాళ్లే మూసీ నదీగర్భంలోని ఇండ్లను కూలగొట్టిన్రు. హైడ్రా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రతిపక్షాలు సృష్టించే అపోహల్లో పడొద్దు” అని సీఎం పేర్కొన్నారు. 

కేసీఆర్​.. చర్చకు సిద్ధమా?

ఇది సుందరీకరణ కోసం కాదు. దుబాయ్​ కు వెళ్లి సుందరీకరణ కోసం నెత్తిమీద జుట్టు నాట్లు వేయించుకొచ్చుకున్న విధానం మాది కాదు” అని బీఆర్​ఎస్​ నేతలను సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. ‘‘మా లక్ష్యం మూసీ నదిని పునరుజ్జీవింప జేయడం. మూసీ మురికిలో కాలం వెళ్లదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి. వాళ్లకు ఒక మంచి జీవన విధానం ఇవ్వాలి. వాళ్లకు ఉపాధి కల్పించాలి. వాళ్లకు ప్రత్యామ్నాయ ఇండ్లను కేటాయించాలి. వాళ్ల భవిష్యత్​ ఆశాజనకంగా ఉండేందుకు అవసరమైన ప్రణాళికలు రచించాలన్నదే మా తపన” అని తెలిపారు. 

బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్​, వేముల ఘాట్​ నిర్వాసితులను ఉన్నఫళంగా అర్ధరాత్రి పూట దౌర్జన్యంగా ఖాళీ చేయించారని.. గుర్రాలతో , పోలీసులతో తొక్కించారని..కొట్టించారని మండిపడ్డారు. తమ విధానం అలాంటిది కాదని పేర్కొన్నారు. ‘‘ఇడికి వస్తవా.. అడికి వస్తవా అని బీఆర్​ఎస్​ నేతలు అడుగుతున్నరు. ఏటిగడ్డ కిష్టాపూర్​కైనా, వేములఘాట్​కైనా, మల్లన్నసాగర్​కైనా, రంగనాయకసాగర్​కైనా, కొండపోచమ్మకైనా నేను వస్తా. సెక్యూరిటీ లేకుండా వస్తా. సిద్దిపేటలో కట్టిన రంగనాయకసాగర్​ రమ్మన్నా వస్తా.. గజ్వేల్​లో కట్టిన కొండపోచమ్మ సాగర్​కైనా వస్తా. ఎక్కడికైనా నేను వస్తా. మీకు వచ్చే దమ్ముందా?  మీరు రండి. రచ్చబండ నిర్వహిద్దాం. మీ పదేండ్ల దుర్మార్గం ఏందో తేలుద్దాం. కేసీఆర్​..! 

మీ నియోజకవర్గానికి వస్త. ఇద్దరం వెళ్లి మర్రిచెట్టు కింద కూర్చొని జనం మధ్య చర్చిద్దాం. సిద్ధమా?” అని ఆయన సవాల్​ చేశారు. మూసీ ప్రజలకు మంచి జీవితాన్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. వాళ్లతో మాట్లాడి, చర్చించి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ‘‘ హైదరాబాద్​ నగరానికి ఉన్న అద్భుతమైన అవకాశం దేశంలో ఏ నగరానికీ లేదు.  నగరం మధ్యలో నదీ ప్రవహించే అవకాశం హైదరాబాద్​కే ఉన్నది. కానీ, పాలకుల నిర్లక్ష్యంతో మూసీ మురికి నరకకూపంగా మారింది. దాంట్లో నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలన్న గొప్ప ఆలోచనతోనే మా ప్రభుత్వం ఉంది” అని సీఎం వివరించారు. 

