- ప్రభుత్వం పడిపోతదని ఇంకోసారి అంటే ఉరికిస్తం
- సీఎం పదవి అంటే ఫుల్ బాటిలనుకున్నవా.. కూలదోయడానికి
- తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన మోదీకి ఓట్లడిగే హక్కు లేదు
- నాతోపాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అర్హుడు
- యాదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని వెల్లడి
- భువనగిరి కార్నర్ మీటింగ్‌లో ప్రసంగం
- రేవంత్ హై టెన్షన్ వైరు.. మేము ట్రాన్స్ఫార్మార్లం: మంత్రి వెంకట్‌రెడ్డి
- ముట్టుకుంటే మాడిపోతారని కేసీఆర్, కేటీఆర్‌కు హెచ్చరిక
- కేసీఆర్ చేసిందంతా ఇదే: సీఎం రేవంత్
యాదాద్రి వెలుగు: ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమం పేరుతో తరుచూ ఎలక్షన్లు తెచ్చి, సెలక్షన్ చేసుకున్న ఆంధ్రా కాంట్రాక్టర్ల దగ్గర వేల కోట్లు కలెక్షన్ చేసిన బీఆర్ఎస్ లీడర్లు పంది కొక్కుల్లా బలిశారు” అని ఆయన అన్నారు. ప్రభుత్వం పడిపోతుందని పదేపదే కేసీఆర్ అంటున్నారని, ఇంకోసారి అట్ల అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
‘‘సీఎం పదవి నీ అయ్య జాగీరా? లేదంటే నువ్వు తాగి పడేసిన ఫుల్ బాటిల్ అనుకుంటున్నవా.. తోస్తే పడిపోవడానికి! ఇంకోసారి నోట్లో నుంచి ప్రభుత్వం పడిపోతదనే పదం వస్తే మా కార్యకర్తలు నీ లాగులో తొండలు పెట్టి ఉరికిస్తరు’’ అని కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోయాలి? పదేండ్లు మీరు(బీఆర్ఎస్) అధికారంలో ఉండి చేయని పనులు మేము వందరోజుల్లో చేసినందుకా? మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకా? ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినందుకా? మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకా? మోదీ, కేడీ కలిసి సిలిండర్ రేటును రూ.1,200 చేస్తే దానిని రూ.500 కు తగ్గించినందుకా?” అని నిలదీశారు.
30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే వాళ్లను వదిలిపెట్టి తన కుటుంబానికి మాత్రమే పదవులు ఇచ్చుకున్న ఘనత కేసీఆర్‌ది అని రేవంత్ విమర్శించారు. టీఎస్పీఎస్సీ పత్రాలను కిరాణా కొట్లలో అమ్మిన ఘనత కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
కేసీఆర్‌ది దొంగ దీక్ష
‘‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేస్తే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం తన మంత్రి పదవిని త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. నల్గొండ, భువనగిరి ప్రాంతం అంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గుర్తొస్తడు.. చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి లాంటి ఎంతో మంది త్యాగధనులు గుర్తుకొస్తరు. అలాంటి భువనగిరి కాంగ్రెస్ కు కంచుకోట. కంచుకోట నుంచి 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇక్కడి ప్రజలు దీవించి గెలిపిస్తే పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి మీ ముందు ఉంచారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
‘‘రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి భువనగిరికి డబుల్ ఇంజన్ లాంటి వాళ్లు.. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకట్రెడ్డికేనని మనస్ఫూర్తిగా చెప్తున్న. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో ఒక్క నిమిషం కూడా కూర్చోలే. తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడుతున్న.. రోజుకు 1,500 మందిని కలిసి వారి సమస్యలను పరిష్కరించేలా ప్రజాపాలన కొనసాగిస్తున్న.. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి మస్కా కొడుతున్నాడని భూమికి మూరెడు లేని ఒకడు వాగుతున్నడు (మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ). కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ మూడు రంగుల జెండాను భుజనా మోసి నాయకులుగా ఎదిగారు.. నీలాగా(జగదీశ్‌రెడ్డి) దొరల గడిలో సారాలో సోడా కలిపి మంత్రి కాలేదు..’’ అని ఆయన అన్నారు.
బీజేపీకి ఎందుకు ఓటేయాలి..?
‘‘పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఏర్పాటు చేశారని, తల్లిని చంపి పిల్లను బతికించారని మోదీ అంటున్నడు. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిండు. ఔను.. మేము బరాబర్ పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఏర్పాటు చేసినం. దీన్ని తప్పు అన్న మోదీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది?’’ అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పాలమూరుకు జాతీయ హోదా ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటేయాలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘నరేంద్ర మోదీ దెబ్బకు దేశంలోని పార్లమెంటరీ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. అంబేద్కర్ రాజ్యాంగం నిలబడాలంటే ఇండియా కూటమి దేశంలో అధికారంలోకి రావాలి” అని అన్నారు. ‘‘భువనగిరిలో బీజేపీ గెలుపు కోసం తెరవెనుక కేసీఆర్ కృషి చేస్తున్నడు. క్యామ మల్లేశ్‌ను ముందు పెట్టి వెనుక నుంచి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యకు కేసీఆరే బూర ఊదుతున్నడు. గొల్ల కురుమలను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నడు. వెనుక గూడుపుఠాని నడుపుతున్నడు. కేసీఆర్ ప్రతి ఎన్నికల్లో కమ్యూనిస్టులను వాడుకొని కరివేపాకు లాగా పారేసిండు. మేము కమ్యూనిస్టులకు అమిత గౌరవం ఇస్తున్నం. బీజేపీని గద్దె దించేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మాతో కలిసి రావాలి” అని ఆయన తెలిపారు.
