కావాలని కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

కావాలని  కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో పథకాల అమలపై నిర్వహించిన సమీక్షలో విద్యుత్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.  పలు చోట్ల విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  ప్రభుత్వం ఎక్కడా విద్యుత్‌ కోతలు విధించట్లేదని,  ఆకారణంగా ఎవరైనా కరెంట్ కట్ చేస్తే సస్పెండ్  చేస్తామని హెచ్చరించారు.  ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కుట్రలు చేస్తే  సహించబోమని చెప్పారు.  

ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి మరో రెండు గ్యారెంటీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీతో  భేటీ అయ్యారు.   ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

అలాగే అర్హులందరికీ రూ. 500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం అధికారులకు సూచించారు.  ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా.. ఏజెన్సీలకు చెల్లించాలా..? అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.