అధికారం కోల్పోయిందన్న అసహనంతో మూసీ ప్రాజెక్టుపై బీఆర్​ఎస్​ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘పగటి పూటనే బందిపోటు దొంగలు దోసుకుంటారని విన్నం. అధికారం ముసుగులో పదేండ్లు దోచుకున్నోళ్లు ఈ రోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది పునర్జీవనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి బ్యూటిఫికేషన్ అనే కాస్మోటిక్​ డైలాగ్ యాడ్​ చేశారు”అని దుయ్యబట్టారు. మూసీ పేరు చెప్పి దోచుకోవాలన్న తప్పుడు ఆలోచనలు తమకు లేవని.. అలాంటి విధానాలు ఉన్నవాళ్లను ప్రజలు ఎప్పుడో ఇంటికి పంపారని అన్నారు. సోషల్​ మీడియాలో విష ప్రచారం చేస్తే ఆటోమేటిక్​గా అధికారం వస్తదనే భ్రమల్లో కేటీఆర్​ ఉన్నారని విమర్శించారు.

 మూసీ మురికి కంటే.. బీఆర్​ఎస్​ నేతలు మెదళ్లలో ఎక్కువ విషం నింపుకున్నారని ఆయన ఫైర్​ అయ్యారు. మూసీ నది అనంతగిరి కొండల్లో మొదలైన నల్గొండ దాకా దాదాపు 300 కిలో మీటర్లు ప్రవహిస్తున్నదని తెలిపారు. ‘‘మూసీ నది అంటే ఒకప్పుడు అద్భుతం. దాన్ని మురికి కూపంగా మార్చారు. చరిత్రలో మనం చరిత్రహీనులుగా మిగలకూడదని ఈ ప్రభుత్వం మంచి ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఈ ప్రణాళికను అమలు చేసేటప్పుడు.. దాని పరీవాహక ప్రాంతంలో ఉన్న అందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది. వాళ్లతో సంప్రదించి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించి.. ఒక్కొక్కరిని తరలిస్తం” అని వివరించారు. 

నగరాన్ని ఇట్లనే వదిలేద్దామా ?

మూసీ నది బఫర్​ జోన్​లో10 వేల ఇండ్లు ఉన్నాయని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ‘‘వాళ్లకు ఏ నష్టపరిహారం ఇవ్వాలి.. ప్రత్యామ్నాయంగా ఏం చూడాలి.. వాళ్లను ఎట్లా ఆదుకోవాలి అనేది బీఆర్​ఎస్​, బీజేపీ, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు సలహాలు ఇవ్వాలి” అని కోరారు. ‘‘ఈ నగరాన్ని ఇట్లే వదిలేద్దామా. ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారాలా? చెరువులు, నాలాలు, కుంటలు పోయినయ్​.. మూసీ మూసుకుపోయిన తరువాత ఎక్కడికి పోదాం? ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఏం చేయదలుచుకున్నారు. ఈ నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నరా? ఈ నగరం బాగుపడొద్దా ? నిన్న గాక మొన్న చూసినం. వరదలకు బెంగుళూరు, చెన్నై ఏమైంది..? 

చెరువులు ఆక్రమించుకుని కాంక్రీట్​ జంగిల్​ చేయడంతో బెంగుళూరులో ఈ రోజు ఏ పరిస్థితికి దారితీసింది? సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోతే ఏం జరిగిందో చెన్నైలో చూసినం. అలాంటి పరిస్థితి హైదరాబాద్​కు రావొద్దంటే అందరూ సహకరించాలి” అని కోరారు. ‘‘అందరిని అడగదలుచుకున్నా. మూసీ ప్రాంతంలోని పేదలను ఖాళీ చేయించడం ద్వారా మేం ఆర్థిక లబ్ధి పొందుతున్నామా? మేం ఐదేండ్లు ఉంటమా.. పదేండ్లు ఉంటామా అనేది ప్రజలు నిర్ణయిస్తరు. ఒక ఉప్పెన వచ్చి తుడిచిపెట్టుకుపోతే నగరమే మిగలదు.. ఒక్క చినుకు పడితే ట్రాఫిక్​ తిప్పలు.. అప్పుడు ప్రభుత్వం ఏం పనిచేయదా? అని మీరే తిడుతరు. పేదలకు మంచి చేయాలన్నదే మా లక్ష్యం, మా తపన” అని తెలిపారు.

వాళ్లను లోపలేయొచ్చు 

గతంలో వాళ్లు సుందరీకరణ చేస్తామని.. ఉప్పల్​లో రూ.30 కోట్లు అంచనా వేసి రూ.6 కోట్లు ఖర్చు చేశారని బీఆర్​ఎస్​నేతలపై సీఎం రేవంత్​ మండిపడ్డారు. ‘‘అది ఒక్క వానకు పోయింది. మళ్లీ తిరిగి చూస్తే లేదు. దానిపై వాళ్లను లోపల వేయొచ్చు. కానీ లోపల వేస్తే ఆ తిండి కూడా దండగ అని చూసి చూడనట్లు ఉంటే అలుసు అయిపోయింది. సుందరీకరణ అనే పదం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు. మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనం” అని తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లో వరదలు వచ్చినప్పుడు అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం గ్రౌండ్ ఫ్లోర్ వాళ్లకు డబ్బులు ఇవ్వలేదని.. రెండో, మూడో , ఐదో అంతస్తులో  ఉన్న బీఆర్​ఎస్​ కార్యకర్తలకు ఇచ్చుకుందని..  దీనిపై ఏసీబీతో ఎంక్వైరీకి సిద్ధమా? అని ప్రశ్నించారు.

 ‘‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్​ ఈక్వాలిటీ వంటి కట్టడాలు కట్టిన కంపెనీలకు మూసీ రివర్​ ఫ్రంట్​ డెవలప్​మెంట్​ పనులు ఇస్తే. వీళ్లు(ప్రతిపక్షాలు) పాకిస్తాన్​కు ఏదో చేసిన్రని లింక్​ పెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు?’’ అని మండిపడ్డారు. మూసీ ప్రజల తిప్పలను పదేండ్ల పాలనలో ఎప్పుడైనా బీఆర్​ఎస్​ నేతలు తెలుసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ‘‘హరీశ్​రావు, కేటీఆర్​, ఈటల రాజేందర్.. ఈ ముగ్గురికి మూడు ఇండ్ల కిరాయి పైసలు నేను కడ్త. మూడు నెలలు వాళ్లు మూసీ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఖాళీ చేసి డబుల్​ బెడ్రూం ఇండ్లకు పోయినోళ్ల ఇండ్లు ఆడ్నే ఉన్నయ్​. 

ఆ ముగ్గురికి వాటిని ఇస్తం. మూడు నెలలు అక్కడి నుంచే వాళ్లు రాజకీయం చేయాలి. అక్కడే ఉండి ఎప్పుడు బుల్డోజర్​ వస్తదో కాపలా కాయాలి. ముగ్గురికి మూడు ఇండ్లు ఇస్తం. చిన్న చిన్న వసతులు కావాలాన్న ఏర్పాటు చేస్తం. మూసీ అద్భుతం ఏందో వాళ్లు దగ్గరుండి తెలుసుకోవాలి. మూడు నెలలు ఆ ముగ్గురు అక్కడ ఉండగలిగితే ప్రాజెక్టును పూర్తిగా మానేస్త. ఈ ప్రాజెక్టు టెండర్​ వాల్యూ నష్ట పరిహారం ఉంటే.. నా సొంత ఆస్తి అమ్మి అయినా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్​ క్యాన్సల్​ చేస్తా. దీనికి సిద్ధమా?” అని చాలెంజ్​ చేశారు. 

