- అందుకే ఎల్ అండ్ టీ సీఎఫ్‌వోను లోపలేయమన్న: సీఎం రేవంత్ రెడ్డి
- రాజకీయ పార్టీతో కుమ్మక్కై సర్కారును బద్నాం చేసిండని ఫైర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజకీయ పార్టీలతో కుమ్మక్కయి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసిన మెట్రో చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) ఆర్.శంకర్ రామన్‌ను లోపలెయ్యమని ఆదేశించానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే, ఆ అధికారి అంతలోనే ముంబై పారిపోయాడని అన్నారు. బిజినెస్ ప్లాన్‌లో భాగంగా హైదరాబాద్ మెట్రో వాటాలను అమ్మేయనున్నట్టు గత మే నెలలో ఒక బిజినెస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్అండ్ టీ సీఎఫ్‌వో శంకర్ రామన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఫ్రీ బస్ జర్నీ వల్ల మెట్రోకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.
ఆయన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కాగా, శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్ తక్- – 2024 కాంక్లేవ్‌లో పాల్గొన్న సీఎం.. ఉచిత బస్సు సౌకర్యంపై అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం చెప్పారు. హైదరాబాద్‌లో మెట్రో లైన్ ఉన్నది కేవలం 69 కిలోమీటర్లేనని, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం వల్ల మెట్రో నష్టాలపాలవుతుందని ఆ అధికారి ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఆ అధికారిది కాంగ్రెస్‌ను బద్నాం చేసే పొలిటికల్ మోటివేటెడ్ స్టేట్మెంట్ అన్నారు.
‘‘వాస్తవానికి మెట్రోలో రోజు రోజుకు రద్దీ పెరుగుతోంది. రోజూ సగటున 5 లక్షల మందికిపైనే మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మార్నింగ్, ఈవెనింగ్ సమయాల్లో ప్రయాణికులు నిల్చొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న మెట్రో కోచ్‌ల సంఖ్య పెంచాలనే డిమాండ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో.. మహాలక్ష్మి ఫ్రీ బస్ జర్నీ వల్ల మెట్రోకు నష్టం వాటిల్లుతుందని మాట్లాడటం అర్థం లేనిది’’అని సీఎం పేర్కొన్నారు. అయితే, సీఎఫ్‌వో తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చారని ఎల్అండ్టీ యాజమాన్యం ఒప్పుకుందని సీఎం చెప్పారు.