దమ్ముంటే నిధులు తే లేకుంటే గుజరాత్​ పో!

  • కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై సీఎం రేవంత్​రెడ్డి ఫైర్​
  • సబర్మతికి సప్పట్లు కొట్టి.. మూసీకి అడ్డు పడతవా? 
  • మోదీ గుజరాత్​కు నిధులు తీస్కపోతుంటే గుడ్లప్పగించి చూస్తున్నవ్​
  • మిమ్మల్ని ఇక్కడి ప్రజలు గెలిపించిన్రు కదా.. బాధ్యత లేదా? 
  • చిత్తశుద్ది ఉంటే రూ.25 వేల కోట్లు తీసుకువచ్చి చూపించు 
  • లష్కర్​ ఎంపీగా  ఏం ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోదీ అహ్మదాబాద్​లో సబర్మతి రివర్ డెవలప్​మెంట్ ఫ్రంట్​పనులు చేస్తుంటే ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చప్పట్లు కొడుతున్నారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. 25 ఏండ్ల నుంచి కిషన్​రెడ్డిని హైదరాబాద్​ప్రజలు భుజాల మీద మోస్తున్నారని, ఆయన మాత్రం మూసీ రివర్​ఫ్రంట్​వద్దు అంటున్నాడని ఫైర్​ అయ్యారు. మూసీ అభివృద్ధి అయితే మోదీ కంటే తెలంగాణకు మంచిపేరు వస్తదనే.. కాళ్లల్లో కట్టె పెట్టి కట్టనియ్యం అని, మూసీలో పండుకుంటం అని అంటున్నాడని మండిపడ్డారు. కిషన్​రెడ్డి మూసీలో పండుకున్నా.. మూసీలో మునిగి ఆత్మహత్య చేసుకున్నా.. 

ఇక్కడి ప్రజలు వారిని పట్టించుకోరని అన్నారు. కిషన్​రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే మోదీ దగ్గరకు వెళ్లి కేంద్రం నుంచి మూసీ రివర్​డెవలప్​మెంట్​ కోసం రూ.25వేల కోట్లు తీసుకురావాలని డిమాండ్​ చేశారు. మూసీలో పేదల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న కిషన్​రెడ్డి రూ.10 వేల కోట్లు తీసుకురావాలని, మూసీ ఒడ్డున ఉన్నోళ్లకు, మూసీ మురికిలో ఇబ్బంది పడుతున్నోళ్లకు పీఎం ఆవాస్​యోజన స్కీమ్​ కింద ఎంత భూమి అయినా కేటాయిస్తామని, వారికి అపార్ట్​మెంట్లు, స్కూళ్లు, కాలేజీలు కట్టించి ఇద్దామని చెప్పారు. సికింద్రాబాద్​నుంచి2 సార్లు కేంద్రమంతి అయిన కిషన్​రెడ్డికి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. 

మోదీ దగ్గర ప్రతి ఏటా రూ.40 వేల కోట్ల బడ్జెట్ఉంటదని, మోదీ గుజరాత్​ బుల్లెట్​ ట్రైన్​తీసుకుపోతరని, సబర్మతి రివర్​ఫ్రంట్​ప్రాజెక్టు అమలు చేస్తరని, గుజరాత్​కు గిఫ్ట్​సిటీ కట్టుకుంటడని, మరి కిషన్​రెడ్డి సికింద్రాబాద్​కు ఏం గిఫ్ట్​​తీసుకువచ్చాడో..తీసుకువస్తాడో చెప్పాలని డిమాండ్​ చేశారు. ‘కిషన్​రెడ్డిని అడుగుతున్నా.. ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చావా ? గతంలో అంటే వాళ్లు చేసిన ఎదవ పనులకు ఇయ్యాల ఫాంహౌజ్​లో పండుకున్నరు. వాళ్ల గురించి చర్చించడం కూడా దండగ మారి యవ్వారం. 