ఆరేండ్లకు మూసీ ప్రాజెక్ట్​ పూర్తి

మూసీ ప్రాజెక్టును లక్ష యాభై వేల కోట్లు అంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇదేమైనా వాళ్లు అనుకుంటున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టా? మీలెక్క లక్షా 50 వేల కోట్లలో లక్ష కోట్లు దిగమింగి 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు కాళేశ్వరం అనుకుంటున్నరా?” అని కేటీఆర్​, హరీశ్​రావును విమర్శించారు. ‘‘ ఇప్పటి వరకు మూసీ రివర్​ ప్రాజెక్టు రిపోర్ట్​ తయారీకి సంబంధించి ఐదు కంపెనీలు ఉన్నాయి. మైన్​హార్డ్​ , రియోస్​, కుష్మన్​ అండ్​ వక్​ ఫీల్డ్​ , జా, సోమ్​ కంపెనీలు కట్టిన ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి.

 ప్రపంచంలో ఉన్న అద్భుతాలను సృష్టించినోళ్లను ఒక కన్సార్సియంగా మార్చినం. హైదరాబాద్​ను ప్రపంచంతో పోటీ పడేలా అద్భుత నగరంగా తీర్చిదిద్దడంతో పాటు మూసీని పునర్జీవింప జేయడానికి అవసరమైన ప్రణాళికలతో పాటు ఆర్థిక వనరులను ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి ? మొదట ఏమి నిర్మించాలనుకుంటున్నారో డీపీఆర్​ తయారు చేస్తారు. మొదటి 18 నెలలు పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్​ రిపోర్ట్ ను తయారు చేస్తారు.దాదాపు ఆరేండ్లలో ప్రాజెక్టు పూర్తవుతుంది” అని తెలిపారు. మూసీ ప్రాజెక్టు కోసం ప్రపంచంలోని ఐదు గొప్ప సంస్థలను ఒక కన్సార్సియంగామార్చి ఒక టెండర్​ ఇచ్చామని, ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాల విలువ రూ.141 కోట్లు అని తెలిపారు. 

హైడ్రా ఏమన్నా ఫామ్​హౌస్​ దొరనా?

మూసీ నదీగర్భంలో నివసిస్తున్న పేదవాళ్ల దగ్గరికి అధికారులను పంపించి.. ఇంటింటి సర్వేచేయించామని, అక్కడివాళ్ల బాధలు తెలుసుకొని వారికి డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇచ్చామని సీఎం తెలిపారు. నేను మిమ్మల్ని(బీఆర్​ఎస్​ నేతలను) అడుగుతున్న. వేములఘాట్​లోనో,, మల్లన్న సాగర్​లోనో మునిగిపోయిన 14 గ్రామాలల్లో ఏ ఒక్కరికైనా తాళంచెవి ఇచ్చి ఆర్​ఆర్​ కింద కట్టిన ఇండ్లు ఇవి అని తీసుకో అని ఇచ్చారా? అందరికీ ఇండ్లు ఇస్తామని అప్పట్లో వేములవాడ రాజన్న దగ్గరకుపోయి ఒట్టేసి కూడా చెప్పిన్రు. కానీ ఏమైంది? మేం అట్లా చేయడం లేదు. 

మూసీ నదీగర్భంలోని వాళ్లనుదగ్గరుండి డబుల్​ బెడ్రూం ఇండ్లకు పంపిస్తున్నం. వాళ్ల సామాన్లు దర్వాజాలు, కిటికీలు వాళ్లకే పంపిస్తుంటే.. తప్పుడు ప్రచారం చేస్తున్నరు” అని మండిపడ్డారు. హైడ్రా ఏమైనా భూతమా, లేకపోతే ఫామ్​హస్​లో పడుకున్న దొరనా అని ప్రశ్నించారు. ‘‘10 అంతస్తులు, ఆకాశహర్మ్యాలు అడ్డగోలుగా కడితే వాటిని కూలగొట్టడానికి హైడ్రా, బుల్డోజర్లు అవసరం” అని తెలిపారు. మూసీ నదీగర్భంలోని వాళ్లు ఆనందంగా బతకొద్దన్నదే బీఆర్​ఎస్​ ఆలోచన అని మండిపడ్డారు. 

