
హైదరాబాద్: ప్రతిపక్ష బీఆర్ఎస్ శాంతి భద్రతలపై కూడా విమర్శలు చేస్తోందని.. లా అండ్ ఆర్డర్ పై దుష్ప్రచారం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అందరికీ తెలిసిందేనని.. దిశ అత్యాచార ఘటన, న్యాయవాద దంపతుల హత్య ఘటనలు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదహరణలు అని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం (మార్చి 26) శాంతి భద్రతలపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వామన్ రావు న్యాయవాద దంపతులను నడిరోడ్డుపై నరికి చంపితే ఇప్పటికీ శిక్షలు పడలేదు.. సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచార ఉదంతంలో ఆనాడు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ALSO READ | ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ : సీఎం రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ పబ్ కేసులో బీఆర్ఎస్ నాయకుడి కుమారుడే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఇందులో ఒక మంత్రి కుమారుడి ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి.. అయినా చర్యలు తీసుకోని బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు శాంతి భద్రతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడుల్లో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉందని అన్నారు.
ఎమ్ఎమ్టీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై మేం వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని.. నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కుప్పకూలిపోయిందని బీఆర్ఎస్ నేతలు దుష్ర్పాచారం చేస్తున్నారు.. రాష్ట్రం దివాళా తీస్తే బీఆర్ఎస్ నేతలు సంతోష పడతారా అని ప్రశ్నించారు. అధికారకాంక్షతో ఎలాంటి దుష్ర్పచారామైనా చేస్తారా అని నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా రాజీపడ్డామా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
కడుపునిండా విషం పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారని.. ప్రభుత్వం, అభివృద్ధిపై కూడా యాసిడ్ దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి.. కానీ లా అండ్ ఆర్డర్‌పై విమర్శలు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి..? ప్రతిపక్షాలకు ఆ సామాజిక బాధ్యత లేదా అని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరించింది.. అలా ఇప్పుడు మీరు ఎందుకు ప్రభుత్వానికి సహకరించడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా కుట్రలు మానుకోని.. విజ్ఞతతో మాట్లాడాలని సూచించారు.