హరితహారం పథకంలో జరిగిన అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై ఆరా తీసిన సీఎం, హరితహారం కోసం చేసిన ఖర్చుకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారని అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక, మాజీ మంత్రి హరీశ్‌రావు స్వగ్రామం తోటపల్లి, ఎంపీ జోగినపల్లి సంతోష్ స్వగ్రామం కొదురుపాక, ఎమ్మెల్సీ కవిత అత్తగారి గ్రామం పొతంగల్‌కు హరితహారం కింద కేటాయించిన నిధుల వివరాలను తొలుత అందించాలని సీఎం ఆదేశించారు. ఆయా గ్రామాలకు హరితహారం ప్రారంభమైనప్పటి నుంచి కేటాయించిన నిధులు, నాటిన మొక్కలు, వాటిలో బతికిన మొక్కల సంఖ్య తదితర వివరాలతో అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు
బయట నుంచి మొక్కలు ఎంతకు కొన్నరు?
రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని 2015లో కేసీఆర్ సర్కార్ ప్రారంభించింది. గతేడాది చివరినాటికి ఈ కార్యక్రమం కింద 273.33 కోట్ల మొక్కలు నాటామని అటవీ శాఖ లెక్కలు చెప్తున్నాయి. హరితహారం కోసం రూ.10,822 కోట్లు ఖర్చు చేసినట్టు అప్పటి సర్కార్ ప్రకటించింది. హరితహారంలో నాటే మొక్కల పెంపకం కోసం 14,864 నర్సరీలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో నర్సరీలు ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం, పక్కనున్న ఏపీ నుంచి భారీ మొత్తంలో మొక్కలు కొనుగోలు చేసింది. ఈ మొక్కల కొనుగోలుకు వందల కోట్లు వెచ్చించినట్టు రికార్డుల్లో పేర్కొంది. ఏయే నర్సరీ నుంచి ఎన్ని మొక్కలు కొన్నారు? ఎక్కడ నాటారు? ఆ మొక్కల కొనుగోలుకు ఎంత వెచ్చించారు? సుమారు 15 వేల నర్సరీలు ఉండగా, బయటి నుంచి మొక్కలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది వంటి వివరాలను సీఎం అడిగినట్టు సమాచారం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఫారెస్ట్ పద్దుపై చర్చ నాటికి తనకు నివేదిక అందాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు.