- తేడాగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తది
- రాష్ట్ర ప్రభుత్వమంటే 119 ఎమ్మెల్యేలు
- ప్రతిపక్ష నేత గా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారు
- ఆ సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిదా..?
- ప్రజల తీర్పును ఆయన గౌరవించాలె
- తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ ను పిలుస్తం
- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండిని కూడా రమ్మంటం
- బీఆర్ఎస్ నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: కేసీఆర్ రాజకీయ సంప్రదాయాలను దెబ్బతీశారని, రాహు కేతుల్లాంటి ఇద్దరు రాక్షసులను ప్రభుత్వం మీదకు ఉసిగొల్పుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండి పడ్డారు. వాళ్ల ఉద్దేశం ఏమిటి..? ప్రభుత్వం నడవద్దా..? అని ప్రశ్నించారు. ఇవాళ సెక్రటేరియట్ లో ఇందిరమ్మ ఇండ్ల యాప్ ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీశ్, కేటీఆర్ లతి చిన్నపిల్లల్లాంటి మనస్తత్వమని, తమకు దక్కనిది, పక్కోడి దగ్గరిది విరగ్గొట్టే విధానమని అన్నారు. వాళ్లు ఎటమటంగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ కి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వమంటే అధికార పక్షంలోని 65 మంది ఎమ్మెల్యేలే కాదని మొత్తం 119 మంది అని సీఎం అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండాలని తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారని, దానిని ఆయన ఎందుకు గౌరవించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఫాంహౌస్ నిర్మాణం మీద పెట్టిన దృష్టిని పేదలకు ఇండ్లు నిర్మించడంపై పెట్టలేదని విమర్శించారు.
కొడుకు, కోడలు వస్తే ఎట్ల అని చెప్పి డబుల్ బెడ్రూం ఆశలు పెట్టిన కేసీఆర్.. వాటిని పూర్తి చేయడంపై పెట్టలేదని అన్నారు. వేల ఎకరాల భూమిని వేలం పాటల ద్వారా అమ్మేసిన కేసీఆర్ పేదల ఇండ్ల విషయాన్ని పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని అన్నారు. ఆయన చేసిన అప్పులకు ప్రతి నెలా 6,500 కోట్ల మిత్తి కడుతున్నామని ఆయన వివరించారు.
కేసీఆర్ ను పిలుస్తం
అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రొటోకాల్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానిస్తారని చెప్పారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని పిలుస్తామని అన్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్ ప్రాంతంలో పండుగ వాతావరణం ఉంటుందని, ప్రభుత్వ విజయోత్సవాలను ఘనంగా నిర్వహస్తామని సీఎం వివరించారు.