మొఖం చెల్లకనే బయటకొస్తలే : సీఎం రేవంత్​ రెడ్డి

మొఖం చెల్లకనే బయటకొస్తలే : సీఎం రేవంత్​ రెడ్డి
  • ఉద్యమ ముసుగు తొలగడంతో ఇంటికే పరిమితమైండు
  • బీఆర్ఎస్​కు ​పార్టీ ఫండ్స్​ రూ. 1500 కోట్లు ఎట్లొచ్చినయ్​​?
  • 2014కు ముందు ఖాతాలో ఉన్నదెంత? ఇప్పుడున్నదెంత?
  • మూసీ ప్రక్షాళన ఆగదు
  • 9న 11వేల మందికి టీచర్ ​జాయినింగ్ ​లెటర్లు ఇస్తం
  • హైదరాబాద్​ శిల్పాకళా వేదికలో ‘కొలువుల పండుగ’.. 1,635 మందికి  నియామక పత్రాలు

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​ఉద్యమ ముసుగు తొలిగిందని, అందుకే మొఖం చెల్లక బయటకు వస్తలేరని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  తెలంగాణ ఉద్యమ గొప్పతనం వల్లే ఆయనకు పదేండ్లు మర్యాద ఇచ్చామని అన్నారు. నిరుద్యోగుల పోరాటాలు, విద్యార్థుల ఆత్మబలిదానాలతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. హైదరాబాద్‌‌ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్​పాల్గొని, వివిధ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి నియామక పత్రాలు అందజేశారు. వివిధశాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 ఇంజినీర్ల కృషి.. గొప్పతనం ఈ సమాజానికి చాలా అవసరమని చెప్పారు. ‘‘రాష్ట్రంలో 360 కిలోమీటర్ల రీజినల్​రింగ్​ రోడ్డు, రేడియల్​రోడ్స్​ మీ చేతుల మీదుగా నిర్మాణం కాబోతున్నాయి. ఎయిర్​పోర్ట్​కు సమీపాన ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ నిర్మాణంలోనూ మీ భాగస్వామ్యం ఉంటుంది. 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్​మెంట్​ ప్రాజెక్టను పూర్తిచేసి, దేశానికే ఆదర్శంగా నిలబెడతాం” అని పేర్కొన్నారు. “ఇది ఉద్యోగం కాదు భావోద్వేగం. లక్షలాది మందికి రాని సీఎం అవకాశం నాకు వచ్చింది.  లక్షలాది మంది ఇంజినీర్లు పోటీ పడితే మీకు ఉద్యోగం వచ్చింది. మీ బాధ్యతను మీరు మరువద్దు’ అని సీఎం సూచించారు.  

నిరుద్యోగులను గత సర్కారు మోసం చేసింది

తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులను గత బీఆర్ఎస్​ సర్కారు మోసం చేసిందని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. కొన్నేండ్ల నుంచి నియామకాలు జరగక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశచెందారని అన్నారు. అధికారంలోకి రాగానే తమ కేబినెట్​ఆలోచన చేసి, ఏండ్లకొద్దీ వాయిదాపడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలకు పరిష్కారం చూపిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి, వారి తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూసేవిధంగా చేశామని తెలిపారు. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు ఎల్​బీ స్టేడియంలో 11,063 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించబోతున్నామని చెప్పారు.

‘‘మార్పు రావాలి.. కాంగ్రెస్​గెలవాలి అనే ఆలోచనతో నేను చేపట్టిన విద్యార్థి నిరుద్యోగ జంగ్​సైరన్​కు మీరంతా మద్దతిచ్చారు. కేసీఆర్​, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పిన. నేను చెప్పినట్టే కేసీఆర్ ఉద్యోగం పోయింది.. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నయ్” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో వందేండ్ల అనుభవం ఒకవైపు ఉంటే.. పదేండ్ల దుర్మార్గం ఒకవైపు ఉన్నదని అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజినీర్లు కట్టిన ప్రాజెక్టులు, కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటే.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఆయన ముందే  కూలిందని చెప్పారు.

మల్లన్నసాగర్​లో 50 టీఎంసీల నీళ్లు నింపితే అది కొట్టుకొనిపోతదని నిపుణులు చెబుతున్నారన్నారు.  చార్మినార్ నుంచి ఉస్మానియా, నాగార్జున సాగర్, చార్మినార్, ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ ఇంజినీర్లను, శ్రీశైలం ,నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్  ఇంజినీర్లను ఆదర్శంగా తీసుకుంటరా?.. లేక కాళేశ్వరం కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటరా ? అని రేవంత్​ ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని విశ్వాసంతో నిలబెట్టుకుందాం అని అన్నారు.

మూసీ ప్రక్షాళన ఆపే ప్రస్తక్తే లేదు..

మురికి కూపమైన మూసీని  ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. ఎవరు అడ్డొచ్చినా 55 కిలోమీటర్ల మూసీ రివర్​ఫ్రంట్​డెవలప్​మెంట్​ ఆగదని అన్నారు. లండన్​లోని థేమ్స్​, అమెరికాలోని హడ్సన్​, గుజరాత్​లోని సబర్మతిలాగా హైదరాబాద్​లో నేచురల్​గా ఉన్న మూసీ బాగుపడొద్దా? అని ప్రశ్నించారు. “గత పదేండ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఇంకో 10 వేల కోట్లు మూసీ బాగుకు ఖర్చుకు పెడ్తం. మూసీ నిర్వాసితులను ఆదుకోవడానికి మీరు మింగింది ఆపితే చాలు. బీఆర్​ఎస్​పార్టీ ఖాతాలోకి రూ.1500 కోట్లు ఎట్లొచ్చినయ్​.

2014కు ముందు ఆ పార్టీ ఖాతాలో ఉన్నదెంత? ఇప్పుడున్నది ఎంత?​” అని ప్రశ్నించారు.  మురికికూపంగా ఉండడంతోనే  ఏ తండ్రి తన బిడ్డకు మూసీ అని పేరు పెట్టుకోవడం లేదని అన్నారు. ప్రజలు నిరాశ్రయులుగా మారుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్​, కొండపోచమ్మలాంటి రిజర్వాయర్ల వల్ల ఎవరి భూములు పోలేదా? అని నిలదీశారు. మల్లన్నసాగర్ పేరుతో రైతులను బలవంతంగా ఖాళీ చేయించారని అన్నారు. కానీ.. మూసీ నిర్వాసితులకు తాము మంచి స్థలంలో ఆశ్రయం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మూసీ ప్రక్షాళనపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా హరీశ్​రావు, కేటీఆర్ స్క్రిప్ట్​నే చదువుతున్నారని అన్నారు. ఆయన అంగీ మారింది కానీ.. వాసన మారలేదని ఎద్దేవా చేశారు.

ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తనతో కలిసి వచ్చి మూసీ ప్రక్షాళనకు ప్రధాని మోదీని రూ. 25వేల కోట్ల నిధులు అడగాలని సవాల్​ చేశారు.  హరీశ్​రావు, కేటీఆర్​, ఈటల వస్తే దొరకబట్టి ఓ వారంపాటు అక్కడే ఉంచాలని, అప్పుడే ఆ మురికి కంపు బాధ వారికి తెలుస్తుందని మూసీ పరీవాహక ప్రజలకు సూచించారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోతే కుదరదని చెప్పాలన్నారు. మూసీ పరివాహక ప్రజలు దశాబ్దాలుగా మురికిలోనే ఉండాలా? నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు ఇవ్వండని  కోరారు.