హెచ్ సిటీ పనుల ఆలస్యంపై సీఎం ఫైర్​ .. బల్దియాలో కదలిక

హెచ్ సిటీ పనుల ఆలస్యంపై సీఎం ఫైర్​ .. బల్దియాలో కదలిక
  • ప్రభుత్వం నిధులిస్తున్నా లేట్​ ఎందుకంటూ ఆగ్రహం  
  • ఆగమేఘాలపై స్థలాల పరిశీలన..టెండర్​ నోటిఫికేషన్​
  •  27 నుంచి మార్చి 24 వరకు సమయం
  • రూ.1, 090 కోట్ల అంచనా   
  • కేబీఆర్ పార్క్ చుట్టూ  7 ఫ్లై ఓవర్లు, 6 అండర్ పాస్‌‌లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హెచ్ సిటీ(హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్,ట్రాన్స్ ఫర్ మేటివ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్) పనుల ఆలస్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్లు తెలిసింది. ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని, కనీసం డీపీఆర్లు కూడా ఎందుకు ఫైనల్​చేయడం లేదని వారం కింద జరిగిన ఓ మీటింగ్​లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో బల్దియా, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు అధికారులు అలర్టయ్యారు.

మీటింగ్ పూర్తయిన వెంటనే మూడుశాఖల అధికారులు కలిసి హెచ్ సిటీ పనులు చేపట్టే ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే స్టాండింగ్ కమిటీలోనూ ఇందుకు సంబంధించిన పనులు చేపట్టేందుకు ఆస్తుల సేకరణ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆ తర్వాత బల్దియా ఇంజినీరింగ్ అధికారులు కూడా పనుల్లో నిమగ్నమయ్యారు.

కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాలకు నోటీఫికేషన్ రిలీజ్​చేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఈ నెల 27 నుంచి మార్చి 24 వరకు టెండర్లు స్వీకరించనున్నారు. మార్చి10న ఫ్రీ బిడ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మార్చి 24  సాయంత్రం 4 గంటల తర్వాత టెక్నికల్ బిడ్ ఓపెన్​చేయనున్నారు. మార్చి 26 సాయంత్రం 4 గంటలకు ప్రైస్ బిడ్ ఓపెన్ చేసి అర్హత సాధించిన వారి వివరాలను సర్కారుకు పంపించనున్నారు. ఆ తర్వాత టెండర్లు అప్పగించి పనులు మొదలుపెట్టనున్నారు. 

ఫస్ట్​ ఫేజ్​ రూ.580 కోట్లు.. సెకండ్ ​ఫేజ్ ​510 కోట్లు 

 నగరంలో చేపట్టే పనుల్లో హెచ్ సిటీ పనులే కీలకం కానున్నాయి. హెచ్-సిటీ ద్వారా రూ. 7032 కోట్లతో  25 పనుల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్ఓబీలు ఉన్నాయి. వీటితో పాటు రోడ్డు విస్తరణకి సంబంధించిన మరో 13 పనులున్నాయి. ఇందులో ప్రధానంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు ఫ్లై ఓవర్లు, ఆరు అండర్ పాస్‌‌లను రెండు ప్యాకేజీల కింద చేపట్టనున్నారు.

మొదటి ప్యాకేజీలో రూ.580 కోట్ల అంచనా వ్యయంతో కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌‌పోస్ట్ జంక్షన్, ముగ్ధా జంక్షన్ వద్ద మూడు స్టీల్​బ్రిడ్జీలు, అలాగే పార్కు ఎంట్రెన్స్ , జూబ్లీహిల్స్ చెక్ పోస్టు  వద్ద రెండు అండర్ పాస్‌‌లను నిర్మించనున్నారు. రూ.510 కోట్లతో సెకండ్ ప్యాకేజీ కింద రోడ్​నంబర్​45 జంక్షన్, ఫిల్మ్‌‌నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద నాలుగు స్టీల్ బ్రిడ్జీలు, నాలుగు అండర్ పాస్‌‌లు నిర్మించనున్నారు. ఈ పనులు ఏడాదిన్నరలో పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నారు.

పెద్ద టాస్క్​ భూ సేకరణే..  

కేబీఆర్‌‌‌‌ పార్కు చుట్టూ రోడ్ల విస్తరణ కోసం 300 వరకు ఆస్తులు సేకరించాల్సి ఉంటుంది. ఇందులో సుమారు 195 ఆస్తులకు సంబంధించి టీడీఆర్(ట్రాన్స్ ఫరేబుల్ డెవలప్ మెంట్ రైట్స్) తీసుకోగా, 105 ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. దీనిపై రిపోర్ట్​ రెడీ చేసిన జీహెచ్ఎంసీ ల్యాండ్ అక్విజిషన్ -డిపార్టుమెంట్ నివేదికను బల్దియా కమిషనర్ కు అందజేసింది.

ఈ రిపోర్ట్ నే స్టాండింగ్ కమిటీ ముందు పెట్టారు. అలాగే పార్కు చుట్టూ ఉన్న 2 వేల చెట్లను తొలగించి వేరేచోట ట్రాన్స్ ప్లాంట్​చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద టాస్క్​గా మారనున్నది. ఆస్తలు సేకరణకు సంబంధించి ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఏం చేయాలన్నదానిపై కూడా అధికారులు ఆలోచన చేస్తున్నారు.  

ఎన్జీటీని ఆశ్రయించేందుకు సిద్ధం

కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాలు చేపట్టవద్దని గత ప్రభుత్వ హయాంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్​ను పర్యావవరణవేత్తలు ఆశ్రయించారు. అప్పట్లో పనులకు బ్రేక్ పడడంతో పర్యావరణవేత్తలు కూడా విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు బల్దియా టెండర్ నోటిఫికేషన్​ఇవ్వడంతో మరోసారి ఎన్జీటీని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.

ఈకో సెన్సిటివ్ జోన్ లో నిర్మాణాలు వద్దని, తమకు మద్దతుగా గతంలోనే ఎన్జీటీ స్టే ఆర్డర్ ఇచ్చిందని పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో ఈ వారంలో ఎన్జీటీని ఆశ్రయిస్తామన్నారు.