హైదరాబాద్: తన ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం (నవంబర్ 25) వెళ్తోన్న ఢిల్లీ టూర్ మంత్రివర్గ విస్తరణ కోసమో, రాజకీయాల కోసమో కాదని.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు విహహం కోసమే ఢిల్లీ వెళ్తున్నానని క్లారిటీ ఇచ్చారు. ఈ ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 2024, నవంబర్ 25న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఢిల్లీ పర్యటనలపై కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు.. వాళ్లలా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికో.. కేసుల మాఫీ, బెయిల్, ఫైరవీల కోసమో మేం ఢిల్లీకి వెళ్లట్లేదని.. కేంద్రం నుండి రావాల్సిన నిధులపై చర్చించేందుకు వెళ్తున్నామని కౌంటర్ ఇచ్చారు.
28 సార్లు ఢిల్లీకి వెళ్లారని విమర్శిస్తున్నారు.. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులకు కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా.. నిధులు సాధించుకుంటానని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని.. లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేస్తామని తెలిపారు.
ఎయిర్ పోర్టు, మెట్రో రైలు అంశాలతో పాటు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న నిధులపై చర్చిస్తామన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, అనుమతులపై తాను అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులను కలుస్తానని చెప్పారు. కేంద్రంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అంటకాగి బయ్యారం, కాజీపేట ఫ్యాక్టరీలు రాకుండా చేసిందని ఫైర్ అయ్యారు. మేం మాత్రం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటి కోసం కేంద్రంతో కొట్లాడి సాధించుకుంటామని.. మీ కడుపు మంట.. మీ దు:ఖాన్ని మేం పట్టించుకోమని అన్నారు.
ALSO READ | అదే జరిగితే కేటీఆర్ కంటే ముందే కవిత సీఎం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి