ఫ్రీ బస్ స్కీమ్​తో ఆర్టీసీకి లాభాలు

  • సంస్థకు ఇప్పటి వరకురూ.4 వేల కోట్లు చెల్లించినం: సీఎం రేవంత్ 
  • ఆడబిడ్డలకు ప్రతి నెలా ఐదారు వేలు ఆదా అవుతున్నయని వెల్లడి 
  • రవాణాశాఖ కొత్త లోగో,స్ర్కాప్ పాలసీ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఫ్రీ బస్ స్కీమ్ తో ఆడబిడ్డలకు ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి ప్రతి నెలా రూ. 10 వేల మేర ప్రయోజనం కలిగేలా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ‘‘ఫ్రీ బస్ స్కీమ్ తో ఆర్టీసీ లాభాల బాట పట్టింది. 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్లు చెల్లించాం” అని వెల్లడించారు.

 ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం రవాణా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక భూమిక పోషించారని కొనియాడారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని ఆనాటి పాలకులపై మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మె టైమ్ లో 54 మంది కార్మికులు చనిపోతే, కనీసం ఆ కుటుంబాలను కూడా కేసీఆర్ పరామర్శించలేదని ఫైర్ అయ్యారు. 

రెండేండ్లలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు.. 

హైదరాబాద్ లో కాలుష్య నియంత్రణలో రవాణా శాఖదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ అన్నారు. ‘‘కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ కు పంపాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉంది. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా రవాణా శాఖదే. రాబోయే రెండేండ్లలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతాం” అని తెలిపారు. సిటీలో ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకునేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. మూసీని గోదావరికి అనుసంధానం చేస్తామన్నారు. కాగా, అంతకుముందు రవాణా శాఖ కొత్త లోగోను, సాధించిన విజయాలపై రూపొందించిన బ్రోచర్ ను సీఎం ఆవిష్కరించారు. అలాగే స్క్రాప్ పాలసీ అమలుకు సంబంధించిన పేపర్లను అధికారులకు అందజేశారు. కారుణ్య నియామకాల కింద అపాయింట్ అయినోళ్లకు నియామక పత్రాలు ఇచ్చారు. ఫ్రీ బస్ స్కీమ్ కు సంబంధించి రూ. 3,902.31 కోట్ల చెక్కును అధికారులకు అందజేశారు. రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన విజయాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. 

ఏడాదిలో ఎన్నో సంస్కరణలు: పొన్నం 

రవాణా శాఖలో ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకువచ్చి, ఎన్నో విజయాలు సాధించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ‘‘ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ లో రావొద్దని ఈవీ పాలసీ తీసుకొచ్చాం. స్క్రాప్ పాలసీని తెచ్చి, 15 ఏండ్ల కాల పరిమితి పూర్తయిన వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం.

 ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్, ఆటోమేటిక్ డ్రైవింగ్ సెంటర్స్ తెస్తున్నాం. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్ నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం” అని తెలిపారు. కేసీఆర్ గత పదేండ్లలో ఆర్టీసీని చంపి బొందపెట్టారని, ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని 10 నెలల్లోనే లాభాల్లోకి తెచ్చామన్నారు.