- దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగమిచ్చే ఫైలుపై రెండోది
- అభయ హస్తానికి చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం
- మీ కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంట.
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి తొలి సంతకం పెట్టారు. గురువారం ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆరు గ్యారంటీల ‘అభయ హస్తం’ పథకానికి చట్టబద్ధత కల్పించే ఫైలుపై సంతకం చేశారు. తర్వాత దివ్యాంగురాలు రజనీకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఫైలుపై సంతకం చేశారు.
అక్టోబర్ 17న గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డిని కలిసి రజనీ తన గోడును వెళ్లబోసుకుంది. ఆమె బాధను అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి.. నాడు పీసీసీ చీఫ్ హోదాలో గ్యారంటీ కార్డును రాసిచ్చారు. ప్రమాణ స్వీకారం రోజున ఎల్బీ స్టేడియానికి రావాల్సిందిగా చెప్పారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియానికి రావాలని ఆమెతోపాటు కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆహ్వానం పంపింది. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా రజనీ నియమితురాలైంది. నెలకు రూ.50 వేల జీతంతో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామక ఉత్తర్వులిచ్చారు.
నా గుండెల నిండా మీ శక్తిని నింపుకుంట. కార్యకర్తలందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యతను నాయకుడిగా నేను తీసుకుంట. ఢిల్లీలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా మీ బాధ్యతలు తీసుకుంటరు. నిరుద్యోగులు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలను తీర్చేలా పాలనను ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణకు పట్టిన చీడ, పీడ నుంచి విముక్తి కలిగించి ఈ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి వేలాదిగా తరలివచ్చిన అందరికీ ధన్యవాదాలు.
- సీఎం రేవంత్‌రెడ్డి