వాళ్ల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కిషన్​రెడ్డి సమాధానం చెప్పాలి’ అని అన్నారు. కొత్తగా మెట్రో రైలు కోసం116 కిలోమీటర్లకు ప్రతిపాదన పంపామని,  దాదాపు రూ.35 వేల కోట్లు అవసరమున్నదని, ఇప్పుడు మోదీ నుంచి మెట్రోకు ఎన్ని నిధులు తీసుకొస్తారో చెప్పాలని కిషన్​రెడ్డికి సవాల్​ చేశారు.  మోదీ ‘గుజరాత్​కు, బెంగళూరుకు, చెన్నైకి మెట్రోఇస్తడని, ఇక్కడ బీజేపీకి ఓట్లు వేయలేదా ? మీరు గెలవలేదా.. కేంద్రమంత్రి కాలేదా ? ఎన్ని నిధులు తెస్తవో జవాబు చెప్పు’ అని  ప్రశ్నించారు.  

లక్షన్నర కోట్లు ఇప్పిస్తే సన్మానం చేస్త...

బీఆర్ఎస్, బీజేపీ మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటున్నాయో చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్​ చేశారు. ‘‘మూసీ కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ మరో ఢిల్లీలాగా మారాలా?’ అనే ప్రశ్నలు సమాధా నం చెప్పాలని అన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఎస్టీపీలు, ట్రిపుల్​ఆర్, రేడియల్ రోడ్లు, ఫ్లైఓవర్లు కట్టుకోవాలని, గోదావరి, కృష్టా జలాలను తాగడానికి తరలించుకోవాలని,  మెట్రో రైలు విస్తరించుకోవాలని, ఇవన్నీ చేయాలంటే ఈ రోజు ఉన్న అంచనాలకే రూ. లక్షన్నర కోట్లు కావాలని తెలిపారు. రాబోయే నాలుగేండ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ ​అద్భుతమైన నగరంగా మారుతుందన్నారు. 

దీనికి కేంద్రం సహకరించాలని కోరారు. బీఆర్ఎస్​ వాళ్లు చేయలేనిది తాము చేస్తున్నామని, తమకు పేరు వస్తే వాళ్ల ఉనికి మాయమైతదని  బాధపడుతున్నారని తెలిపారు. పదేండ్ల అనుభంతో కేసీఆర్​, మున్సిపల్, ఇండస్ట్రీస్​ మంత్రి అనుభవంతో కేటీఆర్ ​ఇట్లా తండ్రి కొడుకులిద్దరూ హైదరాబాద్ ​అభివృద్ధికి పాలసీ డాక్యుమెంట్​ ఇవ్వాలన్నారు. 11 ఏండ్ల నుంచి 3 సార్లు పీఎంగా మోదీ ఉన్నారని, హైదరాబాద్​లో వరదలు వచ్చి మునిగిపోతే ఒక్క పైసా ఇయ్యలేదన్నారు. ఆ టైంలో బండి సంజయ్..​ కారు పోతే కారు, ఆటో పోతే ఆటో, బండికి బండి అన్నడని, తర్వాత ఇన్సూరెన్స్​ ఉంటది కదా కదా మీరే తెచ్చుకోర్రి అన్నడని, ఇది వాళ్ల నీతి అని పేర్కొన్నారు. 

‘కిషన్​రెడ్డిని అడుగుతున్నా.. మీరు నిధులు తెస్తరా? లేదా గుజరాత్​కు  వలసపోయి అక్కడే బతుకుతరా? సికింద్రాబాద్ ఎంపీవి కదా ఏం ప్రణాళిక ఉందో చెప్పు? యాక్షన్​ప్లాన్​ఏందో చెప్పు? ట్రాఫిక్​సమస్యకు మెట్రోవిస్తరణపై నీ విధానం ఏంటి ? ఫ్లైఓవర్లు కట్టాలి.. మా  ప్రణాళికలు నచ్చలేదు అడ్డుకుంటా అంటున్నావు కదా..ఆరు నెలలు ఊరుకుంటా ఏం చేస్తవో.. తెస్తవో చెప్పు. మోదీని తీసుకువచ్చి లక్షన్నర కోట్లు ఇప్పియ్యు. పది లక్షల మందితో పరేడ్​గ్రౌండ్​లో తెలంగాణ సమాజాన్ని అంతా పిలిచి నీకు, మోదీకి సన్మానం చేస్త. ఆ జిమ్మెదారి నేను తీసుకుంటా’ అని సీఎం అన్నారు.