అంగీలాగు ఊడదీసి చిప్పకూడు తినిపిస్త: సీఎం రేవంత్​రెడ్డి

అంగీలాగు ఊడదీసి చిప్పకూడు తినిపిస్త: సీఎం రేవంత్​రెడ్డి
  • ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం.. 
  • కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరిక
  • ఎంటిక కూడా పీకలేరంటవా.. మేం తలచుకుంటే నీ డ్రాయర్​ కూడా మిగలదు బిడ్డా!
  • చర్లపల్లి జైల్లో నీ కుటుంబానికి డబుల్​ బెడ్రూం ఇల్లు కట్టిస్త
  • అడవి పందుల్లా పదేండ్లు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన్రు
  • నమో అంటే.. నమ్మితే మోసం.. బీఆర్​ఎస్​ను తొక్కినట్లే బీజేపీని తొక్కి బొందపెట్టాలి
  • ఈవీఎం, ఈడీ, ఐటీ, సీబీఐలే మోదీ పరివార్​ అని విమర్శ
  • తుక్కుగూడ సభలో ప్రసంగం

హైదరాబాద్​, వెలుగు: ఏది పడితే అది మాట్లాడితే  అంగీలాగు ఊడదీసి చర్లపల్లి జైల్లో చిప్ప కూడు తినిపిస్తానని, అక్కడే డబుల్​ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ‘‘మా ఎంటిక కూడా పీకలేరంటవా? మా కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు పీకడం మొదలు పెడితే నీ ఒంటి మీద డ్రాయర్​ కూడా ఉండదు బిడ్డ!  ఏమనుకుంటున్నవో జాగ్రత్త” అని వార్నింగ్​ ఇచ్చారు. ‘‘ఆ మధ్యల అన్ని కుక్కలు మొరిగినయ్​.. నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది.. సూర్యాపేటకు పోయింది.. కరీంనగర్​కు పోయింది. నన్నేం పీకుతరు మీరు అని ఆయన అంటున్నడు. నా ఎంటిక కూడా పీకలేరంటున్నడు. ఇదా ఆయన భాష. మళ్లా భాష గురించే ఆయన ఏవేవో చెప్తుంటడు. పదేండ్లు ఈ రాష్ట్రాన్ని పట్టి, పీడించి, వేధించి, దోచుకొని, దోపిడీ దొంగల్లెక్క, అడవి పందుల్లాగా సర్వనాశనం చేసిండు. పది సంవత్సరాలల్ల వంద సంవత్సరాల విధ్వంసం చేసిండు” అని రేవంత్​ మండిపడ్డారు. ‘‘కేసీఆర్​.. నువ్వు పేదోళ్లకు డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టియ్యలె. కానీ, నేను మాత్రం నీకు చర్లపల్లి జైల్లో తప్పకుండా డబుల్​ బెడ్రూం ఇల్లు కట్టిస్త. ఎందుకంటే కొడుకు కోడలొస్తే ఏడుండాలె.. బిడ్డ, అల్లుడు వస్తే ఏడుండాలె అంటవు కదా! మీరందరూ కలిసి చర్లపల్లి జైల్లో ఉండెటట్లు డబుల్​ బెడ్రూం ఇల్లు కట్టిస్త” అని చెప్పారు. 

నమో అంటే నమ్మితే మోసం అని ప్రధాని నరేంద్రమోదీపై ఫైర్​ అయ్యారు. మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య చిచ్చు పెట్టి.. ఇప్పటివరకు మోదీ అధికారం నిలబెట్టుకున్నారని, ఇప్పుడు దేశాన్నే విభజించి, చిచ్చుపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని తుక్కుతుక్కుగా ఓడిస్తామన్నారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో కాంగ్రెస్​ను గెలిపించి, కేంద్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ప్రజలను ఆయన కోరారు. శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్​ జనజాతర సభలో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. అంతకుముందు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ, సీఎం, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, మంత్రులు కాంగ్రెస్​ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్​ చేశారు. సీఎం రేవంత్​ మాట్లాడుతూ.. ‘‘ఆనాడు తుక్కుగూడ సభ నుంచే బీఆర్​ఎస్​ను తుక్కుతుక్కుగా ఎట్ల తొక్కామో, మళ్లీ ఇప్పుడు తుక్కుగూడ వేదిక నుంచే బీజేపీని తుక్కుతుక్కుగా తొక్కి బొందపెట్టాలి” అని అన్నారు. దేశ రాజకీయాల్లోనూ కాంగ్రెస్​ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలంతా సైనికుల్లాగా కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మందిని జైల్లో పెట్టినా కాంగ్రెస్​ మువ్వన్నెల జెండాను వదలలేదని, కార్యకర్తల త్యాగంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. 

మోదీ.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలేవి?

