13 నుంచి సీఎం విదేశీ పర్యటన..17 వరకు ఆస్ట్రేలియా.. ఆ తరువాత సింగపూర్​

13 నుంచి సీఎం విదేశీ పర్యటన..17 వరకు ఆస్ట్రేలియా.. ఆ తరువాత సింగపూర్​

క్వీన్స్​ల్యాండ్​ వర్సిటీ, స్టేడియాలు, మాల్స్​ నిర్మాణాల పరిశీలన
19న వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం కోసం దావోస్​కు.. 23 వరకు అక్కడే

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి దాదాపు పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్​లో ఆయన పర్యటిస్తారు.  మొదట ఈ నెల13వ తేదీ రాత్రి సీఎం బృందం ఆస్ట్రేలియా బయలుదేరుతుంది.14, 15, 16,17 నాలుగు రోజులపాటు ఆస్ట్రేలియాలో సీఎం టీమ్​పర్యటన ఉంటుంది. అక్కడ క్వీన్స్​లాండ్​ యూనివర్సిటీని పరిశీలించనుంది. రాష్ట్రంలో స్పోర్ట్స్​ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. 

అందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని క్వీన్స్​ల్యాండ్ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించనున్నారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు జితేందర్​ రెడ్డి, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్పోర్ట్స్ ఎండీ సోనీ బాల, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి వెళ్తారు. ఆ తర్వాత ఈ నెల 18న సింగపూర్ చేరుకోనున్న సీఎం టీమ్.. అక్కడ షాపింగ్ మాల్స్, క్రీడా స్టేడియాల నిర్మాణాలను పరిశీలిస్తుందని అధికారులు తెలిపారు.  సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరగనున్న పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారని తెలుస్తోంది. అనంతరం 19వ తేదీన సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌లోని దావోస్​కు సీఎం టీమ్​ వెళ్తుంది.

23 వరకు దావోస్​లోనే.. 


 ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు దావోస్‌‌‌‌‌‌‌‌లో ‘వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం’ 55వ వార్షిక సదస్సు జరగనుంది. సీఎంతో పాటు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌‌‌‌‌‌‌‌ రంజన్, ఇతర ఉన్నతాధికారులు 3  రోజులు ఆ సదస్సులో పాల్గొంటారు. అక్కడ 21 నుంచి 23 వరకు వారు పర్యటిస్తారు.2024లో దావోస్‌‌‌‌‌‌‌‌ పర్యటన సందర్భంగా సుమారు రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో చేసుకుంది. ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి బృందం ప్రణాళికలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.