- ఫామ్‌హౌస్‌లు కాపాడుకునేందుకే కేటీఆర్, హరీశ్ దొంగ ఏడుపులు: సీఎం రేవంత్
- రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీసేలా వాట్సాప్ వర్సిటీ ఫేక్ ప్రచారం
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చాలని చూసేవారి భరతం పడ్తం
- మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరు.. పేదల జోలికి వెళ్లం
- పెద్దల ఫామ్‌హౌస్‌లపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని వెల్లడి
- రాజీవ్ సద్భావన యాత్ర స్మారక దినోత్సవంలో సీఎం ప్రసంగం
- మాజీ మంత్రి గీతారెడ్డికి అవార్డు ప్రదానం
హైదరాబాద్, వెలుగు : ఎవరెన్ని కుట్రలు చేసినా హైడ్రా ఆగదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్ద పెద్ద భవంతులను నిర్మించుకున్న కబ్జాదారుల భరతం పట్టేందుకే హైడ్రా పని చేస్తుందని తెలిపారు. ‘‘అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన మదపుటేనుగులను అణచడానికే హైడ్రా అంకుశంలా పనిచేస్తుంది. ఆక్రమణలకు పాల్పడ్డ బడా బాబుల పట్ల హైడ్రా భూతంగానే ఉంటుంది. కానీ పేదల జోలికి వెళ్లదు’’ అని పేర్కొన్నారు. శనివారం చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవం సందర్భంగా పీసీసీ నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చీఫ్ గెస్ట్‌గా హాజరై, మాట్లాడారు. ‘మూసీలో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టదు, మూసీ వద్దకు హైడ్రా రాదు.
మూసీ రివర్ బెడ్లో ఉన్న ప్రజలను ఒప్పించకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ అనుమతులతో ఇండ్లు నిర్మించుకున్న వాళ్లకు తాము అండగా ఉంటామని, అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సీఎం భరోసా ఇచ్చారు. ట్రాఫిక్ సమస్య, నాలాల పునరుద్ధరణ, చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడం, కబ్జాలు తొలగించడం హైడ్రా పని అని తెలిపారు. చిన్నపాటి వానకే హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నదని, చెరువులు, కుంటల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చేయడం, నాలాల్లో కట్టడాలను కూల్చివేసి డ్రైనేజీ వ్యవస్థను సెట్ చేయడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.
రియల్ ఎస్టేట్ రంగానికి అండగా ఉంటం
మురికి పక్కన నివసిస్తున్న మూసీలోని కుటుంబాలకు గత ప్రభుత్వం దాచిపెట్టుకున్న డబుల్ బెడ్రూం ఇండ్లను తాము పంచుతున్నామని సీఎం రేవంత్ చెప్పారు. వారి ప్రయాణ ఖర్చుల కోసం రూ.25 వేల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. మూసీ నిర్వాసితులకు ఇండ్లు ఇచ్చి, వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. వాళ్ల ఇండ్లు కూలగొట్టేందుకు బుల్డోజర్లు అవసరం లేదని, వారే స్వచ్ఛందంగా కూల్చేసుకొని తలుపులు, కిటికీలు తీసుకొని డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళ్తున్నారని వెల్లడించారు. ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన హామీ మేరకు భోజగుట్ట ప్రజలకు కూడా మేలు చేస్తామని, వారికి కూడా ఇండ్లు కేటాయిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
మూసీ పునరుజ్జీవం వేరు, హైడ్రా వేరని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ‘‘రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ రంగం వారికి నేను భరోసా ఇస్తున్నా. మీరు భయపడొద్దు. మీకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది” అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూసే ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతామని హెచ్చరించారు.
రాజీవ్‌గాంధీ స్ఫూర్తిని కొనసాగిస్తున్నం
దేశ సమగ్రత కోసం 34 ఏండ్ల క్రితం రాజీవ్ గాంధీ ఇక్కడే సద్భావన యాత్ర చేపట్టారని, ఏటా వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన మాజీ మంత్రి గీతారెడ్డిని సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రధాని పదవులను త్యాగం చేసిన ఘనత సోనియా, రాహుల్ ది అని, పదవులను ఇతరులకు ఇచ్చి దార్శకనికతను చూపిన గొప్ప వ్యక్తులు అని కొనియాడారు. గాంధీ కుటుంబానికి, దోపిడీ చరిత్ర ఉన్న వారికి పోలికా అంటూ ఫైర్ అయ్యారు.
రేవంత్‌కు 90 శాతం మందిప్రజల మద్దతు : పీసీసీ చీఫ్
సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా నిర్వహించతలపెట్టిన పనులకు 90 శాతం మంది ప్రజల మద్దతు ఉన్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన రాజీవ్ గాంధీ అడుగు జాడల్లో నడుస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం పదేండ్లు దోచుకొని, ఇప్పుడు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
మూసీకి రూ. 1.50 లక్షల కోట్లు అని ప్రచారం చేస్తున్నారని, వారి మాదిరిగా తమది దోపిడీ చేసే నైజం కాదని చురకలంటించారు. చార్మినార్ వేదికగా ఏటా జరిగే ఈ కార్యక్రమం తమ అందరికీ తీపి గుర్తని తెలిపారు. నిజాం ప్రభువు దూరదృష్టి గల వ్యక్తి అని, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని చెప్పారు. రాజీవ్ సద్భావన అవార్డుకు గీతారెడ్డి తగిన వ్యక్తి అని పేర్కొన్నారు.
తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ : మంత్రి ఉత్తమ్
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పార్టీ బలోపేతం విషయంలో తన సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ను నమ్ముకున్న ప్రతి ఒక్కరినీ పార్టీ గుర్తిస్తుందని, ఇందుకు పీసీసీ చీఫ్ గా మహేశ్‌కుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమన్నారు. దేశాన్ని మత రాజకీయాలతో విచ్ఛిన్నం చేసే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు రాజీవ్ గాంధీ సరిగ్గా 34 ఏండ్ల కింద సద్భావన యాత్ర చేపట్టారని తెలిపారు.
దేశం కోసం, దేశ సమగ్రత కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందన్నారు. దేశాన్ని హిందూ, ముస్లింలుగా విభజించే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. మత రాజకీయాలతో లబ్ధి పొందేందుకు కొన్ని రాజకీయ పక్షాలు ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.
హైడ్రా అనగానే ఆ ముగ్గురూ బయటకొస్తున్నరు
హైడ్రా అనగానే హరీశ్, కేటీఆర్, ఈటల రాజేందర్.. ముగ్గురూ బయటకు వస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారని, తాము పేదవారిని గుండెల్లో పెట్టుకుంటుంటే బీఆర్ఎస్ నేతలు గుండెలు బాదుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ఫాంహౌస్ లను కాపాడుకునేందుకు మూసీపై కేటీఆర్, హరీశ్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని, దొంగ నాటకాలు స్టార్ట్ చేశారని మండిపడ్డారు. అందుకే బుల్డోజర్లకు అడ్డం పడుకుంటామని హరీశ్, కేటీఆర్ అంటున్నారని ధ్వజమెత్తారు. “ఎవరొస్తరో రండ్రి.. నువ్వొస్తవా..? ఫాంహౌస్ లో బోర్లా పండుకున్నోడు వస్తడా రండ్రి.. బుల్డోజర్లు రెడీ పెట్టినం.. నడిపేందుకు మావోళ్లు రెడీగా ఉన్నరు ’’ అని ఫైర్ అయ్యారు. “ నీ ఫాంహౌస్ కాడికి రమ్మంటవా..? ఎప్పుడు రమ్మంటవో చెప్పు అప్పుడే వస్త” అంటూ హరీశ్ రావుకు సవాల్ విసిరారు. బిల్లా, రంగాల దొంగ నాటకాలు సాగవని హరీశ్, కేటీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.
అజీజ్ నగర్ లో హరీశ్ రావు, జన్వాడలో కేటీఆర్.. చెరువులను ఆక్రమించే ఫాంహౌస్ లు కట్టుకున్నారని ఆరోపించారు. ‘‘ కేటీఆర్.. 111 జీవో ఉల్లంఘించి 50 ఎకరాల్లో భవంతి కట్టుకున్నవా లేదా..? హరీశ్ రావు.. నాలాను ఆక్రమించి ఫాంహౌస్ కట్టుకున్నవా లేదా? ” అని ప్రశ్నించారు. వాటిని నిగ్గు తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. ‘‘ హరీశ్...నేను నీలా చెప్పులు మోసేటోన్ని కాదు.. నా ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకొని బిచ్చమెత్తుకున్న రోజులు మర్చి పోయినవా? చెప్పులు కొనుక్కోవాలనుకున్నా.. నా ఇంటికి వచ్చి అడుకున్న సంగతి యాదికి లేదా?” అని ప్రశ్నించారు.
“గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను ఆక్రమించుకొని ఫాంహౌస్ లు కట్టుకున్న వాళ్లు పేదలు కాదు, పెద్దోళ్లు. వాళ్లు డ్రైనేజీ నీళ్లను మూసీలోకి వదులుతున్నరు. వీటిని మూసీ పక్కన ఉన్న పేదలు తాగాలా? ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని చెరువుల్లో వేసి తొక్కుతం. మిమ్నల్ని వంగపెట్టి పోలీస్‌స్టేషన్‌లో బట్టలిప్పదీసి కొట్టాలె”
- సీఎం రేవంత్ రెడ్డి