గుజరాత్​ మోడల్​ కాదు.. వైబ్రెంట్​ తెలంగాణ ఆధిపత్యాన్ని చూపిద్దామని ప్రజలకు సీఎం రేవంత్​ సూచించారు. అభివృద్ధి వైపు దేశాన్ని నడిపించేందుకు తెలంగాణ నుంచే ముందుకుసాగుదామన్నారు. ‘‘పదేండ్లు మీ పార్టీ(బీజేపీ), మీ నాయకుడే(మోదీ) ఈ దేశంలో ప్రధానిగా ఉన్నరు.. నిరుద్యోగ యువకులు ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నరు. పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలే.. ఏమిచ్చిన్రు? ఏడు లక్షల 21వేల ఉద్యోగాలే ఇచ్చినట్లు చెప్పిన్రు.. ఇందుకా మీకు ఓటు వెయ్యాలి? దీనికి సిగ్గులేని కిషన్​ రెడ్డి సమాధానం చెప్పాలి. మిగతా ఉద్యోగాలు ఎటుపోయినయ్​? రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మోదీ మాటిచ్చి మోసం చేసిండు. వ్యవసాయ నల్ల చట్టాల రద్దు కోరుతూ 16 నెలల పాటు రైతులు ఢిల్లీ బార్డర్​లో ఆందోళన చేశారు. 750 మంది రైతులు అమరులైతే.. కనీసం ప్రధాని మోదీ పరామర్శించలేదు. వారి కుటుంబాలను ఆదుకోలేదు. 

రైతులను చంపినందుకు మీకు(బీజేపీకి) ఓటు వెయ్యాల్నా? దీనికి కిషన్​రెడ్డి సమాధానం చెప్పాలి” అని ఆయన డిమాండ్​ చేశారు. 2022 వరకు పేదలందరికీ ఇండ్లు ఇస్తామని మోదీ చెప్పారని, తెలంగాణకు ఎన్ని ఇండ్లు ఇచ్చారో కిషన్​రెడ్డి సమాధానం ఇవ్వాలని ఆయన నిలదీశారు. ‘‘హైదరాబాద్​లో వరదలు వచ్చినప్పుడు మోదీ నుంచి కిషన్​రెడ్డి ఒక్క రూపాయి అయినా తెచ్చిండా? సిగ్గులేని కిషన్​రెడ్డి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నవ్​? నమో అంటే నమ్మితే మోసం. పదేండ్లు ప్రధానిగా ఉండి.. ఇప్పుడు మళ్లీ ఓటెయ్యుమంటున్నడు. బీజేపీకి ఓటేస్తే ఆయనేమైనా చంద్రమండలానికి రాజైతడా? పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే.. ఐటీఐఆర్​ కారిడార్​ ఇవ్వలే.. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే.. రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ ఇవ్వలే.. పదేండ్ల తర్వాత నిన్న మొన్న గిరిజన వర్సిటీని ఇచ్చిండు. విభజన చట్టంలో కాంగ్రెస్​ ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయలే. ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్​కు తాకట్టు పెట్టిండు. బీఆర్​ఎస్​ను ఎట్ల బొంద పెట్టినమో..  అట్లనే బీజేపీని బొందపెట్టాలి” అని సీఎం రేవంత్ రెడ్డి​ అన్నారు.  

పెద్దలు జానారెడ్డి లెక్క కాదు నేను..

పదేండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్​ పట్టి పీడించారని సీఎం రేవంత్ ​రెడ్డి మండిపడ్డారు. ‘‘కాలు విరిగిందని, కట్టెపట్టుకొని నడుస్తున్నవని, బిడ్డ జైలుకు పోయిందని,  అధికారం కోల్పోయిందన్న బాధలో ఉన్నావని ఇన్నాళ్లూ సంయమనం పాటించినం. ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటమని అనుకుంటున్నవా? చూస్తూ ఊరుకునెటోళ్లు ఎవరూ లేరు. బిడ్డా..! పెద్దలు జానారెడ్డి లెక్క కాదు.. నేను రేవంత్​రెడ్డిని. మా ఎంటిక కూడా పీకలేరంటవా? మా పార్టీ కార్యకర్తలనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్​ కూడా ఉండదు బిడ్డ! నీ లత్కోరు లఫంగి మాటలకు అంగిలాగు ఊడదీసి చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్త’’ అని కేసీఆర్​కు వార్నింగ్​ ఇచ్చారు.

