హైదరాబాద్: తెలంగాణలో ఇచ్చిన అన్ని హామీలు నేరవేరుస్తున్నామని.. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విభజన రాజకీయాలతో ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (నవంబర్ 9) సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంల మీటింగ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ నేరవేరుస్తామని స్పష్టం చేశారు. రైతులకు హామీ ఇచ్చిన మేరకు 22 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. రైతులపై ప్రధాని మోడీ వేసిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాక ఆయన పోస్ట్ డిలీట్ చేశారని అన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. రైతులకు సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం.. సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో కులగణన చేపట్టామని పేర్కొన్నారు. హామీల వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధమని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశంలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయని మహాయతి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర అంటే శివాజీ మహారాజ్ గుర్తకు వస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమిని గెలిపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.