అసెంబ్లీ ప్రత్యేక సెషన్​ పెట్టి చర్చిద్దాం

మూసీ ప్రజలకు ఎలాంటి పరిహారం ఇద్దామో, ప్రాజెక్టు ఎలా ముందుకు తీసుకువెళ్దామో చర్చించేందుకు తాము సిద్ధమని సీఎం రేవంత్​ తెలిపారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిద్దామని, ప్రతిపక్షాలే తారీఖు డిసైడ్​ చేయాలని సూచించారు. ‘‘రెండు రోజులా.. నాలుగు రోజులా చర్చ చేద్దాం. సూచన చేయండి. ప్రభుత్వం ఒపెన్​ మైండ్​తో ఉంది. మూసీ ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతో ఉంది. మనషులను కాదు... మనస్సులను కూడా గెలవాలన్నదే మా ఆలోచన. ప్రత్యామ్నయంగా ఇండ్లు ఇద్దామా..  ఉద్యోగం ఇద్దామా.. ప్లాట్లు ఇద్దామా.. నష్ట పరిహారం ఇద్దామా.. 

ఏం ఇద్దామో చెప్పండి” అని అన్నారు. ‘‘పేదలకు మేలు జరగాలి. రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకునే విధంగా నగరాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్దామనే దానిపై చర్చ చేద్దాం. మీకు ఏం అనుమానాలు ఉన్నాయో తీసుకుని రండి. అన్నింటికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎంఐంఎం అధ్యక్షుడు, బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీల అధ్యక్షులు శనివారం లోగా యాక్షన్​ ప్లాన్​తో రావాలని కోరుతున్న. ఒక్క రోజు వృథా చేసినా తీరని నష్టం చేసినోళ్లం అవుతాం. ఈ శనివారం లోపల టైం టేబుల్​ ఫిక్స్​ చేసి యాక్షన్​ ప్లాన్​ ఇవ్వండి. ఆల్​ పార్టీ మీటింగ్ కు చాలాసార్లు పిలిచిన. అయినా అసెంబ్లీ ఆల్​ పార్టీ కంటే పెద్దదే కదా. అక్కడైనా చర్చిద్దాం” అని సీఎం రేవంత్​ అన్నారు. 

దేశ భద్రతను వ్యతిరేకించేవాడు కసబ్​తో సమానం

నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.‘‘పర్మిషన్​ ఇచ్చినోడు వాడే.. పైసలు తీసుకున్నోడు వాడే.. అన్ని ఇచ్చినోడు వాడే.. వాళ్లు దిగిపోయే నాటికి అన్ని పర్మిషన్లు అయిపోయాయి. దేశ భద్రతను కూడా రాజకీయాలకు ముడిపెట్టాలని చూస్తున్నరు. దేశ భద్రతను వ్యతిరేకిస్తే వాడు కసబ్ కంటే హీనుడు” అని మండిపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన రాడర్​ ప్రాజెక్టును ఎట్ల అడ్డుకుంటారని ప్రశ్నించారు. ‘‘దీని కోసం 12 లక్షల చెట్లు పోతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వందలు, వేలల్లోనే చెట్లు పోతున్నాయి. ఆ చెట్లకు ఐదింతలు మొక్కలు నాటుతారు” అని తెలిపారు.  

దుబాయ్​కు వెళ్లి సుందరీకరణ కోసం నెత్తిమీద జుట్టు నాట్లు వేయించుకొచ్చుకున్న విధానం మాది కాదు. మా లక్ష్యం మూసీ నదిని పునరుజ్జీవింప జేయడం. మూసీ మురికిలో కాలం వెళ్లదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి. వాళ్లకు ఒక మంచి జీవన విధానం ఇవ్వాలి.. ఉపాధి కల్పించాలి.. ప్రత్యామ్నాయ ఇండ్లను కేటాయించాలి. వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలి. అదే మా తపన.

సీఎం రేవంత్​రెడ్డి