మోదీ పరివార్​ ఒక వైపు.. గాంధీ పరివార్​ ఒకవైపు

భారత్​ జోడో యాత్రతో రాహుల్​ గాంధీ దేశమంతా పాదయాత్ర చేశారని, ప్రజల కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమై ఆయన పాదయాత్ర సాగించారని, తెలంగాణలో కూడా యాత్ర చేపట్టారని సీఎం రేవంత్​ తెలిపారు. ‘‘జనం కోసం కష్టపడే రాహుల్​ ప్రధాని కావాల్నా.. విమానాల్లో తిరుగుతూ విదేశాల్లో పర్యటిస్తూ గంటగంటకూ డ్రెస్సులు మార్చుకుంట..అబద్ధాలతో జనాన్ని వంచించే మోదీ ప్రధాని కావాల్నా ఆలోచించండి” అని అన్నారు. ‘‘మోదీ పరివార్​ ఒక వైపు, గాంధీ పరివార్ మరోవైపు ఉంది. మోదీ పరివార్​లో ఈవీఎంలు, ఈడీ, ఇన్​కమ్​ ట్యాక్స్​, సీబీఐ ఉన్నాయి.. మా వైపు(గాంధీ పరివార్​లో) అమరులైన ఇందిరమ్మ, రాజీవ్​ గాంధీ.. పదవీ త్యాగం చేసిన సోనియా గాంధీ, దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమైన రాహుల్​ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్​ కార్యకర్తలు, సామాన్య జనం ఉన్నారు.. ఈ  ఎన్నికల లడాయిలో మోదీ పరివార్​ను ఓడిద్దాం.. దేశాన్ని కాపాడుకుందాం” అని చెప్పారు.

 ‘‘ఈ యుద్ధంలో మోదీకి టక్కర్​ చెయ్యాల్సిందే. ఈవీఎం, ఈడీ, ఇన్​కమ్​ ట్యాక్స్, సీబీఐని ఓడించాల్సిందే. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నడు. ఈ యుద్ధంలో ప్రాణాలు పోయినా ఫర్వాలేదు గానీ.. దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలంటే బీజేపీని ఓడించాల్సిందే. ఇదే తుక్కుగూడ వేదిక ద్వారా సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించారు.. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే వేదిక నుంచి రాహుల్​ గాంధీ జాతీయ మేనిఫెస్టోను ప్రకటించారు. జూన్​ 4న ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి జూన్​ 9న ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేద్దాం’’ అని ఆయన తెలిపారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలోనే సోనియాగాంధీ 6 గ్యారంటీలను ప్రకటించగా.. ఇప్పుడు అదే వేదికపైనే రాహుల్ గాంధీ పాంచ్​ న్యాయ్​ పత్రాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్​ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​, దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణా రావు, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రసంగం అనంతరం లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో కలిసి రాహుల్​ గాంధీ ఫొటో దిగారు.

రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు ఇవ్వండి

పదేండ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్​ సర్వనాశనం చేయగా.. తాము అన్నీ సరిదిద్దుతున్నామని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. డిసెంబర్​ 7న అధికారంలోకి వచ్చిన రెండురోజులకే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల రాజీవ్​ ఆరోగ్యశ్రీ గ్యారంటీని అమలు చేశామని,  ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారరు. రూ. 500కే సిలిండర్​, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్​ స్కీమ్​ను మొదలుపెట్టామని వివరించారు. ‘‘ఆనాడు కాంగ్రెస్​ పాలనలో తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు 25 లక్షలు కట్టించినం. పదేండ్లలో సన్నాసి, సోయిలేని గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కట్టించిన డబుల్​ బెడ్రూం ఇండ్లు ఎన్ని? మేం ఇప్పుడు రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పనులను ప్రారంభించినం. 

ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్​ ప్రభుత్వానిదే. ఇవాళ సవాల్​ చేస్తున్న.. డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టించిన ఊర్లల్లో నువ్వు ఓట్లు అడుగు.. ఇందిరమ్మ ఇండ్లున్న ఊర్లలోమేం ఓట్లడుగుతం. మీకు డిపాజిట్లు వస్తే చూస్కుందం” అని అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో మోదీకి, కేసీఆర్​కు సవాల్​ విసురుతున్న. వందరోజుల్లో మా పరిపాలన మీ(జనం) ముందట పెట్టినం.. మా పాలసీలు అమలు చేసినం. వందరోజుల్లో మేం మంచి పాలన చేస్తే.. మాకు ఓటు వేయండి. 14  సీట్లల్లో గెలిపించండి. మేం నిజాయితీగా కడుపు కట్టుకొని, రోజుకు 18 గంటలు కష్టపడి ఆరు గ్యారంటీలను అమలు చేసి మీ ముందుకు వచ్చినం. తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలంటే, కేంద్రం నుంచి మనకు రావాల్సినవి రావాలంటే 14 ఎంపీ సీట్లు కావాలి. రాహుల్​గాంధీని ప్రధాని చేయాలంటే మీ సహకారం కావాలి”అని ప్రజలను ఆయన కోరారు.