చామల గెలిస్తే యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చుకుందం
భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్‌ను 3లక్షల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను రేవంత్ కోరారు. ‘‘ఆయన విజయం సాధిస్తే యాదాద్రిని మళ్లీ యాదగిరి గుట్టగా మార్చుకుందాం. మూసీని ప్రక్షాళన చేసి మురికి నుంచి విముక్తి కల్పిద్దాం. గంధమల్ల, బ్రాహ్మణ వెల్లం, ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పిద్దాం. ఈ బాధ్యతలన్నింటినీ సీఎంగా నేను తీసుకుంటా’’ అని ఆయన హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని, పంటలకు రూ.500 బోనస్ ఇచ్చే బాధ్యత కూడా తనదేనని చెప్పారు.
రేవంత్ హై టెన్షన్ వైరు.. మేము ట్రాన్స్ఫార్మార్లం: మంత్రి వెంకట్‌రెడ్డి
మాటిమాటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్, కేటీఆర్ ప్రగల్బాలు పలుకుతున్నారని, చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ‘‘తండ్రి కొడుకులకు చెప్తున్నా.. ఇక్కడ రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్ అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి పవర్ ట్రాన్స్ఫార్మర్లం. ముట్టుకుంటే మాడిపోతరు” అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన జీరో బిల్లు వస్తుందో లేదో ఫామ్ లో పండుకున్న కేసీఆర్‌కు తెలిసేలా కార్యకర్తలు నినాదాలు చేయాలని ఆయన సూచించారు. ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ కు అసలు పోటీ లేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలి” అని అన్నారు. నల్గొండ ఎంపీ సీటును ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తామని.. మెజార్టీ విషయంలో నల్గొండకు, భువనగిరికి మధ్య పోటీ ఉండాలని, ఈ రెండు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి బ్రదర్స్ మస్కా కొడుతున్నరని జగదీశ్ రెడ్డి అంటున్నడు.
జగదీశ్ రెడ్డీ.. నువ్వు కేసీఆర్ కు మందు పోసుడు తప్ప చేసిందేంది? మీ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడన్నా మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసిండా? రేవంత్ అట్ల కాదు. మంత్రులను, ఎమ్మెల్యేలను సొంత అన్నదమ్ముల్లాగా కలుస్తున్నడు” అని ఆయన పేర్కొన్నారు. యాదగిరిగుట్ట సాక్షిగా ఇంకా 15 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని అన్నారు. ‘‘పదేండ్లలో ఒక్క ఇల్లు కట్టని వేస్ట్ ఫెలో గురించి ఎంత మాట్లాడినా వేస్ట్” అని కేసీఆర్‌పై మండిపడ్డారు.
రేవంత్‌కు కుడి భుజం వెంకట్‌రెడ్డి.. ఎడమ భుజం నేను: రాజగోపాల్‌రెడ్డి
రాష్ట్రంలో అసలు ఆట ఇప్పుడే మొదలైందని భువనగిరి కాంగ్రెస్ లోక్‌సభ సెగ్మెంట్ ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజకీయాలు వేడెక్కాయని తెలిపారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డికి కుడి భుజం వెంకట్‌రెడ్డి అయితే.. ఎడమ భుజం రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డికి కోమటి రెడ్డి బ్రదర్స్ తోడైతే ఎవడైనా తట్టుకుంటడా?భువనగిరి అడ్డా అంటేనే కాంగ్రెస్ అడ్డా అని కార్యకర్తలు నిరూపించాలి” అని ఆయన అన్నారు. పదేండ్లు అప్పుల పాలైన తెలంగాణను గాడిలో పెట్టే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ కు రాజకీయంగా భువనగిరి ప్రాణం పోసిందని, అందుకే భువనగిరి లోక్‌సభ స్థానానికి అనేక సేవలందించామని చెప్పారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి లోక్‌సభ స్థానాన్ని గెలిపించే బాధ్యత మాపై పెట్టిండు. తప్పకుండా గెలుస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో నల్గొండ లోక్‌సభ స్థానం ఎక్కువ మెజార్టీ వస్తదా, భువనగిరికి మెజార్టీ ఎక్కువ వస్తదా అనేది మాత్రమే చూసుకోవాలి.
భువనగిరి స్థానాన్ని గెలిపించే బాధ్యత మాదైతే.. అభివృద్ధి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటడు” అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి, జనగాం డీసీసీ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి,సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ పర్యటన
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్ గిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో సీఎం పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం11 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం ఒంటి గంటకు నిజామా బాద్, సాయంత్రం 4.15 గంటలకు మల్కాజ్ గిరి లోక్‌సభ సెగ్మెంట్లోని మేడ్చల్ బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.